‘ఇండియా’ వర్సెస్‌ భారత్‌

 'India' vs Bharatభారతీయ జనతాపార్టీ గత తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉంటుంది. ఈ పార్టీ రాజ్యాంగబద్ధంగా లేదా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఆధారంగా ఏర్పడే సమ్మిళిత భారతదేశం కోసం పాలన చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలకు క్రమంగా అర్థమైంది. ప్రతిపక్ష పార్టీలను బలహీన పర్చేందుకు, అధికార పార్టీ ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), సీబీఐ (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) లాంటి ఏజెన్సీలను ప్రధానమైన సాధనాలుగా ఉపయోగించుకుంటుంది. బీజేపీ నాయ కత్వంలోని ప్రభుత్వ విధానాలు, ఒకవైపు (క్రోనీ క్యాపిటలిస్ట్స్‌) ఆశ్రిత పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తూ, మరోవైపు ప్రజాస్వామిక స్వేచ్ఛను బలహీనపరు స్తున్నాయి. అస్తిత్వం, రామమందిరం, లవ్‌ జీహాద్‌, ఇతర జీహాద్‌లు ఆవు మాంసం, పొరుగు వారికి వ్యతిరేకంగా తీవ్ర జాతీయవాద విన్యాసాలకు సంబంధించిన సమస్యలే కేంద్రంగా, అధికార పార్టీ రాజకీయాలు పని చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి సందర్భంగా కేవలం కొద్ది సమయానికి ముందు ప్రకటించి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌, పెరుగు తున్న నిరుద్యోగం, రైతుల సమస్యలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా పెరుగుతున్న దారుణమైన అకృత్యాల లాంటి అనేక సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని సగటు,పేద ప్రజల బాధలను మరింతగా పెంచాయి.
ఎన్నికల బాండ్ల ద్వారా లెక్కలేనంత డబ్బును కూడబెట్టడం ద్వారా బీజేపీ చాలా ధనికమైన జాతీయ పార్టీ అని గ్రహించడంతో పాటు సెంట్రల్‌ ఏజెన్సీలను ఉపయోగించు కోవడానికి ఎంపిక చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన వ్యవస్థను అస్థిరపరచి, సమస్యలకు కారణమైన మరొక యంత్రాంగం ‘పీ.ఎం కేర్‌ ఫండ్‌’. అన్నిటికంటే అత్యంత దారుణమైన విషయం ఏమంటే, బీజేపీ కి ఎన్నికల సమయంలో ఎలాంటి వైఫల్యాలు లేకుండా గట్టిగా పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు బీజేపీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇలాంటి అంశాలే, బీజేపీయేతర పార్టీలను ఐక్యం చేసి, ఇండి యన్‌ నేషనల్‌ డెవలప్మెంట్‌ ఇంక్లూజివ్‌ ఎలెయెన్స్‌ (ఇండియా) ను ఏర్పరచే పరిస్థితులు కల్పించాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాం గాన్ని రక్షించడానికి, బూత్‌స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బ్రహ్మాండంగా పనిచేసే యంత్రాంగం కలిగి ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి 26 ప్రతిపక్ష పార్టీలతో బెంగళూర్‌లో జరుపుకున్న రెండవ సమావేశంలో ఈ’ఇండియా’ను రూపొందించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావడం నిజం కావడంతో బీజేపీ మేల్కొని చేసిన మొదటి పని ఏమంటే, ముఫ్పై ఎనిమిది (అందరికీ తెలిసిన, అందరికీ తెలియని) చిన్నాచితకా పార్టీలను బయటకు తీసుకొచ్చి ఒక్కచోటకి చేర్చారు.