జనరేషన్‌ జడ్‌

‘మేం మీ కోసం మా విధానాలను మార్చుకుంటున్నాం… ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.
నిస్సంకోచంగా మా సంస్థలో ఉద్యోగం చేయొచ్చు’ అని లింక్డ్‌ఇన్‌ లాంటి వేదికగా కంపెనీలే రాస్తున్నాయంటే తరం మారిందని అర్థం. ప్రపంచవ్యాప్తంగా జనరేషన్‌ జడ్‌ ఉద్యోగాల్లో చేరుతున్న వేళ ఇది. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లతో పాటూ పెరిగిన ఈ తరం తమ చుట్టూ కూడా హైఫైగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఇలాంటి తరానికి సంస్థలన్నీ ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నాయీ… అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ‘మేము మార్పుని స్వాగతిస్తున్నాం. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే సంస్థల్లో ముందు వరసలో ఉంటాం. మా ప్రొఫెషనల్‌ పార్ట్‌నర్స్‌కి వారంలో ఎక్కువ రోజులు హైబ్రిడ్‌, రిమోట్‌ వర్క్‌కి అవకాశం కల్పిస్తాం. కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే తప్పనిసరిగా ఆఫీసుకి వచ్చి పని చేయాల్సి ఉంటుంది. అవేమిటో ఉద్యోగావకాశాల ప్రకటనలో స్పష్టంగా చెబుతాం…’ సోషల్‌ మీడియాలో మరో కంపెనీ పోస్ట్‌ ఇది.
భారత్‌లో కుదిరే పనేనా..?
వీకెండ్‌ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్‌ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్‌ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్‌ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్‌ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించే పరిస్ధితి లేదు.
వీళ్లకేం కావాలి?
జనరేషన్‌ జడ్‌కి ఏం కావాలీ అన్నది ఇప్పుడు కంపెనీల ముందున్న పెద్ద ప్రశ్న. ఎవరికి వాళ్లు తమకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది సరిపోతుందన్న నమ్మకం కలగడం లేదు. అందుకే అధ్యయనాలు జరుపుతున్న సంస్థలన్నీ కలిసి జనరేషన్‌ జడ్‌ లక్షణాలను ఇలా ఉండోచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చాయి.
నిత్యం కొత్తదనం కావాలి. అది పనిలో కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణంలో కావచ్చు.
కంపెనీ విధానాలూ విలువలూ తెలుసుకుంటూ నచ్చతేనే ఉద్యోగం చేస్తున్నారు. లేకుంటే టాటా చెప్పేస్తున్నారు.
పర్యావరణం, సమాజం, పారదర్శక పాలన… జనరేషన్‌ జడ్‌కి ముఖ్యమైన అంశాలు. వీటిపట్ల బాధ్యతాయుతంగా ఉంటారు.
ఉద్యోగంలో చేరితే జీవితంలో సెటిలైపోయినట్లే అనుకోరు. ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యాలను పెంచుకుంటారు.
సోషల్‌మీడియాని కాలక్షేపానికి కాక, విషయాలు తెలుసుకోవడానికి వాడతారు.
రిస్క్‌ తీసుకోవడానికి భయపడరు. నలభై ఏళ్లకే రిటైరవ్వాలన్న ఆలోచనలే ఉండదు.
ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ అవర్స్‌ని ఇష్టపడతారు. నిర్ణీత సమయాల్లోనే పనిచేయాలంటే ఒత్తిడికి గురవుతారు.
వీకెండ్‌ కాపురాలకు కారణాలు
ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్‌ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్‌ అయితే మరొకరికి నైట్‌ షిఫ్ట్‌ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఈ మూల ఉంటే, మరొకరిది ఆ మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి లేదు
భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్‌పెక్టేషన్‌లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్‌ప్రైజ్‌లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది.
ఎవరికి వారు తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు.
ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని... అదీ యువతరాన్ని ఆకట్టుకోవడమూ, మరో సంస్థకి వెళ్లిపోకుండా తమ దగ్గరే అట్టి పెట్టుకోవడమూ… ఇప్పుుడు సంస్థలకి కత్తి మీద సాములా తయారైంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత ఏడాది తిరక్కుండానే మానేసి మరో ఉద్యోగం వెతుక్కుంటున్నారట. గత మూడేండ్లుగా 53 శాతానికి పెరిగిందని డెలాయిట్‌ నివేదిక చెబుతోంది. అందుకే తమ సంస్థల్లో పనితీరు గురించీ తాము అనుసరించే విలువల గురించీ, ఉద్యోగుల సౌకర్యానికి తామిచ్చే ప్రాధాన్యం గురించీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు పెడుతున్నాయి. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనంలో ఎప్పటి కప్పుడు కొత్తకొత్తగా అంకుర సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటిలోనూ పనిచేయడానికి ఉద్యోగులు కావాలి. అందుకని అవసరానికి తగినట్లుగా ఆయా సంస్థలన్నీ తమవైన విధివిధానాలను రూపొందించుకుని ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పాతికేండ్లుకు అటూఇటూగా ఉండి ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారినే ