డాక్టర్ జెబా మూపెన్… స్కూబా డైవింగ్… ఫ్రీడైవింగ్ ఆమె జీవిత గమనాన్నే మార్చివేసింది. అది ఆమె మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడింది. ఆమె సాధించిన విజయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఫ్రీడైవింగ్‌లో నేషనల్ రికార్డ్ హోల్డర్ అయిన ఆమె సముద్రంతో ప్రేమలో పడింది. సొరచేపలతో కలిసి ఈత కొట్టింది. వాస్తవానికి ఓ వైద్యురాలిగా ఉన్న ఆమెకు సముద్రపు అద్భుతాలను అన్వేషించాలనే ఆలోచన ఎలా వచ్చిందో మనమూ తెలుసుకుందాం…
17 ఏండ్లు ఉన్నప్పుడు డాక్టర్ జెబా మూపెన్ యూఏఇలో స్కూబా డైవింగ్ సర్టిఫికేషన్ కోసం శిక్షణ తీసుకోవాలని నిర్ణయించు కుంది. ఇది తన జీవిత గమనాన్ని శాశ్వతంగా మారుస్తుందని అప్పుడు ఆమె అస్సలు ఊహించలేదు. అయితే ఆ మార్పు వెంటనే జరగలేదు. ఎనిమిదేండ్ల తర్వాత 25 ఏండ్ల వయసులో కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినప్పుడు మూపెన్ తన కోరికను ఆచరణలో పెట్టింది. ”అప్పుడు నేను ఒక విచిత్రమైన ప్రదేశంలో ఉన్నాను. నాకేం కావాలో గుర్తించాను. నేను నా కోసం సృష్టించుకున్న ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఎక్కువ భాగం గడిపాను. ఆ సమయంలో నేను నా మానసిక ఆరోగ్యంతో చాలా పోరాడుతున్నాను. అప్పుడే నేను అనుకున్నాను, నా దగ్గర సర్టిఫికేషన్ ఉంది, దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు అని?” అంటూ ఆమె గుర్తు చేసుకుంది.
వైద్యం నుండి సముద్రంలోకి
అప్పుడు మూపెన్ నీటిని కౌగిలించుకుంది. అది ఆమెకు బాగా నచ్చింది. అప్పటి నుంచి మూపెన్ వెనక్కి తిరిగి చూడలేదు. సముద్రం ఆమెను పిలుస్తూనే ఉంది. ఆ పిలుపును ఆమె వినడం కొనసాగించింది. రెండేండ్ల కిందట ఆమె ఫ్రీడైవింగ్ క్రీడలోకి కూడా ప్రవేశించింది. ఇటీవల ఆమె దుబారులో జరిగిన అప్నియా పైరేట్స్ A×ణA కప్ 2023 ఫ్రీడైవింగ్ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఒక నిమిషం పది సెకన్లలో 30-మీటర్ల విభాగాన్ని పూర్తి చేసింది. యూఏఇ ప్రధాన కార్యాలయం లో అసిస్టెంట్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన ఆజాద్ మూపెన్ చిన్న కుమార్తె డాక్టర్ జెబా మూపెన్. దాదాపు 40 ఏండ్ల కిందట తన కుటుంబంగా మారిన యూఏఇలో పుట్టిన మూపెన్ చాలా దేశాల్లో పెరిగింది. విదేశాల్లో ప్రవాస జీవితాన్ని గడుపుతూ వేసవికాలంలో మాత్రం కేరళలో గడిపేది. అది ఆమె సొంత రాష్ట్రం. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె పెన్సిల్వేనియా విశ్వ విద్యాలయంలో ప్రీ-మెడికల్ చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్ వెళ్ళింది. తర్వాత మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేయడానికి భారతదేశానికి వచ్చింది.
సేవ చేయాలని…
‘మా నాన్న నాకు గొప్ప స్ఫూర్తి. ప్రజలకు సేవ చేసే ఆయన్ని చూస్తూ పెరిగిన నేను డాక్టర్ కావాలనుకున్నాను’ అంటుంది మూపెన్. వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్‌గా ఉన్నప్పటికీ అది తనకు సరైనది కాదని ఆమె గ్రహించింది. ఏడాది పాటు ప్రాక్టీస్ చేసి తర్వాత తండ్రితో పాటు వ్యాపారంలో చేరింది. ఈ సమయంలోనే ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించు కుంది. ఆస్టర్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ అని పిలువబడే ఆస్టర్ గ్రూప్ వారి సీఎస్‌ఆర్ ప్రారంభించే బాధ్యతను స్వీకరించింది. దాని ఆధ్వర్యంలో జీవితంపై అవగాహన, శిక్షణ, ఉచిత శస్త్రచికిత్సలు, వైద్య శిబిరాలు, క్లినికల్ ఇన్వెస్టిగేషన్, వికలాంగులకు సేవా కార్య క్రమాలు చేసేవారు. ఇవన్నీ లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి. అయితే కార్పొరేట్ వ్యాపారం కూడా ఆమెకు నచ్చక ఏడాది కిందట అందులో నుండి బయటకు వచ్చేసింది. తనకు నచ్చిన పని చేయాలని నిర్ణయించుకుంది.
