నోరూరించే పచ్చళ్లు!

భోజనంలో పప్పు, కూర, చారు, పెరుగు ఎన్ని ఉన్నా పచ్చళ్ల ప్రాధాన్యం మాత్రం తగ్గదు. అంచుకు పచ్చడి లేకపోతే ఏదో వెలితిగా ఉందని అంటుంటారు కొందరు. అయితే ఎప్పుడు చేసుకునేలా టమాటో, పచ్చిమిర్చి, గోంగూర, పుదీనా, కొత్తి మీర పచ్చళ్లే కాకుండా కొత్త రుచుల్ని కూడా ఆస్వాదించాలి కదా. అలాంటి వెరైటీ పచ్చళ్లే ఈ వారం మానవిలో…
క్యాబేజీ, చింతకాయతో…
కావాల్సిన పదార్థాలు : సన్నగా తరి గిన క్యాబేజీ – రెండు కప్పులు, లేత చింతకాయలు – పన్నెండు, ఎండుమిర్చి – పన్నెండు, కొత్తిమీర – కట్ట, ఆవాలు – చెంచా మెంతులు – అర చెంచా, ఇంగువ – కొద్దిగా, శెనగపప్పు – రెండు చెంచాలు, పసుపు – పావు చెంచా, నూనె – పావుకప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, పచ్చిమిర్చి – ఐదు
తయారు చేసే విధానం : చింతకాయల్ని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా నూనెలో వేసి మగ్గనిచ్చి దింపేయాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి ఇంగువా, క్యాబేజీ, పసుపూ, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టే యాలి. కొంచెం సేపటికి క్యాబేజీ మగ్గుతుంది. దానిని పక్కకు పెట్టు కోవాలి. మరో కడాయిలో తాలింపు కోసం మిగిలిన నూనె వేడిచేసి ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కరివేపాకు, శెనగపప్పు వేయించు కుని తీసుకోవాలి. ఇందులోని ఆవాలూ, సెనగపప్పూ, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం విడిగా తీసుకుని మిగిలిన దాంతో పాటూ చింతకాయ గుజ్జూ, పచ్చిమిర్చి మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీన్ని మగ్గించిన క్యాబేజీలో కలపాలి. విడిగా తీసుకున్న తాలింపును దీనిపై వేసి మరోసారి కలపాలి.
కంద, నువ్వులతో…
కావాల్సిన పదార్థాలు : కంద ముక్కలు – రెండు కప్పులు, పచ్చిమిర్చి – ఆరు, ఎండుమిర్చి – పన్నెండు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు చెంచా, ఆవాలు, జీలకర్ర – చెంచా చొప్పున, నూనె – ఆరు చెంచాలు, నువ్వులు – ఆరు చెంచాలు, చింతపండు గుజ్జు – రెండు చెంచాలు, మినప్పప్పు, శెనగపప్పు – నాలుగు చెంచాల చొప్పున, బెల్లం తరుగు – నాలుగు చెంచాలు
తయారు చేసే విధానం : కందముక్కలపై సరిపడా ఉప్పు, పసుపు వేసి అవి మునిగేదాకా నీటిని పోసి పొయ్యిమీద పెట్టాలి. కందముక్కలు ఉడికి, నీరు కూడా ఆవిరైపోయాక దింపేయాలి. కడాయిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మినప్పప్పు, సెనగపప్పు వేయాలి. అవి కొద్దిగా వేగాయను కున్నాక పచ్చిమిర్చి కూడా వేసి రెండు నిమిషాల తరవాత దింపేయాలి. ఈ తాలింపు నుంచి కొద్దిగా విడిగా తీసి, మిగిలింది మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి. ఇందులో చింతపండు, బెల్లం వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. చివరగా ఉడికించిన కందముక్కల్ని కారంలో వేసి బాగా కలిపి, మిగిలిన తాలింపును పైన వేస్తే సరి.
దబ్బకాయతో…
కావాల్సిన పదార్థాలు : దబ్బకాయ – ఒకటి పెద్దది, వేయించిన గసగసాల పొడి – అరకప్పు, ఎండు మిర్చి – ఇరవై ఐదు, ఆవాలు, జీలకర్ర – మూడు చెంచాల చొప్పున, మినప్పప్పు, శెనగపప్పు – రెండూ చెంచాల చొప్పున, నూనె – పావు కప్పు, కొత్తమీర – కట్ట, ఇంగువ – పావు చెంచా, మెంతులు – చెంచా, పసుపు – అర చెంచా, ఉప్పు – తగి నంత, బెల్లం తరుగు – మూడు చెంచాలు.
తయారు చేసే విధానం : దబ్బకాయను కడిగి, తుడిచి ముక్కలు కట్‌ చేసి పెట్టుకోవాలి. కడాయిలో రెండు చెంచాల నూనె వేసి వేడయ్యాక ఎండు మిర్చి, ఇంగువా, ఆవాలూ, జీలకర్రా, మినప్పప్పు, సెనగపప్పు, మెంతులూ వేసుకోవాలి. అవి వేగాక విడిగా తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగి లిన నూనె వేసి వేడయ్యాక దబ్బ కాయ ముక్కలూ, తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు వేసి సన్న మంట మీద ముక్కలు మగ్గబెట్టాలి. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి తాలింపును మెత్తని పొడిలా చేసుకోవాలి. దబ్బకాయ ముక్కలు ఉడికి, దగ్గరకు అయ్యాక ఎండు మిర్చి కారాన్ని, గసగసాల పొడినీ, బెల్లం తరుగును వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి.

