దర్శకుడు మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర 2’. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్‌పై ఈ సినిమాను శివ మేక నిర్మిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ, ‘ఇందులో 2009 నుంచి 2019 వరకు ముఖ్యంగా జగన్ ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో ఉంటుంది. వాస్తవ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. అలాగే జగన్ ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. సినిమా చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల టైంలో అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు. ”యాత్ర’ మాదిరిగానే దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’ అని నిర్మాత శివ మేక చెప్పారు.