ప్రేక్షకులను బాగా నవ్వించే సినిమా

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్‌ సాలే’. నేహా సోలంకి నాయిక. ప్రణీత్‌ బ్రాహ్మాండ పల్లి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మాతగా, బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మించారు.
ఈనెల 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని సురేష్‌ డిస్టిబ్యూషన్‌ వాళ్లు విడుదల చేస్తున్నారు. మంచి క్రైమ్‌ కామెడీ స్టోరీని తీశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. ప్రణీత్‌ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ భయం కూడా వేసింది. ఆయన చెప్పింది తీయగలుగుతాడా లేదా అని. ఫస్ట్‌ కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు బాగాతీశాడు. హీరో శ్రీసింహాకు ఈ జోనర్‌ బాగా సెట్‌ అవుతుంది. ఆయన ‘మత్తువదలరా’ మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్‌ ఖాయం. ఇందులో హీరో పేరు అర్జున్‌. సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు. ఈ క్రమంలో మోసాలు చేయడం.. ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుంది. ఓ రింగ్‌ ఈ సినిమాలో కీ రోల్‌ ప్లే చేస్తుంది. ఇటీవల ‘ది వరల్డ్‌ ఆఫ్‌ భాగ్‌ సాలే’ పేరుతో ఒక యానిమేషన్‌ వీడియో విడుదల చేశాం. దీనికి సిద్దూ జొన్నలగడ్డ వాయిస్‌ అందించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కాల భైరవ అద్భుతమైన సంగీతం అందించారు’ అని చెప్పారు.

Spread the love