సారథి ‘ప్రొఫెషనల్‌ రన్నర్‌ టీమ్‌’

Sarathi 'Professional Runner Team'ఒక పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడక, చివరి వరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుని లక్షణం! అలాంటి వారే జీవితంలో విజయం సాధించగలరు. వీరే ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే ఆటంకాలను తలచుకొని ఏ పని చేయడానికి మొదలు పెట్టని వారు అధములు. ఏదో చేయాలన్న తపనతో మొదలుపెట్టి మధ్యలో ఆటంకాలు ఎదురైతే వదిలేసేవారు మధ్యములు. మనం ఎప్పుడైనా కార్యసాధకుల వలె విజయం సాధించే వరకు కృషి చేస్తూనే ఉండాలి. నలుగురిలో ఉత్తములుగా నిలవాలి. అలాంటి కోవకు చెందిన వారే చేతనా భట్టాచార్య. తన అవసరం నుండి ఒక వ్యాపారాన్ని సృష్టించారు. అదే ‘సారధి ప్రొఫెషనల్‌ రన్నర్‌ టీమ్‌’
అవసరం కోసం వ్యాపారం ఏంటా అని అందరికీ కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే చేతన ఒకరోజు తమ ఇంటికి కావలసిన సరుకులు తీసుకురమ్మని భర్తను పంపారు. ఆయన తెచ్చారు కానీ కొన్ని సరుకులు మర్చిపోయారు. ఆ సరుకులను మళ్లీ తెమ్మని పంపించారు. వెళ్ళి తెచ్చారు, కానీ ఈసారి అత్యవసరమైన ఉప్పు మరచిపోయారట. ఉప్పు లేకుండా ఎలా వండాలని, వెళ్ళి ఉప్పు తెమ్మని అంటే, అలసిపోయిన భర్త చిరాగ్గా ‘నువ్వే తెచ్చుకో’ అన్నారట! అలా ఆరోజు అవసరమైన ఆ ఉప్పు ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసింది. ఇలా వ్యాపారం ప్రారంభించిన చేతనా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ బెంగుళూర్‌లో చదివి, ఐఐఎం కోల్‌కతాలో ముగించి సాఫ్ట్‌వేర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.
సవాళ్ళను అధిగమిస్తూ…
సారథి సంస్థను మే 2022లో ప్రైవేట్‌ లిమిటెడ్‌గా ప్రారంభించారు. కానీ అంతకు ముందే ఈ సేవలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. హైదరాబాదులో నల్ల గండ్ల నుండి 300 మంది వినియోగ దారులకు, ఏడు సంస్థలకు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ప్రతి నెల 8.5 లక్షల గ్రాగ్‌ మర్చంటేజ్‌ వాల్యూను సృష్టిస్తున్నారు. ఈ సారథి సంస్థ అంత ఆషామాషీగా ఏమీ నడవలేదు. తనకు కుటుంబం మద్దతు ఎంత ఉన్నా… అందరి పారిశ్రామికవేత్తల వలె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సారధి సంస్థను స్థాపించడానికి కావలసిన నిధులు సమకూర్చుకోవడం దగ్గర నుండి వినియోగదారులను సంపాదించడం, వారిని సంతృప్తి పరిచే మంచి ప్రతిభ ఉన్న ఉద్యోగులను నియమించుకోవడం, వారు సక్రమంగా విధులను నిర్వర్తించేలా చూడడం, ఏరోజూ ఆలస్యమన్నది లేకుండా వినియోగదారులకు సేవలు అందించడం… వంటి విషయాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సంస్థ ప్రారంభంలో దుకాణాల నుండి మాత్రమే ఆర్డర్లు తీసుకొన్నా తర్వాత కాలంలో సేవలు పెంచడంతో వ్యాపారం అభివృద్ధి చెందింది. సమస్యలన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకోగలిగారు.
దేశవ్యాప్తంగా సేవలందించేందుకు
ఒక్క హైదరాబాదులోనే కాకుండా దేశ వ్యాప్తంగా సారథి సంస్థ ద్వారా సేవలందించి మంచి పేరు తెచ్చుకోవడమే ఈమె లక్ష్యం. తద్వారా ఆయా ప్రాంతాలలో ఎందరికో దీర్ఘకాలిక ఉపాధి దొరకుతుందని ఆమె అంటున్నారు. దీని వల్ల చేతన వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 14 మంది ఉద్యోగులుగా ఉన్నారు. ఒక మహిళా వ్యాపారవేత్త తన మనసు నుండి పుట్టిన ఆలోచనను ఓ సంస్థగా మలిచి మరింత విస్తరింప జేయడం చాలా గొప్ప విషయం. ఇలాగే ఒంటరి మహిళలకు, ఉద్యోగులకు, ప్రయాణ సౌకర్యం లేని దూర ప్రాంతా లకు మరిన్ని సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…
దీనికి నేపథ్యం ఏమిటంటే..?
చేతన తనకు కావలసిన సరుకులు ఆన్‌లైన్‌, మోడ్స్‌ ద్వారా తెప్పించుకునే వారట. కానీ చాలా తేడాలు కనిపించాయి. అదీగాక వస్తువులు చిత్రాలలో చూపించినట్టు తాజాగా, నాణ్యతగా లేకపోవడం, రవాణా ఖర్చు ఎక్కువ కావడం, స్వయంగా వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకోవాలంటే ఉద్యోగరీత్యా సమయం లేకపోవడం, ఆ వస్తువులు ఇల్లు చేరేసరికి కనబడని ఎన్నో టాక్స్‌లతో బిల్లు పెరిగిపోవడం, తనకు వచ్చిన సరకులు నచ్చకుంటే వాటిని వాపస్‌ తీసుకోకపోవడం, ఇలా ఎన్నో కారణాలు ఈ సారధి రన్నర్‌ టీమ్‌కు నాంది పలికింది.
– రంగరాజు పద్మజ
9989758144

Spread the love