దోసకాయ, వంకాయతో..
కావాల్సిన పదార్థాలు : దోసకాయ – ఒకటి, వంకాయ – ఒకటి పెద్దది, చింతపండు గుజ్జు – నాలుగు చెంచాలు, కొత్తిమీర – కట్ట, ఉప్పు, పసుపు – అరచెంచా, మిరియాలు – చెంచా, మినప్పప్పు – రెండు చెంచాలు, శెనగపప్పు – రెండు చెంచాలు, నూనె – పావు కప్పు, ఎండుమిర్చి – పన్నెండు, పచ్చిమిర్చి – ఏడు, ఆవాలు – అరచెంచా, కరివేపాకు – ఒక రెబ్బ.
తయారు చేసే విధానం : దోసకాయ, వంకాయకు కొద్దికొద్దిగా నూనె రాసి గ్యాస్‌ పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. తర్వాత వాటి చెక్కు తీసేసి గుజ్జులా చేసుకుని పెట్టుకోవాలి. కడాయిలో చెంచా నూనె వేడి చేసి మినప్పప్పు, సెనగపప్పు, పదకొండు ఎండు మిర్చి, మిరియాలు వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి పచ్చిమిర్చి, కొత్తిమీరా వేయించుకుని దింపేయాలి. ముందుగా చేసిన ఎండుమిర్చి తాలింపును మిక్సీలోకి తీసుకుని సరిపడా ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా పొడిచేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీరా, చింతపండు గుజ్జు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయ, దోసకాయ గుజ్జులో వేసి కలపాలి. చివరగా మిగిలిన నూనె వేడిచేసి ఆవాలూ, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు వేయించి పచ్చడిపై వేయాలి.
క్యారెట్‌, వాముతో..
కావాల్సిన పదార్థాలు : క్యారెట్‌ తురుము – రెండు కప్పులు, వాము ఆకు – కప్పు, చింతపండు రసం – పావుకప్పు, మినప్పప్పు – రెండు చెంచాలు, శెనగపప్పు – రెండు చెంచాలు, జీలకర్ర – చెంచా, ఎండుమిర్చి – పది, నూనె – పావుకప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు చెంచా, పచ్చిమిర్చి – ఐదారు, కరివేపాకు – రెండు రెబ్బలు
తయారు చేసే విధానం : ముందుగా వామాకును కడిగి తరిగి తడి ఆరనివ్వాలి. చింతపండు రసంలో పసుపు, సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేడిచేసి మినప్పప్పు, శెనగపప్పు, ఆవాలూ, జీలకర్రా, ఎండుమిర్చి వేసి వేయించుకుని తీసిపెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు వేయించి, తర్వాత కరివేపాకు, వామాకు తరుగు కూడా వేయాలి. ఐదు నిమిషాల తర్వాత క్యారెట్‌ తురుము వేయాలి. ఆ కోరు కొద్దిగా వేగాక చింతపండు రసం వేసి మూత పెట్టేసి, మంట తగ్గించేయాలి. నీరు పూర్తిగా ఇంకిపోయాక దింపేయాలి. తర్వాత మిక్సీలో ఎండుమిర్చి తాలింపు వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని క్యారెట్‌ మిశ్రమంలో వేసి కలిపితే సరిపోతుంది.

Spread the love