తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌ ఖాయం..

ఈనెల 5న విడుదలైన మలయాళం సినిమా ‘2018’. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో ముందుకు సాగుతూ అద్భుతమైన వసూళ్ళను రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్‌ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్‌ టాక్‌తోనే పదిహేను రోజుల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
మలయాళంలో సంచలనం సష్టిస్తున్న ఈ సినిమాను తెలుగులో నిర్మాత బన్నీ వాసు రిలీజ్‌ చేయనున్నారు. తెలుగులో ఈనెల 26న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈచిత్రాన్ని మీడియా వారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌, సినిమాటోగ్రాఫర్‌ అఖిల్‌ జార్జ్‌, ఎడిటర్‌ చమన్‌ చక్కో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని, నాది హామీ అని అన్నారు. 2018 ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన కేరళలో అధిక వరదలు సంభవించి, సుమారు 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు. దీన్ని బేస్‌ చేసుకుని దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కేరళలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. టోవినో థామస్‌, కున్చాకో బోబన్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, అసిఫ్‌ అలీ, లాల్‌, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Spread the love