‘ద్వి ము ఖ’ వ్యూ హం

'Dwi Mukha' Vyu Hum ఆదెమ్మా…! నా ద్విముఖ వ్యూహం నీ కసలు అర్థమే కాదు. ఇరవై ఏండ్ల క్రితం గుజరాత్‌లో నిర్దాక్ష ణ్యంగా అమలు పరచిన నరమేథ – కుబేర వ్యూహం జగతికి క్రూరంగా కన్పించ వచ్చు. కానీ నన్ను ఓ తిరుగులేని నాయకునిగా ప్రతిష్టించిన విషయం మరచిపోతే ఎలా?
ఊ. మిడిసిపడకు బిడ్డా. నేను ఆది అమ్మను. ప్రకృతిలో పుట్టాను. ప్రకృతిలో కలసి జీవిస్తున్నా… నువ్వే. ప్రకృతి నుండి విడివడి మానవత్వం లేని మృగంగా సంచరిస్తున్నావు. నియంతలా విర్రవీగు తున్నావు. 56 అంగుళాల ఛాతీ అంటా బోర విరుస్తున్నావు. చరిత్ర నీలాంటి హీనులని కాలగర్భంలో కలపుకుంటూనే ఉన్నది. నువ్వెంత? ఇప్పుడు నీవంతు. నీ నీడే నిన్ను భయపెట్టి తరుముతున్నది. గంగవెర్రులెత్తి గమనించలేకపో తున్నావు.
 ఆదెమ్మా నీ సోది ఆపు.
నాది సోదికాదురా. ఎరుక. ప్రజాధనంతోనే కొత్తపార్లమెంటు కట్టావు. మంత్రోచ్ఛారణతో మంత్రదండంతో ప్రవేశించావు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏం లాభం? ఇప్పుడు పార్లమెంటులో విపక్షాలకు బదులివ్వక భయపడి పారిపోతున్నావు. సిగ్గులజ్జా లేకుండా…
హా… హా… హా… అవి ఉన్నాయని భ్రమించడం మీ తప్పే. మణిపూర్‌ మారణహోమంపై మాట్లా డాలి అని అందరూ అరచి గోలపెట్టారు. నానా యాగీ చేసారు. మాట్లాడగా… అది చాలదా?
‘ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటుకు రావడానికి ముందు మణిపూర్‌ స్రీలపై జరిగిన అత్యాచారం ఘటన చూసి నా మనసు ఆగ్రహంతో నిండిపోయింది. 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసింది. శాంతిభద్రతల యంత్రాంగం బలోపేతం చేయండి. మహిళల రక్షణ విషయంలో రాజీపడొద్దు’ అన్నాగా..
మరెందుకు రాజీ పడుతున్నావు బిడ్డా. నీవు పైకొకటి లోపల ఒకటి. ద్విముఖ నటనా చాతుర్యం. నీ కపటం నీకూ నాకే కాదు ఎల్లరికీ ఎరుకవుతున్నది. భయంకర హత్యలు, అత్యాచారాలు చేసే మూకాసురుల ఉత్పత్తి కర్మాగారం మీదేనని తెలుస్తూనే ఉన్నది. మీ ముసుగులు మీకు మీరే సొంతంగా పీక్కొని బయటపడే సమయం వచ్చింది. తప్పదు బిడ్డా… మీ ముఖ్యమంత్రి బిరేన్‌ ఇలాంటి ఘోరాలు మా రాష్ట్రంలో వందలు కొద్దీ జరుగుతున్నాయని కుండ బద్దలు కొట్టాడుగా.
– విషయం తెలిసీ మరెందుకు ఇంకా వర్లుతున్నావు.
– నగత్వం మా స్త్రీలది, తల్లులది కాదు బిడ్డా. మీ అమానుష క్రూరత్వానిది అది ఎంత వికృతంగా ఉంటుందో ఇప్పుడు ఈ తరానికి ఎరుక అవుతున్నది. అదీ మీకు మీరే విప్పుకుని లోకానికి చూపుతున్నారు. రాష్ట్ర పోలీసు దళం, కేంద్ర పోలీసు దళం, సరిహద్దు భద్రతాదళం, అధికార యంత్రాంగం అంతా కలసి ఆదివాసీ తెగల మనుషుల్ని పీక్కుతినే రాక్షసాంసతో పదవిని నెట్టుకొస్తున్నావు. మరల మూడోసారి పదవిని వరించి మూడోస్థానంలోకి దేశాన్ని తీసుకు వస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీ డబుల్‌ ఇంజన్‌ బుల్‌డోజర్‌ పాలన కింద ఇంకెంత మంది అమాయక మూగజీవులు బలికావాలో…
పెద్ద నోట్లు రద్దు చేసి బతుకుల్ని బజార్లో పడేసినా, జీఎస్‌టీ పేరుతో అమాంతం ధరలు పెంచినా, నీఒక్క హాయాంలోనే కోటికోట్ల రూపాయల అప్పు తెచ్చి రుణభారం పెంచినా, నల్లచట్టాలతో రైతులను నయవంచన చేసినా, లేబర్‌ కోడ్‌లతో కార్మికవర్గాన్ని కాల్చుకుతింటున్నా, ప్రభుత్వ సంస్థలను, గనులను, ఓడ రేవులను అప్పనంగా ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నా ప్రజలు కళ్ళుమూసుకుని సహిస్తున్నారు, భరిస్తున్నారు, ఆమోదిస్తున్నారు అనే ధీమా నీది. కనుకనే నరమేథ – కుబేర వ్యూహం అంటూ సంబర పడుతున్నావు. అద్దాలమేడలో కూర్చొని అచ్చోసిన ఆంబోతులా రంకెలేస్తున్నావు.
గుర్తుంచుకో బిడ్డా! ఎంత ఎత్తుకు ఎగిరినా రాబందుల దృష్టి చచ్చిన మృతకళేబరాలపైనే ఉంటుంది. అలాగే నీకునూ నీ పంచన చేరిన కుబేరులకు పచ్చటి మణిపూర్‌ కొండల కింద ఉన్న మణిమాణిక్యాల గనులపైన దురాశ తెలియంది కాదు. ఆ రహస్య కారణం గానే అక్కడి అమాయక అడవి బిడ్డలను బలిపీఠం ఎక్కిస్తున్న విషయం ఎరుగంది కాదు. అడవులను శవాల దిబ్బలుగా మారుస్తూ ఉంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదు. కన్నెర్ర చేస్తుంది. ప్రకృతి మాత ప్రళయ గర్జన ముందు ఎంతటి వాడైనా తోకముడ వాల్సిందే. నూరుగొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన దెబ్బకు ఠా అన్నట్టు ప్రకృతిలో భాగమైన మానవ సమూహాలు నీ భరతం పట్టకమానవు. ఇదే ఆదెమ్మ శపథం…

కె. శాంతారావు
9959745723

Spread the love