వెలుతురు చాలా కీలకం

ఇప్పటికీ కొన్ని కంపెనీలు మొత్తం వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు సగం రోజులు మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లోని వెలుతురు ప్రధాన పాత్ర పోషిస్తుంది. గాలీ, వెలుతురూ ధారాళంగా వచ్చినప్పుడే ఇంట్లో ఎక్కువ సేపు ఉండగలం. అలాగే ఇంట్లో ఉన్న లైట్స్‌ కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. సరైన వెలుతురు లేని రూమ్‌లో ఏ పని చేయాలనిపించదు. అలాంటి రూమ్‌లో పని చేయడం వల్ల తలనొప్పి, కంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
సూర్యకాంతి : మీరు పని చేస్తున్న గది కిటికీ నుంచి చక్కటి కాంతి వస్తుందా లేదో చూసుకోవాలి. వెలుతురు మంచిగా ఎక్కడ వస్తుంటే మీ డెస్క్‌ అక్కడ ఏర్పాటు చేసుకోండి. సూర్యకాంతి వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. అదే ఆర్టిఫిషియల్‌ లైటింగ్‌ వల్ల త్వరగా అలసిపోతాం. అయితే వర్క్‌ డెస్క్‌ని కిటికీకి ఓ పక్కగా అరేంజ్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని వల్ల కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద నీడలు పడకుండా ఉంటాయి.
ఎల్‌ఈడీ లైట్స్‌ : ప్రస్తుతం గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగిపోతోంది. వాతావరణాన్ని కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. అందుకనే ఎల్‌ఈడీ లైటింగ్‌కి మారడం మంచిదని నిపుణుల సూచన. ఈ లైట్స్‌ తక్కువ కరెంట్‌ వాడుకుంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి. మంచి లైటింగ్‌ కూడా ఇస్తాయి.
డెకరేటివ్‌ లైటింగ్‌ : డెకరేటివ్‌ లైట్స్‌ మన మూడ్‌ని మార్చేస్తాయి. ఎంత విసుగైనా క్షణాల్లో పోయి ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇంట్లోని వర్క్‌ పరిసరాల్లో డెకరేటివ్‌ లైట్స్‌ అరేంజ్‌ చేసుకోడం వల్ల రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. కంటికి కూడా విశ్రాంతిగా ఉంటుంది.
టాస్క్‌ లైట్‌ : ఇంట్లోనించి పని చేసినా, ఆఫీస్‌కి వెళ్ళి పని చేసినా నైట్‌ షిఫ్ట్స్‌ ఉన్నవారు రాత్రి పూటే పని చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి పగలు మొదలు పెట్టిన పనే లేట్‌ నైట్‌ వరకూ సాగుతుంది. ఇలాంటప్పుడు టాస్క్‌ లైట్స్‌ మీకు బాగా హెల్ప్‌ చేస్తాయి. ఈ టాస్క్‌ లైట్స్‌ కంప్యూటర్‌ స్క్రీన్నీ మనకు ఇబ్బంది కలగకుండా చేస్తాయి. అంతేగాక దీని వల్ల స్క్రీన్‌ నుంచి అనవసరమైన లైట్‌ రిఫ్లెక్ట్‌ అవ్వకుండా ఉంటుంది. ఈ టాస్క్‌ లైట్‌ని ఎప్పుడూ కంప్యూటర్‌ స్క్రీన్‌ వెనుక పెట్టుకోవాలి. టాస్క్‌ లైట్‌ కొనే ముందే అడ్జస్టబుల్‌ అవకాశం ఉందో లేదో పరిశీలించుకోవాలి. లేదంటే సమస్య వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌తో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ని హ్యాపీగా లీడ్‌ చేయొచ్చు.

Spread the love