అనేక పార్టీలకు చెందిన నాయకులు, బ్యానర్‌ పైన ఉన్న ఒకే ఒక్కఫొటో ఉన్న నాయకుడు చెప్పిన విధంగా చేస్తామని (తమకు ఇష్టం లేకపోయినా) తలవంచారు. ‘ఇండియా’ అనే (పదముల సముదాయముల మొదటి అక్షరములతో ఏర్పడిన పదం) అద్భుతమైన పదం వలన బీజేపీ వారు తీవ్రంగా బాధ పడ్డారు. ప్రతిపక్ష పార్టీలను అప్రతిష్టపాలు చేయడంతోపాటు కొంత మంది నాయకులు అలాంటి పదాన్ని ఉపయోగించడం సరైంది కాదన్నారు. వారు చెప్పేదాని ప్రకారం, ‘ఇండియా’ పేరును ఉపయోగించడం వల్ల అన వసరమైన ప్రభావాన్ని చూపుతుంది, ఎన్నికల సమయంలో ఆ పేరు ఒక వ్యక్తిగా ఉంటుందని, ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. బీజేపీ వారు ఢిల్లీలోని బరఖంబా పోలీస్‌ స్టేషన్‌ లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిస్వశర్మ వివిధ స్థాయిల్లో వ్యాఖ్యానించే ప్రయత్నం చేశాడు.”మన నాగరికతకు సంబంధించిన వైరుధ్యాలు ఇండియా, భారత్‌ ల పై ఆధారపడి ఉన్నాయి.బ్రిటీష్‌ వారు మన దేశానికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు,వలసవాద వారసత్వం నుండి మనని మనం విముక్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులు భారత్‌ కోసం పోరాటం చేశారు కాబట్టి మనం కూడా భారత్‌ కోసం కృషిని కొనసాగించాలని”అన్నాడు. హేమంత్‌ శర్మ వ్యాఖ్యలకు స్పందిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జైరాం రమేష్‌ ఇలా ట్వీట్‌ చేశాడు: ”ఆయన(శర్మ) కొత్త సలహాదారు మోడీ,మనకు స్కిల్‌ ఇండియా (నైపుణ్యమైన ఇండియా), స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా లాంటివి-మనకు అన్ని కొత్తపేర్లను కొనసాగుతున్న పథకాలకు ఇచ్చారు.ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ‘టీం ఇండియా ‘ వలె కలిసి పని చేయాలని కోరాడు. ఆఖరికి ఆయన ఇండియాకు ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేశాడు. కానీ 26 ప్రతిపక్ష పార్టీల వారు రూపొందించిన కూటమికి ‘ఇండియా’ అని పిలుచుకునే సందర్భంలో, ఆయనకు కోపం వచ్చి, ఇండియా పదాన్ని వాడిన తీరు ”వలసవాద మనస్తత్వాన్ని” ప్రతిబింబిస్తుందని” అన్నాడు.
దీంతో కంగుతిన్న ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ‘ఇండియా కోసం బీజేపీ’ని, ‘భారత్‌ కోసం బీజేపీ’ గా మార్చాడు. ఆయన పేర్కొంటున్న నాగరికతకు సంబంధించిన వైరుధ్యం, విలువలను హిందూత్వ అనుకూల రచయితలు వ్యక్తీ కరిస్తున్నారు. ”రాజ్యాంగానికి లోబడి భారతదేశాన్ని ఒక పౌర దేశం స్థాయికి తగ్గించడం అంటే భారతదేశ చరిత్ర ,పురాతన వారసత్వం, సంస్కృతి, నాగరికతలను నిర్లక్ష్యం చేసినట్లేనని” జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ శాంతిశ్రీ ధూళిపుడి పండిట్‌ అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగ విలువల కంటే కూడా నాగరికత విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హిందూత్వ అనుకూలమైన ఇతర రచయితలు అంటున్నారు. భారతీయ నాగరికత గురించి బీజేపీకి ఉన్న అవగాహన చాలా సంకుచితంగా ఉంది.బీజేపీ ఎప్పుడూ ప్రధానంగా హిందూ మతం బ్రాహ్మణవాద సాంప్రదాయాల గురించి విసుగు పుట్టించే విధంగా మాట్లాడుతుంది. గ్రీకులు, హన్‌ లతో జరిగిన సంపర్కంను విస్మరించి,ఇస్లాం,క్రైస్తవం రాకను,మన నాగరికత పై ‘విదేశీయులు’ చేసిన దురాక్రమణగా ప్రచారం చేస్తున్నారు.ఈ కథనం,భారతీయ నాగరికత గురించి జవహర్‌ లాల్‌ నెహ్రూకున్న అవగాహనకు చాలా భిన్నంగా ఉంది.అది ఈ విధంగా ఉంది: ”ఆమె( నాగరికత),రాత చెరిపి దాని మీద రాసే ఒక పురాతన రాత ప్రతి లాంటిది. అయినా కానీ, ఆ తరువాత వచ్చే ఏ రాతలు కూడా, అంతకు ముందు రాసిన రాతలను కనిపించకుండా చేయలేవు, లేదా చెరిపిివేయలేవు.”
