ఇలా చేయొద్దు…

యుక్త వయసు అమ్మాయిలంటే ఎప్పుడూ ఎంతో సంతోషంగా వుంటారు. ఈ మధ్య కాలంలో ఏదో టెన్షన్‌ ఫీలవుతూ, ఆందోళనగా కనిపిస్తున్నారని మానసిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించడమేనని, దీని వల్ల తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళన చెందుతున్నారని వారు స్పష్టం చేశారు. అటువంటి వారు ఆనందం, ఉత్సాహం, బాధ.. ఏది కలిగినా దాన్ని పట్టలేరని భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోలేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.
జీవితమన్నాక మంచీ చెడూ, ఆనందం, విషాదం వంటివి సహాజమే కదా అనుకుని, వాటిని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎవరికి వారే తీవ్రంగా ఆలోచించి, భయపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. ఆందోళనతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉందని, ఆ విషయాన్ని అమ్మకో, నాన్నకో, స్నేహితురాలికో చెప్తే ఓ మంచి మార్గం దొరుకుతుందని సలహా ఇస్తున్నారు.
కొన్ని సందర్భాలలో తెలియని ఆందోళన, ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. అయితే అది సహజమేనని గుర్తించండి. అసలు ఏం కావాలీ, ఏం కోరుకుంటున్నారన్న విషయంపై స్పష్టత తెచ్చుకోండి. అవతలి వారు మీ మాటను పట్టించుకోవడం లేదనుకోవడం కంటే మీరు ఆ విషయాన్ని వాళ్లకి అర్థమయ్యేంత బాగా చెప్పలేకపోయారని అనుకోండి. మీ మాటల్ని ఎవరూ సమర్థించకపోవడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని సానుకూల దక్పథంతో ఆలోచించండి.
ఏ విషయంలోనైనా పోటీతత్వం ఉండాలి. కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రాథమిక నియమాన్ని మరిచిపోవద్దు. అవతలి వారి విజయాలను చూసినప్పుడు, వారి నుంచి ఏం నేర్చుకోవాలా అని ఆలోచించాలి. అప్పుడే ముందడుగు వేయగలుగుతారు.

Spread the love