సొరచేపలతో ఈత కొట్టడం
స్కూబా డైవింగ్‌పై ఆమెకున్న ఆసక్తితో దాన్ని కొన సాగించింది. ఎందుకంటే ఆమె ప్రతి రెండేండ్లకు ఒకసారి మాల్దీవులను సందర్శించేది. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా డైవింగ్ చేసే అవకాశాల కోసం చూసింది. సముద్రపు అద్భుతాలు ఆమెను ఎంతగానో ఆకర్షిం చాయి. అతి తక్కువ కాలంలోనే రెస్క్యూ డైవింగ్‌లో కూడా సర్టి ఫికేషన్ పొందింది. దీంతో ఆమె సముద్రంలో పడిన ప్రజలను రక్షించగలదు. డైవ్ మాస్టర్‌గా కూడా ఆమె తన పేరును నమోదు చేసుకుంది. ఇది ఆమెకు గొప్ప అనుభవం. సమూహాలకు నాయకత్వం వహిం చడం, ప్రజలను సముద్రా నికి పరిచయం చేయడం, నీటిలో వారిని సౌకర్యవంతంగా చేయ డం నేర్చుకుంది. షార్క్‌లతో ఫ్రీ డైవింగ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఓషన్ రామ్‌సేతో కలిసి డైవింగ్ చేసిన ఘనతను కూడా ఆమె సాధిం చింది. ”నేను టైగర్‌షార్క్‌లు ఉన్న నీటిలోకి దిగడానికి భయపడ్డాను. కానీ ఇది నా ప్రయాణంలో ఒక భాగం కావాలని నాకు తెలుసు. కాబట్టి ధైర్యం చేశాను” అని రామ్‌సే బృందంతో ఒక వారం గడిపిన ఆమె గుర్తు చేసుకుంది.
మనసారా ఆస్వాదిస్తాం
ఈ అనుభవం ఆమెలో షార్క్‌లపై మరింత పరిశోధన చేయడానికి, సముద్ర పర్యావరణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడంలో వాటి పాత్రను మరింతగా పరిశోధించడానికి ప్రేరేపించింది. మనుషుల వల్ల షార్క్‌లు దాదాపు అంతరించిపోయాయి. ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవాటిని రక్షిస్తా రని ఆమె అర్థం చేసుకుంది. కాబట్టి ప్రజలు సముద్రం పట్ల ప్రేమలో పడేలా చేయగలిగితే, సముద్ర జీవుల పరిరక్షణ గురించి అవగాహన పెంచుకోవడంలో ఉపయోగపడుతుందని ఆమె భావించింది. ఈ డైవింగ్ ప్రయాణంలో ఆమె అతిపెద్ద ప్రేరణ ఆమె స్నేహితుడు అనూప్. ఇతను అవార్డు గెలుచుకున్న సినిమాటోగ్రాఫర్, డైవర్. ”నేను డైవ్ మాస్టర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూప్‌తో పాటు సముద్రంతో ప్రయాణించాలని ఆసక్తి పెంచుకుని నీరంటే భయపడే వ్యక్తులను సముద్రంలోకి తీసుకెళ్లడం ప్రారంభించాను. మా సంస్థ ఆధ్వర్యంలో వన్ ఓషన్ వన్ లవ్‌తో మాల్దీవులకు పర్యటనలను నిర్వహిస్తాం. సముద్రంతో ప్రేమలో పడేవారి ప్రయాణాన్ని మనసారా ఆస్వాదిస్తాం” అని ఆమె చెప్పింది.
లోతులను సవాలు చేస్తోంది
రెండేండ్ల కిందట మూపెన్ అనుకోకుండా ఫ్రీడైవింగ్‌కు వెళ్లింది. సొరచేపలు, ఇతర సముద్ర జీవులకు దగ్గరగా ఉండగలిగింది. వివాహ కానుకగా ఆమెకు ఒక జత ఫ్రీడైవింగ్ రెక్కలు బహుమతిగా వచ్చాయి. కానీ వాటిని చాలా రోజులు ఆమె ఉపయోగించలేదు. ఎలాగైనా వాటిని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఫ్రీడైవింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సు చేసింది. చివరకు తన ముప్పై ఏండ్ల వయసులో తాను ఇష్టపడే క్రీడను కనుగొంది. అప్నియా పైరేట్స్ ఏఐడీఏ కప్ 2023 ప్రకటించినప్పుడు ఆమె ఏడాదిన్నర పాటు ఫ్రీడైవింగ్‌లో శిక్షణ పొందింది. ఇటీవలే ఆమే ఏఐడీఏ4 సర్టిఫికేషన్‌ను పూర్తి చేసింది.
తన అనుభవం నుండి…
2017లో ఆమె మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్నప్పుడు ”నా శరీరం నన్ను హెచ్చరించడానికి ప్రయత్నించింది. కానీ నేను దానిని పట్టించుకోలేదు. దాంతో నేను తీవ్రమైన సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు గురయ్యాను. ఈ వ్యాధి నన్ను మేల్కొలిపింది” ఆమె చెప్పింది. వ్యాధి నివారణకు ఆమె సంప్రదాయ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. కేరళలోని కోటక్కల్ ఆర్య వైద్యశాలలో ఆయుర్వేద చికిత్స తీసుకుంది. ”ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ పికె వారియర్ మాట్లాడుతూ ‘మీకు ఇక్కడ మేము చేసే చికిత్స 20 శాతం మాత్రమే. మిగిలిన 80శాతం మీ చేతుల్లోనే ఉన్నది’ అన్నారు. ఆ రోజు నుండి నేను చాలా నిబద్ధతతో ఉన్నాను. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను” ఆమె చెప్పింది. ఈ అనుభవమే వెల్త్ పుట్టుకకు దారితీసింది. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ద్వారా యూఏఇలోని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హబ్‌లో ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులను తగ్గించడానికి, వంశపారంపర్య బాధలను నిరోధించడానికి ఇది పని చేస్తుంది.