పరిశోధనే ఆమె సేవకు స్ఫూర్తి…

లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి హాయిగా జీవితాన్ని గడపాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మనకు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో డాక్టర్‌ కర్పూరం గోవతి నిఖిల ఒకరు. ఓ డాక్టర్‌గా సమాజానికి తన వంతు సేవ చేయాలనుకున్నారు. దానికోసమే ‘గోవతి ఫౌండేన్‌’ ప్రారంభించారు. మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో డిస్‌ఫేజియా స్పెషలిస్టుగా చేస్తూ ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఆమె చేసిన పరిశోధనలకు గుర్తుగా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే వైద్య రంగలో మన రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానంటున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
నేను పుట్టింది హైదరాబాద్‌. సీతాఫల్‌మండిలో పెరిగాను. మాది జాయింట్‌ ఫ్యామిలీ. అమ్మమ్మ, తాతయ్య, పిన్నులు, అన్నయ్య, వదినా అందరూ ఉండేవారు. మా అమ్మ అనితా పద్మినీ, నాన్న హరిరాజ్‌ కుమార్‌. ఇద్దరూ ఉద్యోగస్తులే. నాకు ఒక చెల్లి ఉంది. అయితే నాకు చిన్నప్పటి నుండి తాతయ్య అంటే చాలా ఇష్టం. 10వ తరగతి వరకు అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగాను. అన్నీ వాళ్ళే చూసుకునేవారు. కాలేజీకి వచ్చిన తర్వాత అమ్మానాన్న దగ్గరకు వచ్చేశాను. మా తాతయ్య ఎప్పుడూ నన్ను ‘నువ్వు పెద్ద డాక్టర్‌ కావాలి’ అని రోజూ అనేవారు. అలా తాతయ్య ప్రోత్సాహంతో మెడికల్‌ వైపు వెళ్ళాలని కలలు కనేదాన్ని. నేను ఆడుకునే ఆటలు కూడా అలాగే ఉండేవి. డాక్టర్‌ అంటే ఒక ప్యాషన్‌గా మారిపోయింది.
టూర్‌కి వెళుతున్నానని చెప్పి…
మా ఫ్యామిలీలో మెడికల్‌ ఫీల్డ్‌లో ఎవ్వరూ లేరు. డాక్టర్‌ చదువుతానని ఇంట్లో చెబితే అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగో ఒప్పుకున్నారు. న్యూరో డిజార్డర్‌ గురించి చదవాలనుకున్నాను. అప్పటికే మా తాతయ్య న్యూరాజికల్‌ సమస్య వల్ల చనిపోయారు. దానికి అప్పట్లో సరైన చికిత్స, అవగాహన లేదు. దాని గురించి నేను స్టడీ చేయాలని నిర్ణయించుకున్నాను. బీఎస్సీ అడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఎం.ఎస్‌ హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఫైనల్‌ ఇయర్‌ పూర్తయిన వెంటనే ఢిల్లీ మేదాంత హాస్పిటల్‌ నుండి తమ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరమని కాల్‌ వచ్చింది. అంత దూరం జాబ్‌ కోసమంటే ఇంట్లో ఒప్పుకోరని చెప్పకుండా టూర్‌కి అని చెప్పి అమ్మమ్మను తీసుకొని అక్కడకి వెళ్ళాను. వాస్తవానికి అంత దూరం వెళ్ళడం నాకూ ఇష్టం లేదు. అయితే ఒకసారి చూసి వద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే హాస్పిటల్‌ వాతావరణం, అక్కడి సౌకర్యాలు నాకు బాగా నచ్చాయి. ఇంటర్వ్యూలో సెలక్ట్‌ చేశారు. ఇంటికి వచ్చి చెబితే అస్సలు ఒప్పుకోలేదు. అతి కష్టంగానే వాళ్ళను ఒప్పించి జాబ్‌లో చేరాను.
చాలా నేర్చుకున్నాను…
మేదాంతలో జాబ్‌ నాకు ఒక మంచి అవకాశంగా అనిపించింది. అక్కడి పెద్ద పెద్ద డాక్టర్ల నుండి మంచి అనుభవాలు నేర్చుకోగలిగాను. ఒక మంచి సోర్స్‌ నాకు దొరికింది. అక్కడ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. చాలా నేర్చుకున్నాను. 31 రీసర్చ్‌ పేపర్లు తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్స్‌లో పాల్గొన్నాను. అనేక జర్నల్స్‌లో నా ఆర్టికల్స్‌ పబ్లిష్‌ అయ్యాయి. చాలా క్యాంపుల్లో పాల్గొనగలిగాను. ఇలా రీసెర్చ్‌ చేస్తున్న సమయంలోనే పేదలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలని భావించాను. అక్కడ నేను నేర్చుకున్న విషయాలన్నీ హైదరాబాద్‌ వచ్చిన ప్రతి సారి ఇక్కడి వాళ్ళకు చెబుతుండేదాన్ని.