బ్రాహ్మణవాద విలువలాధారంగా పాలించబడిన వైభవోపేతమైన గతంపై చాలా అసాధారణమైన రీతిలో హేమంత్‌ శర్మ, అయన సంస్థల ప్రాపంచిక దృష్టికోణం ఉంటుంది. ఆఖరికి చార్వాకుడు, బుద్ధుడు, మహావీరుడు, అశోక చక్రవర్తి లాంటి వారు అందించిన గొప్ప భారతీయ సాంప్ర దాయాలకు భక్తి, సూఫీలకు వారి దృష్టిలో అసలు స్థానమే లేదు. రొమిల్లా థాపర్‌,ఇర్ఫాన్‌ హబీబ్‌, రాంశరణ్‌ శర్మ,హర్బన్స్‌ ముఖియా లాంటి వామపక్ష చరిత్రకారుల పట్ల వారికి అమితమైన ద్వేషభావం ఉంది.లింగ శ్రేణీగత వ్యవస్థ ( జెండర్‌ హైరార్కీ),పుట్టుక ఆధారంగా ఏర్పడే కులం చుట్టూ తిరిగే వారి భారతీయ నాగరికత గురించి ఉండే దృష్టి కోణంలో చరిత్ర కారుల పట్ల వారి ద్వేషభావం దాగి ఉంది. ఈ వృత్తిపరమైన చరిత్ర కారులు సమాజం లోతైన గతిశీలతను చాలా అద్భుతంగా బయటికి తీసుకొని వచ్చారు. వారు కేవలం ‘పాలకుని మతం’ గురించి మాత్రమే పట్టించుకోవడమే కాదు, దళితులు, మహిళలు, ఆదివాసీల జీవితాలను కూడా వివరించడం ద్వారా నిజమైన భారతీయ నాగరికతలోని భిన్నత్వాన్ని తెలియజేశారు. వలసవాదుల విశ్వాసాల ద్వారా చరిత్రను చూస్తున్న మితవాద స్రవంతి ఇష్టానుసారంగానే నేడు వలసవాద వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడం వారి లక్ష్యం, కాబట్టే వారు ‘మతపరమైన చరిత్ర రచనా శాస్త్రాన్ని’ (కమ్యూనల్‌ హిస్టరియోగ్రఫీ)(అంటే రాజు మతం ద్వారా చరిత్రను చూడడం) ప్రవేశపెట్టారు. ఇది హేమంత్‌ శర్మ ఇష్టాల పూర్వ సిద్ధాంతం. మతపరమైన చరిత్ర రచనా శాస్త్రాన్ని కనిపించకుండా ఉంచుతూ, వారు తమ కథనాల్లో అగ్రకుల పితృస్వామిక భావాలను జోడిస్తూ,వారి (ఎక్స్‌ క్లూసివ్‌ పాలిటిక్స్‌) మినహాయింపు రాజకీయాలకు దీనిని ఆధారంగా చూపుతున్నారు.
భారత రాజ్యాంగం ప్రధానమైన అడ్డంకిగా వారు భావిస్తున్నారు. భారత జాతీయవాదం పెరగడం ప్రారంభ మవడంతో వారు మనుస్మృతిని,దానిలోని చట్టాలను స్తుతించడం మొదలు పెట్టారు. వారి జాతీయవాదానికి, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అంతర్గత ప్రమాద కారులని ముద్ర వేశారు. ఇలాంటి రాజకీయాల ద్వారా, మరీ ముఖ్యంగా ఈ దేశానికి ఈ రాజ్యాంగం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు పూర్వ సర్సంగ్‌ చాలక్‌ అయిన కె.సుదర్శన్‌ ద్వారా భారత రాజ్యాంగం పట్ల ఉన్న తమ వ్యతిరేకతను చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు.
ప్రతిపక్ష పార్టీలు ఏర్పరచుకున్న ‘ఇండియా’ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది నిస్సందేహంగా మన నాగరికత సమ్మిళిత విలువలను వ్యతిరేకించడమే.అయినప్పటికీ భారతీయ నాగరికత అభివృద్ధి ఫలితంగానే మన రాజ్యాంగం ఏర్పడింది. ‘ఇండియా’ కూటమికి వ్యతిరేకత కూడా శామ్యూల్‌ హంటింగ్టన్‌ రచించిన ‘నాగరికతల ఘర్షణ’ను చూసిన సిద్ధాంతంలోనే పాతుకొని పోయింది. నెహ్రూ మన నాగరికత గురించి చేసిన వ్యాఖ్యానంలో వ్యక్తీకరించబడిన విధంగా, నాగరికతల కూటమి గురించి నొక్కి వక్కాణించిన ఐక్యరాజ్య సమితి నివేదికకు ఇది భిన్నంగా ఉంది. హేమంత్‌ శర్మ ఇష్టానికి అనుగుణమైన విభజన రాజకీయాలపై ‘ఇండియా’ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451

రామ్‌ పునియానీ

Spread the love