డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ,’ అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్త్వం వైపు లాగాయనేది కథ. ఈ సినిమా కథ చాలా కొత్తది. ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా. ‘జయం’ సినిమాలో ‘ప్రియతమా’ పాట సినిమా విడుదల తర్వాత మరో స్థాయికి వెళ్ళింది. ‘అహింస’ కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. తేజ, నా కాంబోలో ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్ చేశాం. దర్శకుడిగా, నటుడిగా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను. అలాగే కథలు నచ్చితే తప్పకుండా సంగీత దర్శకత్వం కూడా వహిస్తాను’ అని తెలిపారు.