ఈ అలవాట్లు మానుకుంటేనే ఆదా…

కొత్తగా ఉద్యోగంలో చేరిన కొందరు యువతీ యువకులు ఆర్థిక స్వాతంత్రం వచ్చినందుకు ఎంతో సంబరపడి పోతుంటారు. అప్పటివరకు ప్రతి చిన్న ఖర్చుకు తల్లిదండ్రులపై ఆధారపడిన వారికి సంపాదన చేతికందగానే చెప్పలేని సంతోషం. సంపాదించడం మొదలుపెట్టగానే పొదుపు చేయండని, అది అవసరమని పెద్దలు చెబితే చెవికి ఎక్కించుకోరు. కొంత కాలం ఎంజారు చేయనీయండని అంటుంటారు. విలాసాల మోజులో పడి వచ్చే ఆదాయాని కన్నా ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు. ఆశకు హద్దులుండవు కదా.. జీతం తక్కువగా ఉందని, తల్లిదండ్రులు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని నిందిస్తుంటారే తప్ప తమ అలవాట్లు ఎలా ఉన్నాయో మాత్రం గమనించరు. ఇలాంటి వారికి ఆదా చేయడం అంటే కాని పని. అసలు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే… రోజువారీ జీవితంలో చిన్న పాటి నిర్లక్ష్యాలతో ఏర్పడే ఖర్చులే పెద్దగా భారం పడతాయని తెలుసుకోవడం. అవేంటో తెలుసుకుని వాటిని అధిగమిస్తే ఆదా చేయడం చాలా సులువవుతుంది. మరి ఈ అలవాట్లు మీక్కూడా ఉన్నాయేమో ఓసారి పరిశీలించుకోండి.
బయటి భోజనం…
సాధారణంగా శని ఆదివారాలు వచ్చాయంటే స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్ళాలని లేదా బయటకు వెళ్లి ఎంజారు చేయాలని చాలామంది అనుకుంటారు. ఇలా ప్రతీసారి పార్టీలకు వెళ్లడం, రెస్టారెంట్‌లో భోజనం చేయడం చాలా ఆనందంగా అనిపి స్తుంది. కానీ ఈ అలవాటు ఖర్చులు పెంచేస్తుంది. అలా కాకుండా ఇంట్లోనే చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసుకోవడమో లేదా కలిసి తినడమో చేయవచ్చు. దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కువశాతం ఇంటి భోజనానికే ప్రాధా న్యమిస్తే అటు ఆరోగ్యం, ఇటు ఆదా రెండూ ఉంటాయి.
ఖరీదైనవి కొనాలనుకున్నప్పుడు…
చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే వాటికోసం వివిధ రకాల ఉత్ప త్తులు వాడుతుంటారు. వాటి కోసం ఎక్కువ ధర ఉన్న బ్రాండ్‌ లనే కొనేందుకు మొగ్గు చూపుతారు. అలా కాకుండా తక్కువ ధరకు లభ్యమయ్యే బ్రాండ్‌లలో కూడా బాగా పనిచేసేవి ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టడం మంచిది. లేదంటే ఇంట్లోనే సహజమైన వస్తువులతో చర్మాన్ని కాపాడుకునే చిట్కాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే ఇంకా ఆదా చేసుకోవచ్చు.
షాపింగ్‌కి…
ఈ రోజుల్లో సరుకుల కోసం ఎక్కువ శాతం సూపర్‌ మార్కెట్‌కి వెళ్ళడం అలవాటయిపోయింది. అందులోకి వెళ్లాక తక్కువ ధరకు వస్తున్నాయని అవసరం లేని వస్తువులెన్నింటినో కొనేస్తాం. అలా కాకుండా మనకు ఏమేం కావాలో లిస్టు రాసుకుని వెళ్ళి అంతవరకే తెచ్చుకుంటే అనవసర ఖర్చు పెట్టకుండా కట్టడి చేయగలుగుతాం.
అకౌంట్స్‌ షేరింగ్‌..
నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌ స్టార్‌.. ఇలా ప్రతి వాటికి మెంబర్‌షిప్‌ తీసుకుంటూ వెళ్తే బ్యాంక్‌ బ్యాలన్స్‌కి గండి పడ్డట్టే. అందువల్ల ఎక్కువ ఆసక్తి ఉన్న సైటుకి మాత్రమే చందాదారులు అవ్వండి. అవకాశం ఉంటే స్నేహితులతో కలిసి వేర్వేరు సబ్‌స్క్రిప్షన్స్‌ను తీసుకొని అకౌంట్స్‌ షేర్‌ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది.
కేఫ్‌కి వెళ్తారా…
కొంతమందికి రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. వాకింగ్‌కు వెళ్ళినపుడు లేదా అలవాటుగానో స్నేహితులతో కలిసి ఏదైనా కేఫ్‌కి వెళ్ళడం చేస్తుంటారు. కొంతమందికి అలా వెళ్ళకపోతే ఆ రోజులో ఏదో చేయలేదనే ఫీల్‌ ఉంటుంది. రోజు వారీ చూస్తే తక్కువనే కనిపిస్తుంది. కానీ నెల మొత్తం లెక్క వేస్తేనే కేఫ్‌కి వెళ్ళి ఎంత వృథాగా ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. అలా కాకుండా ఫ్రెండ్స్‌ అందరూ కలిసి ఉదయం సాయంత్రం వేళల్లో పిచ్చాపాటీ మాట్లాడుకునేపుడు రోజుకొకరు వెంట ఫ్లాస్క్‌ తీసుకెళ్ళండి.. లేదంటే కాఫీ, టీ తాగాలనిపిస్తే ఇంట్లోనే పెట్టించుకుని తాగండి.. దీని వల్ల చాలా ఆదా అవుతుంది.
విద్యుత్‌ వాడకంలో…
చాలా మంది లైట్లు, ఫ్యాన్‌లు, ఏసీలు ఆఫ్‌ చేయడం తరచూ మర్చిపోతుంటారు. అవసరం లేనపుడు ఆఫ్‌ చేయడం వల్ల పర్యావరణానికే కాదు, విద్యుత్‌ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు. అందుకే విద్యుత్తును వీలున్నంతగా పొదుపు చేయడం మంచిది.
వ్యాయామాల కోసం…
బాడీ ఫిట్‌నెస్‌ జిమ్‌కు వెళ్తేనే వస్తుందని చాలా మంది అనుకుం టుంటారు. అందుకోసం ఖరీదైన జిమ్‌లో మెంబర్‌షిప్స్‌ తీసుకుంటుం టారు. పర్సనల్‌ ట్రైనింగ్‌, ఫిట్‌నెస్‌ క్లాసులు అంటూ చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ వాటికి వెళ్లేది మాత్రం చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల కట్టిన డబ్బు వేస్ట్‌ అయిపోతుంది. ఫిట్‌నెస్‌ని లైఫ్‌స్టైల్‌గా మార్చుకోవాలని భావిస్తే ముందు పార్క్‌లో పరుగెత్తడం, సైకిల్‌ తొక్కడం వంటివి చేస్తుండాలి. రోజూ వ్యాయామం చేయడం అలవాటయ్యాక, జిమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవడం మంచిది. అది కూడా కచ్చితంగా రోజూ వెళ్ళగలను అనుకుంటేనే తీసుకోవాలి.

Spread the love