దర్శకుడు కె దశరథ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాత కూడా. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈనెల 30న విడుదల కానునుంది. ఈ నేపథ్యంలో రచయిత, నిర్మాత దశరథ్ మీడియాతో ముచ్చటించారు.
‘దర్శకుడు డివై చౌదరి, నేను మంచి స్నేహితులం. ఒక లవ్ స్టొరీ చేద్దామని భావించాం. ఒకప్పుడు పిల్లల ప్రేమకు తల్లిదండ్రులు విలన్‌గా ఉండే వాళ్ళు. ప్రేమకు వాళ్ళు అంగీకారం తెలపకపోతేనే సమస్య. అయితే కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రేమికుల మధ్య వచ్చిన గొడవలే ప్రేమకు విలన్స్‌గా మారుతున్నాయి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశాం. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరిని ఇష్టపడుతుంది. అతనే ఆ అమ్మాయికి స్ఫూర్తిని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కాలగమనంలో వేరే క్యారెక్టర్ అయిపోయాడని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ? అనేది ఈ జనరేషన్‌కి నచ్చేలా ఉంటుంది. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. సెకండ్ హాఫ్ బ్యూటీ ఏమిటంటే.. మూడు రోజుల్లో జరుగుతుంది. పెళ్లి నుంచి శోభనం మధ్యలో జరిగే లవ్ స్టొరీ రాశాం. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. అందరికీ నచ్చుతుంది. రోహిత్, అపర్ణ లాంటి నటులు దొరకడం మా అదష్టం. వేద చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతోంది. అలాగే ఒక వెబ్‌సిరిస్‌తోపాటు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కి పని చేస్తున్నాను. నటుడిగా అవకాశాలు వస్తే చేస్తాను’ అని అన్నారు.