అనారోగ్యాన్ని ముందే కనిపెడుతుంది

సాధారణంగా ఆరోగ్యపరిస్థితి తెలుసుకోడానికి రక్త పరీక్షలు, ఈ.సి.జీ లు, బయాప్సిలు చేస్తుంటారు. అయితే ఇంజక్షన్‌ అంటేనే భయపడే వారు చాలా మంది ఉంటారు. అంతే కాకుండా వైద్య పరీక్షలకు, రిపోర్ట్‌లకు ఎంతో సమయం వెచ్చించాలి. అంత సమయం కేటాయించలేక కొందరు, భయపడి కొందరు పరీక్షలు చేయించుకోరు. దాంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని గుర్తించడంలో ఆలస్యమై ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అనారోగ్యాన్ని ముందుగానే కనిపెట్టే పరికరం కనిపెట్టింది చాడా గాయత్రి. అదే ‘ఆర్కా హెల్త్‌ కేర్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ థర్మల్‌ కెమెరా స్క్రీనింగ్‌’. నిమిషాల్లో అనారోగ్య సమస్యను పసిగట్టే ఆ పరికరం గురించి, అసలు ఇలాంటి ఓ పరికరాన్ని కనిపెట్టాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…
   గాయత్రి స్వస్థలం గుంటూరు జిల్లా, తాడికొండ. అమ్మ నిర్మలాదేవి, నాన్న బ్రహ్మచారి. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేశారు. ఈమెకు ఓ చెల్లి, పేరు అనూహ్య. వృత్తిరీత్యా ఈవిడ వైద్యురాలు. గాయత్రి పదవ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. బి.టెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కాకినాడలోని జె.ఎన్‌.టి.యులో చదివారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి ఎం.బి.ఎ చేస్తూనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. అమెరికా, సింగపూర్‌లలో ఉద్యోగం చేసిన గాయత్రి 2014లో భారతదేశం తిరిగి వచ్చి ‘డిజిటల్‌ మార్కెటింగ్‌ స్టార్టప్‌ కంపెనీ’ ప్రారంభించారు. అది చాలా బాగా కొనసాగింది. అప్పుడే డేటా ఎనాలసిస్‌ పైన వచ్చిన ఓ పుస్తకాన్ని నారా లోకేష్‌ చదివారు. అది రాసిన ఐదుగురిలో గాయత్రి ఒకరు. లోకేష్‌ సిఫారసుతో చంద్రబాబు నాయుడు నుండి కబురు వచ్చింది గాయత్రికి. 2014 ఎలక్షన్‌ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ప్రచారానికి డేటా ఎనలిస్ట్‌గా పనిచేసారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం తరపున గాయత్రికి ఓ.ఎస్‌.డిగా (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా బాధ్యతలు ఇచ్చారు. 2018లో తాను స్టార్ట్‌ చేసిన డిజిటల్‌ మార్కెటింగ్‌ స్టార్టప్‌ కంపెనీని ఒకరు కొనుక్కున్నారు. వెంటనే 2019లో ‘ఆర్కా హెల్త్‌ కేర్‌ రీసెర్చ్‌ అండి టెక్నాలజీ’ సంస్థకు శ్రీకారం చుట్టారు.
తండ్రి మరణంతో…
2018లో గాయత్రి తండ్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి 10 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయారు. ఆ సంఘటనను ఆమె జీర్ణించుకోలేకపోయారు. తండ్రికి మధుమేహం ఉంది. దాని సైడ్‌ ఎఫెక్ట్‌ వల్లే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందన్నారు డాక్టర్లు. గాయత్రి చెల్లి అప్పటికే వైద్యురాలిగా వున్నారు. అయినా తండ్రిని కాపాడుకోలేక పోయామని బాధపడ్డారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి ముందే తెలిస్తే పోయేవారు కాదని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని భావించారు. ఆ బాధతో అనారోగ్యాన్ని ముందే కనిపెట్టే పరికరాన్ని రూపొందించాలని సంకల్పించారు. దాని ఫలితమే ఆర్కా రీసెర్చ్‌ స్థాపన. వారి థర్మల్‌ కెమెరా ద్వారా మధుమేహం, హృద్రోగ సమస్యలు, బి.పి, కొలెస్ట్రాల్‌ లాంటివి ముందే తెలుసుకుంటారు. అదే సమయంలో ఈ కెమెరా గురించి చెన్నై ఎస్‌.ఆర్‌.ఎం. కాలేజీకి చెందిన బయో మెడికల్‌ ఇంజినీర్‌, శాస్త్రవేత్త డా.జయంతి రాసిన జర్నల్‌ చదివారు గాయత్రి. వెంటనే తన చెల్లెలు డా.అనూహ్యతో పాటు వెళ్ళి ఆమెను సంప్రదించారు. ఆ ముగ్గురు కలిసి అందుబాటులో ఉన్న సాంకేతికతతో పరిశోధన చేశారు. గాయత్రికున్న డేటా ఎనలిస్ట్‌ అనుభవం, సెన్సార్‌, సిగల్‌ అనాలసిస్‌పై వారికున్న పరిజ్ఞానం ఈ ఆవిష్కరణకు ఎంతగానో తోడ్పడింది. దాదాపు ఏడాది కాలం పరిశోధనలు జరిపి 2019లో ‘ఆర్కా హెల్త్‌ రీసెర్చ్‌’ ప్రారంభించారు.
