మరో చిచ్చు!

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అంటుకున్న మత విద్వేషపు మంటలు ఓ వైపు రగులుతుండగానే అందులో నుంచి వచ్చినట్టుగానే ఓ నిప్పురవ్వ ఢిల్లీ పొరుగు రాష్ట్రం హర్యానాలో మరోచిచ్చును రాజేసింది. ఫలితంగా ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. వందకు పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. ఇందులో పోలీసు వాహనాలు కూడా ఉన్నాయి. ఆందోళనకారులు యాభైకి పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇందులో ఎంతోమంది గాయపడ్డారు. రెండు వేలకు పైగా మంది భయంతో గుడిలో దాక్కున్నారు. సమస్య ఏదైనా కావచ్చు…అది ఎలాగైనా ఉండొచ్చు. కానీ దానికి ఈ ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నది మాత్రం సంఘ్ పరివారేననేది ఈ ఘటనతో మరోసారి తేటతెల్లమైంది. తెగల మధ్య ఘర్షణ తలెత్తెలా చేసి చోద్యం చూస్తున్న కాషాయ పార్టీ ప్రజల్ని ఏమార్చేందుకు మొసలి కన్నీరు కారుస్తోంది. మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రకటన గురించి పార్లమెంట్‌లో చర్చకు పట్టుబడుతున్న సమ యంలోనే హర్యానాలో మత ఘర్షణ తలెత్తడం ఆందోళనాకరం.అయితే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాత్రం ఇది పథకం ప్రకారం చేసిన కుట్రగా అభివర్ణించడం గమనార్హం. కుట్ర చేసిందెవరు? ఘర్షణలు సృష్టించిందెవరు? అనేది ప్రజలదంరికీ తెలిసిన బహిరంగ రహస్యం!
హర్యానాలో అసలు ఏం జరిగిందన్న విషయం ముందు తెలుసుకోవాలి. విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నూహ్ జిల్లాలో బ్రిజ్‌ మండల జలాభిషేక యాత్ర చేపట్టింది. ఇది నల్హర్‌ మహదేశ్‌ ఆలయానికి వెళ్లాల్సి ఉంది. సోమవారం నంద్‌ అనే గ్రామానికి ఈ యాత్ర చేరుకోగానే ఓ గ్రూపునకు చెందినవారు రాళ్లు రువ్వడంతో అక్కడ ద్రిక్త వాతావరణం ఏర్పడింది! ఇద్దరు హోంగార్డులు మృతి చెందారు. ఇందులో ఇంటిలిజెన్స్‌ వైఫల్యం కూడా ఉంది. వరుసగా రెండు రోజులుగా సాగుతున్న అల్లర్లను అక్కడి ప్రభుత్వం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడున్నది కూడా బీజేపీ డబులింజన్‌ సర్కార్‌యే. గ్రామం నుంచి మొదలైన ఘర్షణ ఢిల్లీ శివారు గురు గ్రామ్‌లోకి పాకింది. అదేరోజు రాత్రి సెక్టార్‌57లోని అంజుమాన్‌ మసీదుపై కొంతమంది మూకలు కాల్పులు జరపడంతో బీహార్‌కు చెందిన ముస్లిం యువకుడు చని పోయాడు. అంతటితో వారగలేదు. సెక్టార్‌70లో ఉన్న రెస్టారెంట్‌కు నిప్పుపెట్టి దుకాణాలను ధ్వంసం చేశారు. అంతేకాదు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్న ప్రాంతంలోని ముస్లింల వాహనాలకు నిప్పు పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముస్లింలపై పగతో రగిలినవారే ఈ ఘాతుకానికి ఒడి గట్టారని. బాద్‌షాపూర్‌లో సుమారు రెండు వందల మంది కర్రలు,రాళ్లతో కలియ తిరిగారు. జైశ్రీరామ్‌ అంటూ నినా దాలు చేశారు. బతుకుదెరువు కోసం ముస్లింలు నడుపుకునే మాం సపు దుకాణాలపై దాడులు చేశారు.
ఈ అల్లర్లకు ముఖ్యంగా భజరంగ్‌దళ్‌ నేత, గోరక్షక్‌ నాయ కుడు మనేసర్‌ అలియాస్‌ మోనూ యాదవ్‌ అనే వ్యక్తి కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో ఆవుల వ్యాపారం చేసుకునే ఇద్దరు ముస్లిం వ్యక్తులు కారులో శవాలై తేలారు. వీరి అనుమానాస్పద మృతిలో నిందితుడు ఇతను. నూహ్ లో జరిగే జలాభిషేక యాత్రలో పాల్గొంటున్నానని, మద్దతు దారులరా రండి అంటూ ఉద్దేశపూర్వకంగానే ఓ వీడియో రిలీజ్‌ చేసి అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇతనే వచ్చాడని ఓ గ్రూపువారు దాడులు చేసినట్టు సమాచారం. అయితే ఈ దాడుల్లో ఎక్కువ మంది ముస్లింలే గాయపడ్డారు. చనిపోయారు కూడా. అల్లర్ల నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని పక్కనబెట్టి సోషల్‌ మీడియాలో ఈ వార్తలు ప్రచారం కాకుండా మణిపూర్‌లో వలే ఇంటర్నెట్‌ను నిలిపేసింది. దీన్నిబట్టి చూస్తే అక్కడ కూడా ఓ విధ్వంస రచనకు పూనుకున్నట్టేనని అర్థమవుతోంది. వారు అను కున్న పద్ధతిలో ర్యాలీలు జరగాలి. పండగల్లో జనాలు పాల్గొనాలి. చిన్న ఆటంకాలు ఎదురైనా ముస్లింలే కారణంగా వెతికి మరీ కొట్టడం, వాహనాలు, ఇండ్లు దహనం చేయడాన్ని ఏమనాలి?
దేశంలో సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం అనాథిగా వస్తున్న ఆచారమే. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పండగల పేరుతో పెద్ద హంగామా చేయడం చూస్తూనే ఉన్నాం. హనుమాన్‌ జయంతి, శ్రీరామనవి, శోభాయాత్రల పేరుతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. శాంతి కోసం, సందేశం కోసం అయితే పర్వాలేదు. కానీ ఇందులో దాగున్న హిందూత్వవాదమే సమస్యలకు మూల కారణం. ఎందుకీ పగ, ప్రతీకారం, మీరు చెప్పే భిన్నత్వంలో ఏకత్వం ఇదేనా? నిన్న మణిపూర్‌లో కుకీల అణచివేత, నేడు హర్యానాలో మతల మధ్య ఘర్షణ రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందడానికి కాదా!

Spread the love