బ్లాక్‌ టీతో…

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌స్టైల్‌నే గడుపుతున్నారు. దీని వల్ల ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరకంగా అనేక సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. అందులో కొన్నింటికి బ్లాక్‌ టీ పరిష్కారం చూపగలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే…
 రోగ నిరోధక శక్తిని పెంచి.. జీర్ణ వ్యవస్థను కాపాడేందుకు ఇది తోడ్పడు తుంది. అలాగే జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఇది ఇట్టే తగ్గించేస్తుంది. అలాగే మన శరీరంలోని వైరస్‌, బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వయసులో అయినా డయాబెటిస్‌ వచ్చేస్తోంది. కానీ రీసర్చ్‌ ప్రకారం రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్‌ టీ తాగితే 70 శాతం మేర డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు టైప్‌ 2 డయాబెటిస్‌ని రాకుండా చేస్తాయి.
ఇందులోని లిథినైన్‌ యాసిడ్‌ ఒత్తిడితో పాటు అలసటను కూడా తగ్గిస్తుంది.
ముప్ఫైల తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గుతూ వస్తుంది. రోజూ బ్లాక్‌ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు అర్థరైటిస్‌ వంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.
నోటి దుర్వాసన వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. దీని వల్ల పంటిలో క్యావిటీలు ఏర్పడతాయి. బ్లాక్‌ టీ తాగడం వల్ల క్యావిటీలను కలిగించే బ్యాక్టీరియా నోటి నుంచి తొలగిపోతుంది. ఇందులోని పాలిఫినాల్స్‌ పళ్ల పిప్పిని తొలగిస్తాయి.
బ్లాక్‌ టీ తాగడం వల్ల మెటబాలిజం పెరిగే వీలుంటుంది. దీని వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే మెటబాలిజం పెరుగుతుంది కదా అని.. తరచూ బ్లాక్‌ టీ తీసుకోవడం కూడా సరికాదు. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్‌ టీ తాగుతూ ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామం చేయడం వల్ల బరువు సులభంగా తగ్గే వీలుంటుంది.
తయారీ ఇలా… : బ్లాక్‌ టీని కూడా మామాలు టీ మాదిరిగానే తయారు చేయవచ్చు. కాకపోతే ముందుగా నీటిని మరిగించి అందులో టీ పౌడర్‌ వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. అలాగే యాలకులు, అల్లం లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదంటే మార్కెట్‌లో బ్లాక్‌ టీ బాగ్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు.

Spread the love