‘నవ’ వసంతంలోకి…

 


అనుదినం.. జనస్వరంతో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నవతెలంగాణ దినపత్రిక నవవసంతంలోకి అడుగుపెట్టింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 2015లో నవతెలంగాణ పత్రిక ప్రారంభమైన విషయం అందరికీ విదితమే. కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో మీడియా ఉన్న ఈ తరుణంలో ప్రజాపక్షం వహిస్తూ, ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటన్నటిని అధిగమిస్తూ పత్రిక ముందుకు సాగుతుండటం మామూలు విషయం కాదు. దీనంతటికీ ప్రజల ఆదరాభిమానాలు, సిబ్బంది సహకారం పత్రికకు కొండంత అండగా నిలవడమే ముఖ్యకారణం. ఎనిమిదేండ్ల ప్రయాణంలో ఆర్థిక సమస్యలు ఎదురైనా, కోవిడ్‌ వంటి మహమ్మారి భయపెట్టినా సిబ్బంది అకుంఠిత దీక్షతో వాటన్నటిని పత్రిక అధిగమించి ముందుకు నడిచింది. కానీ లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అణచివేతకు లోనయ్యేవారి గొంతుకగా నిలిచింది. ప్రజల ఆకాంక్షల్ని వినిపించే వాణిగా తన కర్తవ్యాన్ని నిర్వహించింది. నిజాల్ని నిర్బయంగా చెప్పడం వైపే బాధ్యతగా నిలబడింది. సమాజాన్ని మతం పేరిట, కులం పేరిట చీల్చుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ దేశంలో పాలన సాగుతున్న నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా నిబద్దతతో పోరాడే శక్తులకు ఒక వేదికగా నవతెలంగాణ నిలిచింది. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడంలో ముందుంది. ప్రశ్నించే వారి అభిప్రాయాలను ప్రతిఫలించే శక్తివంతమైన వేదికగా నవతెలంగాణ నిలిచింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడంలో ఏ మాత్రం వెనుకాడలేదు. కులదురహంకారాలను, ఆధిపత్య సంస్కృతులను ఎండగట్టడంలో ముందుభాగాన నిలిచింది నవతెలంగాణ. రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు, తదితర వర్గాలకు అండగా నిలిచింది. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటిని పరిష్కారం చేయించడంలో పత్రిక ప్రముఖ పాత్ర పోషించింది. ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచింది. ప్రతీ కార్మికవర్గం విజయంలో నవతెలంగాణ పాత్ర మరువలేనిది. పారిశుధ్య కార్మికుల సమ్మెకు, ఆశావర్కర్ల ఉద్యమాలకు అండగా నిలిచింది. గ్రామపంచాయతీ కార్మికులకు భరోసానిచ్చింది. కూడు, గుడ్డే కాదు ఉండేందుకు కాసింత స్థలం కావాలని కోరుతూ ఇండ్లు, ఇండ్లస్థలాల కోసం నిరుపేదలు చేసే పోరాటాలకు అద్దం పడుతున్నది. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడంలో తన బాధ్యతను పోషిస్తున్నది. పీడనల్లేని, దుర్మార్గాలకు తావులేని నూతన తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షల కోసం నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో నిబద్దతతో పనిచేస్తోంది. భిన్నమైన అభిప్రాయాల వ్యక్తీకరణ పట్ల అసహనం ప్రదర్శించే అప్రజాస్వామిక ధోరణిని ఎప్పుడూ ఎండగడుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలని నమ్ముతున్న నవతెలంగాణ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకుసాగుతోంది. ”పత్రికొక్కటున్న చాలు పదివేల సైన్యంబు” అన్న నార్లవారి మాటల్ని నవతెలంగాణ నిజం చేస్తోంది. మీడియారంగాన మార్కెట్‌శక్తుల విజృంభణ పాత్రికేయ వృత్తిలోని పవిత్రతకీ, నైతికత పెనుసవాల్‌గా మారిన పరిస్థితులలో నిజాయితీకి, అంకితభావానికి పట్టం కడుతోంది. కర్తవ్యదీక్షకు నిబద్ధులై పనిచేసే పాత్రికేయ సిబ్బంది ‘నవతెలంగాణ’కు కొండంత అండ. 8వ వార్షికోత్సవం సందర్భంగా, నిరంతరం ప్రజలపక్షం వహిస్తూ, ప్రజల ఆశీస్సులతో సాగే ఈ ప్రయాణానికి పునరంకితమవుతుంది. నవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో పనిచేస్తున్న సిబ్బందికి, సహకరిస్తున్న రచయితలకు, ప్రకటనదారులకు, పాఠకులకు శుభాకాంక్షలు.

Spread the love