ఆఫీస్‌కి వెళ్లడం.. రావడం. కంప్యూటర్, కుర్చీలు, గోడలు.. ఇవే నా దోస్తులు. నా తీరే అంత. ఏ బంధమూ శాశ్వతం కాదనుకునే రకం. నూతిలో కప్పలా అలా కాలాన్ని ఈదుతున్న నాకు నీవ్వు తారాసపడ్డావు. హే, రాయిలాంటి నా మనసుని మంచులా కరిగించింది కూడా నువ్వే కదా.
ఆ రోజు ఆఫీసు క్యాంటీన్లో టీ తాగుతున్నా. నా ముందు నుంచి నడుచుకుంటూ నువ్వు వెళ్తుంటే.. ఆహా ఏమి సౌందర్యం… నిన్ను చూడగానే మనసు జివ్వుమంది. మళ్లీమళ్లీ చూడమని మారాం చేసింది. ‘ఇదేనా లవ్ ఎట్ ఫస్ట్ సైటా?’ అంటే అనుకున్నా. ‘లవ్వా.. గివ్వా.. అమ్మాయి బాగుంది చూశానంతే..’ అని నాకు నేనే సర్దిచెప్పుకున్నా. నువ్వు ఎదురు పడ్డప్పుడల్లా నాకు నేను నిగ్రహ పూజారిలా మనసులోనే మంత్రాలు జపించేవాడిని. అవి నీకు వినిపించాయేమో.. ఎటు వెళ్లినా ప్రత్యక్షమవుతూ నన్ను పరీక్షించేదానివి. అలా నువ్వు కనబడినప్పుడల్లా మనసు లోలోపల డ్యాన్స్ చేస్తుంటే.. ఏంటిలా అయిపోతున్నావంటూ నాలోని నిగ్రహ రాముడు హెచ్చరించేవాడు. మనసులో ఇద్దరికీ నిత్యం యుద్ధమే.
రోజులు గడుస్తున్నకొద్దీ నా నిగ్రహం సడలింది. ఆఖరికి..’ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి’ అని పాడుకున్నాను. ఓసారి నీ ఆఫీసు ఐడీ కార్డు చూశా. పేరు తెలిశాక ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరపడ్డాను. నక్షత్రాల్లా నీ చుట్టూ ఎంతోమంది ఉన్నా నువ్వు మాత్రం చందమామలా వెలిగిపోయేదానివి. ముఖానికి కొద్దిగా పౌడరు..
మృదువైన పెదాలపై లిప్‌స్టిక్.. నుదుటిన చిన్న బొట్టుబిళ్ల.. అంతే కదా నీ మేకప్. ఈ సహజ సౌందర్యరాశి నాకు దక్కుతుందా అనే సంశయం నన్ను వేదించడం మొదలు పెట్టింది. ఫర్వాలేదు.. గట్టిగా ప్రయత్నిస్తే.. అనుకున్నది జరుగుతుందని నాకు నేనే సర్దిచెప్పుకునే వాణ్ని. అదే జరిగితే నీలి నీలి ఆకాశాన్ని దోసిళ్లలో తెచ్చి నీకు ఇవ్వాలనుకున్నా..
రోజులు నెలలవుతున్నాయి. నాకు నేను నీతో డ్యూయెట్లు పాడుకోవడం తప్ప.. నోరు విప్పి నీతో మాట్లాడింది లేదు. మరి నా తీయని బాధ నీకు చేరేదెలా? అసలు నేను నిన్ను ఫాలో అవుతున్న సంగతి తెలుసా? ఎన్నాళ్లీ వేదన? ప్రశ్నలతో బుర్ర వేడెక్కేది. అయినా ఏదో నాకు తోచినట్టుగా ప్రయత్నించేవాణ్ని.
మృదువైన నీ స్వరం వినడం కోసం పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లడం.. ఒక్కోసారి కావాలనే ఎదురు పడటం.. నీ చూపులు నన్ను చేరగానే తల చప్పున కిందికి వేలాడేసుకోవడం.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు.. ఎన్ని చెప్పినా తక్కువే.
కొన్నాళ్లయ్యాక అకస్మాత్తుగా కనిపించడం మానేశావు. నా గుండెలో గుబులు. ఆఫీసు మానేసిందా? కొంపదీసి పెండ్లి కానీ ఫిక్స్ కాలేదు కదా? ఇలా సవాలక్ష సందేహాలు. పోనీ నీ ఫ్రెండ్స్‌ను అడిగితే..? ఈ ధైర్యమే ఉంటే నీతోనే నేరుగా మాట కలిపేవాడిని కదా. ఏదేమైనా తను కనబడని రోజు ఓ యుగంలా గడిచేది. ఈ నిరీక్షణకు తెర దించుతూ.. వారమయ్యాక ప్రత్యక్షమైయ్యావు. నిన్ను చూడగానే నా మనసుకి రెక్కలొచ్చాయి. ఈసారి కచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అనుకున్నా. రెండుసార్లు ఫాలో కూడా అయ్యా. కాటుక అద్దిన ఆ కళ్ల చూపు ఓసారి నాపై పడింది. ఆ క్షణం నా గుప్పెడు గుండెకు పండగే. ‘ఏ కన్నులూ చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే’ అని లోలోపలే పాడుకున్నా.
నా మనసుని పసిగట్టినట్టు నా ప్రేమకి పచ్చజెండా ఊపుతూ పెదాలపై నవ్వులు పూయించావు. ఆ క్షణంలో కళ్లే ఎక్కువగా మాట్లాడుకున్నాయి. ప్చ్.. గమ్యం సగం చేరాననుకునేలోపే.. కంపెనీ పంపిందంటూ రెక్కలు కట్టుకొని అమెరికా వెళ్లిపోయావు. ఎన్ని ఊసులు చెప్పాలి నీతో.. ఎన్ని చోట్లకు తిప్పాలి నిన్ను.. అందుకే నీ రాకకై నా ఎదురుచూపు… త్వరగా వస్తావు కదు.
నీ… రాజేష్