జ్ఞాపకాల పదును

నీవు పరిచయమయిన కొత్తలో చెప్పిన
కబుర్లన్నీ నేడు పాతగిలవడ్డ గురిగి,
ముంతల పాత్రలయినయేమో వాటి విలువ
ఇప్పుడు చీప్‌…

నీతో గడిపిన ఆ క్షణాలన్ని
నేడు ఒక్కో యుగంలా గడుస్తుంటే
గుండె బండలా బరువెక్కి చెక్కలు ముక్కలయింది
మళ్ళీ కొత్తగా యిగువెట్టడం నేర్వాలి…

నువ్‌ చేసిన ఫోన్‌ కాల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్లు అన్ని
అన్నీ యిప్పుడు నాలా ఒంటరై పోయాయి
చెవుల్లో ఎయిర్‌ ఫోన్స్‌ పెట్టుకోకుండానే
లోనంతా గడెలువడ్డ శబ్దాలు నీ పేరు తప్ప
నాకేమి వినిపియ్యడం లేదు…

మనిద్దరం కల్సి తిరిగిన తోవల్లో
జారిడిసిన ”(నీ)నా” అడుగు జాడలు
కన్నీటి సంద్రంలో మునిగి తేలినయేమో
అచ్చం మా ఊరెనికి సెర్వులో
తుమళ్ళ వనం మొల్సినట్టే అనిపిస్తుంది…

నెమరేద్దామంటే
నీవిపుడు నాతోడు లేవని దెల్సి
తనువు ఆకాలేయడమే ఆపేసింది…

మరేం పర్వాలేదు నన్ను అంటిపెట్టుకొనున్న
నీ పచ్చిజ్ఞాపకాల పదునుతో
హదయాంతరంగంలో నే అస్తమించేంత వరకు
తిరిగి మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూనే ఉంటా
మిస్‌ యు బంగారం…
– తలారి సతీష్‌ కుమార్‌

Spread the love