గోవతి ఫౌండేషన్‌ స్థాపించి
పేద ప్రజలకు వైద్యంలో మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరోనా కంటే రెండు మూడు నెలల ముందు గోవతి పేరుతో ఒక ఫౌండేషన్‌ మొదలుపెట్టాను. దీని ఆధ్వర్యంలో వైద్యం అందుబాటులో లేని పేదవారికి, అవగాహన లేని వారికి సహాయం చేస్తున్నాను. కరోనా సమయంలో ఈ సేవలు మరింత అవసరమాయ్యాయి. సుమారు 5000 మందికి ఫ్రీగా మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించాను. జనరిక్‌ మెడిసన్‌, కిట్స్‌, ఆక్సిజన్‌ సప్లరు చేయడం లాంటివి చాలా చేశాను. కంటి, మోకాలి అపరేషన్స్‌ కూడా చేయించాను. క్యాన్సర్‌, గుండె సమస్యలపై అవగాహన కల్పించాను. ఇవన్నీ చేయడానికి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెద్ద వాళ్ళు చాలా మంది నాకు సహకారం చేశారు.
అవగాహన లేకనే…
వైద్యం అందని వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఎంతోమంది సాయం కోసం నా దగ్గరకు వస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు. ఒక్కదాన్నే అన్నీ చేయలేను. కాబట్టి నాకు సపోర్ట్‌ చేసేవారు కావాలి. ముఖ్యంగా తెలంగాణ నుండి సపోర్ట్‌ కావాలి. ఫౌండేషన్‌ నుండి ఒక వెహికిల్‌ ఏర్పాటు చేసి ‘డోర్‌ స్టెప్స్‌’ పేరుతో ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభించబోతున్నాను. దీని ఆధ్వర్యంలో అందరికి మెడికల్‌ చెకప్‌ చేయడం, ఉచితంగా మందులు ఇవ్వడం చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. నా పరిశోధన మొత్తం డిస్‌ఫేజియాపై ఉంటుంది. అంటే మింగటంలో వచ్చే సమస్యలు. దీని లక్షణాలు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే నేను ఎక్కువగా దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నం గొంతులో ఇరుక్కు పోవడం, తినేటపుడు దగ్గు, వాంతులు, ఛాతిలో మండడం, దమ్ము రావడం, చెమటలు పట్టడం, నమలలేకపోవడం, తిన్న వెంటనే మోషన్‌ రావడం, తిన్న తర్వాత గొంతులు గరగర అనిపించడం ఇలా ఏవైనా లక్షణాలు ఉంటే దాన్ని డిస్‌ఫేజియా అంటారు. ఇలాంటివి గుర్తిస్తే వెంటనే సంబంధింత డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే శ్వాస సమస్యలు వచ్చి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. 50 ఏండ్లు దాటిన వారికి ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో దీనికి సంబంధించిన చికిత్స లేకుపోవడం మన దగ్గర ఒక పెద్ద సమస్య.
వీర మాత పెంచిన బిడ్డను
నేను ఈ రంగంలోకి వస్తుంటే అమ్మానాన్న ముందు చాలా ఇబ్బంది పడ్డారు. అంత దూరం ఉద్యోగం అంటే కష్టంగా ఒప్పుకున్నారు. అంత దూరం ఒంటరిగా ఆడపిల్లను పంపించడం ఇష్టం లేక అలా అన్నారు. అయితే నా ఆసక్తిని చూసి ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్‌, సేవా కార్యక్రమాలు చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్‌ వల్లనే. అలాగే మేదాంత హాస్పిటల్‌ వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. నా రీసెర్చ్‌ వర్క్‌కు బోర్డ్‌ నుండి చాలా అవార్డులు తీసుకున్నాను. 2020లో గ్లోబల్‌ హెల్త్‌ అవార్డ్‌ అందుకున్నాను. యంగెస్ట్‌ రీసెర్చర్‌ ఇన్‌ డిస్‌ఫేజియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌, శ్రీ సమ్మాన్‌ కౌన్సిల్‌ అవార్డులు అందుకోగలిగాను. ఇటీవలె భారత్‌ గౌరవరత్న అందుకున్నాను. దీన్ని నన్ను పెంచిన మా అమ్మమ్మ సుమతికి అంకితం చేశాను. అమ్మమ్మను అందరం వీరమాత అంటారు. అంటే నేను వీర మాత చేతుల్లో పెరిగి డాక్డర్‌ అయ్యాను.
– సలీమ

Spread the love