వర్షాకాలం రోగాల కాలం అంటారు. చిన్న చిన్న చినుకులకు తడవడం లేదా ముసురు పట్టి ఎండ తగలకపోవడం వల్ల చిన్న పాటి ఇన్‌ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి.. జలుబు, ఫ్లూ వంటి వైరస్‌లు వేధిస్తూ ఉంటాయి. వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలంటే… శరీరంలో ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. ఇమ్యూనిటీ బాగుంటే చిన్న పాటి ఫ్లూలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపించవు. అనారోగ్య సమస్యలు వేధించవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం చాలా అవసరం. ఇందుకు ఖరీదైన ఆహారం తీసుకోవల్సిన అవసరం లేదు. వంటగదిలోనే సులభంగా లభించే వాటితోనే రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చు. అవేంటంటే…
నల్ల మిరియాలు : నల్ల మిరియాలను కాలిమిర్చి అని పిలుస్తారు. ఇవి రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే ఈ నల్ల మిరియాలు ఏదో ఒక రూపంలో రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
వెల్లుల్లి : వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. అలాగే జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు, దగ్గును దరిచేరనివ్వదు.
అల్లం : మనం నిత్యం కూరల్లో వాడే వాటిల్లో అల్లం కూడా ఒకటి. వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతు, ఛాతి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. అలాగే మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అయితే అల్లాన్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్లు మన దరి చేరకుండా కాపాడుతుంది.
నిమ్మ : అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సి చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మ మంచి యాంటీ ఫంగల్, క్రిమినాశిని. ఇందులో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
పసుపు : పసుపుని మనం వంటలకు మాత్రమే కాక దెబ్బలకు తగిలిన ప్రాంతంలో కూడా ఉపయోగిస్తాం. ఎన్నో రకాల సమస్యలకు పసుపు మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడేందు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
తేనె : తేనె చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఫలితంగా వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పుప్పొడి ఉన్నాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి. వీటితో కాలానుగుణంగా వచ్చే అలెర్జీల నుండి ఉపశమనం లభిస్తుంది.
వీటితో పాటు ఆరోగ్యంగా ఉండటానికి, సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం చేస్తూ ఉండాలి. బరువు, రక్తంలో చక్కెర శాతాలను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి.