ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ని ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా హై ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమ కథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సీన్స్, డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్కరు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో కొత్తదనం అనే పదం వాడి చాలా పాతది చేశారు. కానీ నేను గర్వంగా చెబుతున్నా. ఈ సినిమాలో ఇది వరకు చూడని సీన్లు.. చూడని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం నచ్చింది. ప్రధాన పాత్రలైన ముగ్గురు మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు పెద్ద షాక్ ఉంటుంది. ఈ షాక్ నచ్చే సినిమాను నేను సోలోగా ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యా. డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాలో ఓ పార్ట్‌నర్. ఈ సినిమాను నా స్టోరీ అని చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సినిమా నుంచి బయటకు వెళ్లేటప్పుడు నా కథ అనుకుని బరువెక్కిన గుండెతో వెళతారు. ఈ సినిమా నటుడిగా ఆనంద్‌కు ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. రానున్న రోజుల్లో సాయి రాజేష్‌తో రెండు సినిమాలు, కలర్ ఫోటో డైరెక్టర్‌తో రెండు సినిమాలు, వీఏ ఆనంద్‌తో ఒక సినిమా, శ్యామ్ సింగరారు దర్శకుడు రాహుల్‌తో మరో సినిమా చేస్తా. ట్యాక్సీవాలా సీక్వెల్ ప్లాన్ ఏం లేదు’ అని తెలిపారు.