ఎందుకింత వివక్ష!?

Why discrimination!?‘దేశంలోని పౌరులంతా సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, బాధ్యతలు ఉన్నాయి. భారతీయ పౌరుడు అనేదే ప్రధాన గుర్తింపు. కులం, జాతి, భాష, లింగం అనేవి కాదు’ మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము 77వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రజలనుద్దేశించి ఇచ్చిన సందేశమిది.
‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేస్తారా… లేదా? పిల్‌పై ఎందుకని అఫిడవిట్‌ ధాఖలు చేయలేదు… ఎందుకు సిగ్గుపడుతున్నారు’ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై విచారణ సందర్భంగా జస్టీస్‌ సంజీవ్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలివి. ‘రాజకీయపార్టీలు ఏం చెబుతాయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాం… ఒక్క సీపీఐ(ఎం) తప్ప ఏ పార్టీ కూడా తమ వైఖరిని స్పష్టం చేయడానికి ముందుకు రాలేదు’ అని.
పరస్పరం భిన్నమైనపై రెండు వ్యాఖ్యానాలు దేశంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అంతా సమానమే అయినప్పుడు దేశంలో ఈ పరిస్థితులెందుకు తలెత్తినట్టు? చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం కలగపోవడానికి కారణమేంటి? సమానత్వాన్ని అంగీకరించలేకా? మహిళలపై వివక్షా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా భారతీయ మహిళలు ఇప్పటికీ వివక్ష, అసమానతలకు లోనవుతూనే ఉన్నారు. సామాజిక, అభివృద్ధి సూచికల్లో వెనుకబడే ఉన్నారు. చట్టసభల్లో మహిళలకు నిజమైన, న్యాయమైన ప్రాతినిథ్యం కల్పిస్తే ప్రస్తుతం పురుషాధిక్యత ప్రధాన పాత్ర పోషిస్తున్న సమాజంలో మార్పునకు అవకాశం ఉంటుంది. స్త్రీ, పురుష అసమానతలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. పంచాయతీరాజ్‌ సంస్థల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు అమలై ప్రాథమికస్థాయిలో విధాన నిర్ణయ ప్రక్రియలో మహిళలు ఇప్పటికే భాగస్వాములవు తున్నారు.కానీ, లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇంతవరకు ఆమోదం పొందలేదు. పార్లమెంటు ఉభయసభల్లో మహిళా సభ్యులు ఏనాడూ పది శాతానికి మించకపోవడం గమనార్హం.
మహిళలకు రాజకీయరంగంలో భాగస్వామ్యం తర్వాత ముఖ్యమైనది ఆర్థిక రంగంలో భాగస్వామ్యం. ఆర్థిక స్థిరత్వం చేకూరినప్పుడే వారు తమ హక్కులు, సౌకర్యాల కోసం గట్టిగా డిమాండ్‌ చేయగలుగుతారు. మహిళలకు సమానావకాశాలు అందుబాటులోకి వస్తే 2025 కల్లా దేశ జీడీపీలో అదనంగా 77 వేల కోట్ల డాలర్ల సంపద చేకూరుతుందని మెకన్సీ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌-2021లోనే పేర్కొన్నది. లాటిన్‌ అమెరికా దేశమైన పెరూలో ఇది రుజువైందని చెప్పింది. రాజకీయ ధృడ సంకల్పం ఉంటేనే ఈతరహా పక్కా విధానాలు రూపొందడానికి వీలుంటుంది. స్వాతంత్య్ర భారతా వనిలో కూడా మన పాలకులు మహిళాభ్యుదయానికి కావాల్సిన సరైన విధానాలను రూపకల్పన చేయకపోవడం విచారకరం. ప్రపంచంలోని 156 దేశాల్లో లింగ వివక్షలో ఒకప్పుడు 112వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 140వ స్థానంలోకి దిగజారిందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం-2021లోనే చెప్పింది. స్థానిక సంస్థల్లో మహిళల శాతం పెరుగుతున్నా, అదే తరహాలో చట్టసభల్లోనూ అతివలకు సముచిత ప్రాధాన్యం అవసరాన్ని పాలకులు ఎందుకు గుర్తించరు? ఈ బిల్లు రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందినా, లోక్‌సభలో అది జరగలేదు. 2014, 2019 రెండు లోక్‌సభల్లోనూ ఆమోదం పొందకపోగా, తాజా వర్షాకాల సమావేశాల్లోనూ అదే నిరాశ. 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పథకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ, స్థానిక సంస్థల్లో మహిళలకు 30 శాతం స్థానాలను స్థానిక సంస్థల్లో రిజర్వు చేయాలని సిఫారసు చేసింది. 1992-93లో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడో వంతు కనీసంగానూ, తర్వాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకూ పెంచుకునే అవకాశమిచ్చారు.
1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఇది చట్టరూపం దాల్చలేదు. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలను కేటాయించాలనీ, చట్టసభల్లో వారి ప్రాతినిథ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 1998, జులై 13న బిల్లును మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఎంపీ సురేంద్ర ప్రసాద్‌ సభవెల్‌లోకి వెళ్లి స్పీకర్‌ జీఎంసీ బాలయోగీ వద్ద నుంచి ఈబిల్లు ప్రతులను లాక్కొని చింపేశారు. 2019లో ఎన్డీయే ప్రవేశపెట్టినా, ఆమోదానికి తగిన చర్యలు తీసుకోలేదు. 2019లో పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో 43 శాతం నేరచరితులే కావడం గమనార్హం. ఈ నేరస్థులకు బదులు మహిళలను పార్లమెంటుకు పంపితే, దేశానికి ఎంతో ప్రయోజనమన్నది రాజకీయ, సామాజిక విశ్లేషకుల అభిప్రాయం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును నిర్లక్ష్యం చేయడం మన పాలకపార్టీల స్వభావాలకు నిదర్శనం.

Spread the love