పనితీరు, ప్రయోగాలు
ఈ థర్మల్‌ కెమెరాకు ‘ఐరా’ (ఇంటెలిజెంట్‌ హెల్త్‌ రిస్క్‌ అసిస్మెంట్‌ )సాఫ్ట్‌వేర్‌ని ఇనిస్టాల్‌ చేశారు. మొదట 200 మందికి రక్త పరీక్షలు, ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయించి థర్మల్‌ కెమెరాతో పరీక్షించారు. ఆ పరిశోధన విజయవంతం అయింది. థర్మల్‌ కెమెరా ముందు ముఖాన్ని ఓ నిముషం పాటు ఉంచితే చాలు ఆ కెమెరా వీడియో తీస్తుంది. ఆ వీడియోని కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి ఐరా సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేవలం ఐదు నిముషాల్లో ఫలితాలు చెపుతారు. ఆ వ్యక్తికి మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, హృద్రోగ సమస్యలు 5 నుండి 7 ఏండ్ల వ్యవధిలో వచ్చే సూచనలు ఉన్నాయా లేదా అని గుర్తించి తెలియచేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా థర్మల్‌ కెమెరా ఒక సెకనుకు 30 చొప్పున, ఒక నిముషానికి 1800 ఫొటోలు తీస్తుంది. వీటి ద్వారా నుదురుపైన మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరాలు, వాటిలో రక్తప్రసరణ వేగం లాంటి వాటిని సిగల్స్‌ ద్వారా పరిశీలన చేసి ముందుగానే అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను కనిపెట్టి నివారించవచ్చు.
ఆర్కా రీసెర్చ్‌ పొందిన అవార్డులు
గాయత్రి చేసిన ఈ కొత్త ఆవిష్కరణకు ‘కామన్‌ వెల్త్‌ డిజిటల్‌ అవార్డ్‌’, ‘బెస్ట్‌ హెల్త్‌ కేర్‌ స్టార్టప్‌ అవార్డ్‌’, ‘సమ్మెన్‌ టోర్‌ ప్రో వారి నుండి టైమ్స్‌ టూ లీప్‌ అవార్డ్‌’, ‘వెస్ట్రన్‌ డిజిటల్‌ అవార్డ్‌’, ‘బ్రాండ్‌ ఇండియా నుండి గ్లోబల్‌ విమెన్‌ లీడర్షిప్‌ సెర్టిఫికెట్‌’ లాంటివి ఎన్నో పొందారు.
ఐదు వేల మందికి పరీక్షలు
థర్మల్‌ స్క్రీనింగ్‌ టెక్నాలజీ సహాయంతో హెల్త్‌ చెకప్‌ కోసం రక్త పరీక్షలు, బయాప్సి, ఈ.సి.జి అంటూ చేసే రకరకాల పరీక్షలు తగ్గించుకోవచ్చు. ఇప్పటి వరకు 5000 మందికి ఈ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. 91 శాతం మందికి కచ్చితమైన ఫలితాలు వచ్చాయని గాయత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌తో పాటు మరికొన్ని సెంటర్లలో వీరి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు అతి తక్కువ ధరలతో 100రూ. నుంచి 150 రూపాయలకు అందిస్తున్నారు. తన తండ్రిలా ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దని భావించి ఎన్నో వ్యయ ప్రయాసాలతో పరిశోధనలు చేసి థర్మల్‌ స్క్రీనింగ్‌ ఆవిష్కరించిన గాయత్రి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని కోరుకుందాం…
– లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్‌, 9445360139
వి హబ్‌ ప్రోత్సాహం
‘వి హబ్‌ నాలాంటి నూతన ఆవిష్కరణలను చేసే మహిళలకు ఎంతో ప్రోత్సహం ఇచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నది. అవి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆర్ధికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయో ఏషియా ఎగ్జిబిషన్‌లో కూడా ఆర్కా రీసెర్చ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు వందల మందికి చేయగలిగాం’ అంటూ ఆర్కా రీసెర్చ్‌ సి.ఈ.ఓ గాయత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఐరా సాఫ్ట్‌వేర్‌కి గుర్తింపు
ఆర్కా రీసెర్చ్‌ వారి ‘ఐరా’ సాఫ్ట్‌వేర్‌కి 5 పేటెంట్స్‌ వచ్చాయి. అంతే కాదు మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఒక పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రోగ్రాం చేశారు. ప్రస్తుతం ఏ.ఐ. సైంటిస్ట్‌ సమీర్‌తో కలిసి ఇండియాలోని హైదరాబాద్‌, ముంబై, బెంగుళూరుల్లోని వేల సంఖ్యలో హాస్పిటల్స్‌, డయోగస్టిక్‌ సెంటర్లలో, జిమ్‌ సెంటర్‌లలో ఈ రకమైన థర్మల్‌ కెమెరా స్క్రీనింగ్‌తో పరీక్ష చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో విదేశాలకు ఈ థర్మల్‌ స్క్రీనింగ్‌ సౌకర్యాన్ని అందించబోతున్నారు. అన్నట్టు వీరి ప్రయోగం ప్రపంచంలోనే మొట్టమొదటిది. అలాంటి ప్రయోగం మన తెలుగు వారు చేయడం తెలుగువారికి, భారతదేశానికే గర్వకారణం.

Spread the love