జిమ్‌కి వెళ్ళకుండానే…

Without going to the gym...కాలం మారిపోయింది. అంతా బిజీబిజీగా మారిపోయారు. రోజూ జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసే సమయం చాలామందికి ఉండదు. పనులు, హాబీలు, భర్త, పిల్లలు, స్నేహితులు.. ఇలా సమయం కేటాయించాల్సిన అంశాలు, అవసరాలు ఎన్నో.. ఎన్నెన్నో.. బరువు తగ్గాలని చాలామంది భావిస్తారు. కాస్త బరువు తగ్గి సన్నగా మారడం ఎలా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? కొన్ని చిట్కాలు ఫాలో అయిపోతే చాలు జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గిపోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం…
ఇంటి పనులన్నీ పనిమనిషికి అప్పగించకుండా మీకు కాస్త ఖాళీ సమయం దొరికినా, చేయగలిగే పనులు ఎంచుకొని వాటిని పూర్తిచేస్తే సరిపోతుంది. మిగిలిన పనులను పనిమనిషికి అప్పగించండి. ఉదాహరణకు ఇంటిని తుడిచి శుభ్రం చేసుకోవడం చేయండి. దీని వల్ల క్యాలరీలు కరగడంతో పాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నారనే సంతప్తి కూడా సొంతమవుతుంది.
చిన్న చిన్న వ్యాయామాలు..
కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేయడానికి జిమ్‌ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. దీనికి పెద్దగా సమయం కూడా అవసరం ఉండదు. క్రంచెస్‌, పుషప్స్‌, లెగ్‌ లిఫ్ట్స్‌, స్కిప్పింగ్‌, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల యాక్టివ్‌గా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గించు కోవచ్చు. ఇవి అన్నీ ఒకేసారి చేయాలనేమీ లేదు. ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ ఐదు నిమిషాలు కేటాయించుకుంటూ ఒక అరగంట పాటు సమయం కేటాయించగలిగితే చాలు.
డ్యాన్స్‌..
ఖాళీ దొరికితే చాలు టీవీ చూస్తూ సోఫాకి అతుక్కుపోవడం కాదు. అదే టీవీ చూస్తూనో లేక మ్యూజిక్‌ సిస్టమ్‌లో పాటలు పెట్టుకునో డ్యాన్స్‌ చేయడం వల్ల అటు క్యాలరీలు కరగడంతో పాటు ఇటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజూ కనీసం పావుగంట పాటు మంచి సంగీతం వింటే డిప్రెషన్‌ కూడా దూరమవుతుందట. ఆ పాటలు వింటూ డ్యాన్స్‌ చేయడం వల్ల మీ మెటబాలిజం మరింత వేగవంతం అవుతుంది. నవ్వుతూ, తుళ్లుతూ నత్యం చేయడం వల్ల తెలియకుండానే కొవ్వు కరిగిపోతుంది.
తక్కువ తినడం…
బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అంటూ రోజూ మూడు మీల్స్‌ని తినాలని పెద్దలు చెప్పారంటే దానికో కారణం ఉంటుందని గుర్తుంచుకోండి. వీటి మధ్యలో మళ్లీ ఏదైనా హెవీగా తింటే కొవ్వు పేరుకుపోతుంది. తినే డైట్‌లో ఆరు చిన్న చిన్న మీల్స్‌ ఉంటే తక్కువ మోతాదులో తినడం అలవాటు చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్‌ కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మంచిది. కూరగాయలు, పండ్లు, పనీర్‌ వంటి ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు పెరుగు వంటి ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
డిన్నర్‌ త్వరగా…
చాలామంది రాత్రిపూట భోజనం చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. రోజులో ఇదొక్క పూటే హడావిడి లేకుండా ప్రశాంతంగా తినాలని.. నచ్చినవన్నీ తినేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం పడుకోకముందే అరిగి దాన్ని శక్తిగా మార్చుకునేందుకు శరీరానికి ఏమాత్రం సమయం ఉండదు. ఫలితంగా ఈ ఆహారాన్ని శరీరం కొవ్వుగా దాచి ఉంచుతుంది. అందుకే రాత్రి నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందే ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరిగిపోవడంతో పాటు క్యాలరీలు కూడా కరిగే అవకాశం ఉంటుంది.
నడక మంచిదే…
చిన్న చిన్న పనులకు కూడా వాహనాలు ఉపయోగించకుండా నడవడం వల్ల కొన్ని క్యాలరీలు కరుగుతాయి. కాస్త ఇబ్బందిగా అనిపించినా నడక శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు బరువు కూడా తగ్గిస్తుంది. మీకు సైకిల్‌ తొక్కడం అంటే ఇష్టమైతే.. దాన్ని కూడా ఉపయోగించవచ్చు.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అవి మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడడంతో పాటు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. చర్మం రంగు, ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. విటమిన్లు, మినరల్స్‌ కూడా ఎక్కువగా లభిస్తాయి.
వీటితో పాటు రోజు మొత్తం ఏదొక పని చేస్తూ బిజీగా గడుపుతుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోదు. ఆరోగ్యం సొంతమవుతుంది.

Spread the love