77వ స్వాతంత్య్ర దినోత్సవాన ఢిల్లీలో ప్రధాని మోడీ ఎ’జెండా’ను ఎగురవేశారు. ఆయన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ఇది పదోసారి. అనంతరం 89నిమిషాల పాటు జాతినుద్దేశించి చేసిన సుధీర్ఘ ప్రసంగంలో పసలేదు. ఎక్కువ తన పేరును తానే చెప్పుకోవడం, కాంగ్రెస్ పేరును ఉచ్చరించడం కనిపించాయి. ఇందులో కొత్తదనం కనపడకపోగా పార్లమెంట్‌లో, వేదికల్లో, ప్రారంభోత్సవాల్లో మాట్లాడినట్టుగానే ప్రతిపక్షాలపై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. మళ్లీ ప్రజల ఆశీర్వాదాల కోసం యాభైఆరు ఇంచుల చాతిని కిందకు వంచారు. గెలిపిస్తే వచ్చే ఏడాది ఇక్కడినుంచే ప్రసంగిస్తా నన్నారు. తాను కలగన్నా, చెమటోడ్చినా అంతా ప్రజల కోసమేని, ఆశ, శ్వాస, ధ్యాస అంతా దేశమేనని చెప్పుకొచ్చారు. అయితే మూడునెలలుగా మణిపూర్‌లో మండుతున్న విభజన మంటలు ఆయనకు కల్లోకి రాకపోవడం అక్కడి ప్రజలు చేసుకున్న పాపం! ఈ తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి అంశాల గురించి మరిచిపోయారు. ఉంటే కదా మాట్లాడేందుకు ఆయనదంతా కులం, మతం, విధ్వంసం, విభజనవాదం! అందుకే పదేపదే ప్రధాన ప్రతిపక్షంపై నిందలు మోపారు. వారి పాలనపై చిందులు తొక్కారు. ఎమర్జెన్సీ, ముఖ్యమంత్రుల మార్పు, అవినీతి, వారసత్వ పాలన గురించి వ్యాఖ్యలు చేశారు. ఇందులో వాస్తవ అవాస్తవాలను పక్కనపెడితే అవినీతి గురించి మోడీ మాట్లాడటం ఆశ్చర్యకరం. తను గెలవడానికి సహకరించిన బడాపెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకు చేసిన విదేశీ వ్యూహాలు, స్వదేశీ ఎత్తుగడలు తెలియనివా? కార్పొరేట్ కబంధ హస్తాల్లో నేడు దేశం కొట్టు మిట్టాడుతుంటే చూస్తూ మిన్నకుండే విన్యాసాల గురించి చెప్పతరమా?
ముఖ్యమంత్రులను మార్చడం గురించి మాట్లాడం మరీ హాస్యాస్పదం. ఎందుకంటే వీరు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రుల్నే సకల కళల(ఈడీ, సీబీఐ, ఐటీ)తో మార్చే పనుల్లో నిమగమై ఉంటారు కదా! విద్వేషాలు రగిల్చిన మణిపూర్ సీఎం గద్దెదిగాలని ప్రజలు డిమాండ్ చేస్తే ‘ఆయన ఏ తప్పు చేయలేదు. మార్చడం కుదరదు’ అని నిర్మోహమాటంగా చేప్పిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధైర్యం ఎవరికీ ఉండదేమో! అందుకే వారు ముఖ్య మంత్రుల్ని మారుస్తూ వచ్చారేమో! దేశం అల్లకల్లోమైనా పదవులు, సీట్లను పట్టుకుని వేలాడటమే కదా బీజేపీ – ఆరెస్సెస్ పరివారం పని. ప్రతిపక్షాలపై శ్రద్ధ పెట్టి చేసిన ఉపన్యాసమంతా సొంతపార్టీపై పెడితే కనీసం జనాల్ని ఆత్మవంచనకు గురిచేస్తున్నామనే ఆలోచనైనా వచ్చేది. వారసత్వం గురించి మాట్లాడటం కూడా మంచిదే. కానీ వీరు చెప్పే తల్లిలాంటి ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని గుండెమీద చేయివేసుకోని చెప్పగలరా? సృష్టిస్తున్న సమస్యలన్నీ ప్రజల్ని పక్కదారి పట్టించేవే కదా! జరుగుతున్న నేరాలు, ఘోరాలకు సజీవ సాక్ష్యాలు డబులింజన్ సర్కార్లు! ముందు ఇవన్నీ వీరు తమ ఇంట్లో (పార్టీలో) మాట్లాడిన తర్వాత ఇతరుల గురించి చెబితే వినడానికైనా బాగుంటుంది. కానీ అవన్నీ వదిలేసి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నట్టుగా స్వాతంత్య్రదినోత్సవంలో మాట్లాడితే ఎలా?
తాను తెచ్చిన సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పారు. ప్రపంచంలో మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మార్చేందుకు వాగ్దానం చేశారు. అసలు దేశంలో ప్రజల కొనుగోలు శక్తి మందగించింది. పెట్రోల్, డీజిల్ భారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. విద్య, వైద్య రంగాలు అచేతనంగా ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటితో బాదుతూనే ఉన్నారు. ఇవేవీ ప్రధాని ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు కదా! ఇంకా యువత గురించి కూడా మాట్లాడారు. ఏటా తాను ఇస్తానని చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానం గుర్తుకు రాకపోవడం విచారకరం. మహిళల కృషిని కొనియాడారు. చంద్రయాన్-3లో వారి ప్రతిభ గురించి మాట్లాడారు. కానీ అహర్నిశలు శ్రమించి రాకెట్ విజయవంతానికి కారణమైన శాస్త్రవేత్తలకు వేతనాలెందుకు ఇవ్వడం లేదు. ఇవన్నీ ‘మాన్‌కీబాత్’లో మాట్లాతారమో! చూద్దాం. ఇప్పటికైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అషామాషీ కాదని అర్థమైనట్టుంది… కర్నాటక ఫలితాలు మామూలుగా లేవుకదా! ముందు ఐదు రాష్ట్రాలు, ఆ పైన పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు మరి…! అందుకే మణిపూర్‌పై ముప్పయి సెకన్లు కార్చిన మొసలికన్నీరు ఎర్రకోటపైనా కనిపించింది.