టక్కర్‌ విజయం ఖాయం..

హీరో సిద్ధార్థ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘టక్కర్‌’. ఈ చిత్రానికి కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటించింది. ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు సిద్ధార్థ్‌ మీడియాతో సంభాషించారు.
ఆద్యంతం ఘర్షణమయం
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రంలో హీరో-హీరోయిన్‌ మధ్య ఘర్షణ, హీరో-విలన్‌ మధ్య ఘర్షణ, అహం, లింగం, వయస్సు, డబ్బు ఇలా అనేక ఘర్షణలు ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్‌ షిప్‌ లో చాలా షేడ్స్‌ ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కోరికతో, హీరోని కిడ్నాపర్‌గా మారేలా పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. నిరాశ అతని లక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా కొనసాగించేలా చేస్తుంది. కొడుకు, తల్లి మధ్య సాగే కీలకమైన డైలాగ్‌ సినిమా సారాంశాన్ని తెలుపుతుంది. హీరో నగరానికి రాగానే దిగజారిపోతున్న పరిస్థితులను చూస్తాడు. పాత్ర తీరు, పరిస్థితుల కారణంగా గూండాలతో పోరాడతాడు.
నా మనస్తత్వాన్ని ప్రతిబింబించే సినిమా
ఈ తరంలో డబ్బు సంపాదించాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. సెలబ్రిటీల విపరీత సంపాదన అందరికీ తెలిసిందే. అయితే, నేను పెరిగిన విధానం డబ్బు కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలనే నమ్మకాన్ని నాలో కలిగించింది. నేను సాధారణ విషయాలలో ఆనందం, సంతప్తిని పొందగలను అలాగే నేను కోరుకున్నప్పుడల్లా ప్రశాంతంగా నిద్రపోగలను. కాలేజీ రోజుల్లో నాటి పాత దుస్తులనే ఇప్పటికీ ధరిస్తున్నాను. ఇదే మనస్తత్వం ‘టక్కర్‌’లో పోషించిన పాత్రలో ప్రతిబింబిస్తుంది. ఇందులో సరికొత్త లుక్‌కి కారణం మా చిత్ర దర్శకుడు కార్తీక్‌ క్రిష్‌. నటుడిగా నన్ను నేను మరిచిపోయి, ఆ పాత్రలో లీనమై, పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. నా పాత్ర మిమ్మల్ని కూడా బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆశిస్తున్నాను.
ఇలాంటి ప్రేక్షకులు అరుదు..
ఇతర భాషల పరిశ్రమలతో పోలిస్తే తెలుగు సినిమా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మన దేశంలో థియేటర్లలో ప్రదర్శించబడే చిత్రాలపై తెలుగు ప్రేక్షకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. ఇలాంటి ప్రేక్షకులు, అభిమానులు అరుదుగా ఉంటారు. తెలుగు అభిమానులు నన్ను పక్కింటి అబ్బాయిగా భావించి, నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. తెలుగు బిడ్డగా ఆదరిస్తున్నారు.
ప్రేమ కథలతో విసిగిపోతున్నా
ఒక్కసారి లవ్‌ స్టోరీలు చేస్తే ఆ జోనర్‌లోనే కొనసాగాలని ఇండిస్టీలో ఒక అభిప్రాయం ఉంది. ప్రేమ కథలలో కూడా కొందరు రాబోయే సంవత్సరాల్లోనూ ప్రభావితం చేసేలా చిత్రాలను రూపొందించారు. అయితే, నేను విజయ వంతమైన ప్రేమకథను రూపొందించినట్లయితే, రాబోయే దశాబ్దం వరకు ప్రేమకథలు చేయాల్సిన ప్రమాదం ఉంది (నవ్వుతూ).
ఆ మ్యాజిక్‌ని రీ క్రియేట్‌ చేయలేం
‘టక్కర్‌’ తర్వాత మా సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న ‘చిన్నా’ సినిమా నా డ్రీమ్‌ప్రాజెక్ట్‌. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’, మాధవన్‌, నయనతారతో ‘టెస్ట్‌’ వంటి భిన్న చిత్రాల్లో నటిస్తున్నాను. ఇక అందరూ ‘బొమ్మరిల్లు 2’ ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. ‘బొమ్మరిల్లు’ చిత్రానికి ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో చిత్రీకరించబడిన భావోద్వేగాలలోతు సాటిలేనిది. దాని లోతైన ప్రభావాన్ని అధిగమించగల చిత్రాన్ని అందించడం సవాల్‌తో కూడుకున్నది. ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్‌ని సీక్వెల్‌లో రీ క్రియేట్‌ చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి ఇప్పట్లో ‘బొమ్మరిల్లు 2’ సినిమా ఆలోచన లేదు.

Spread the love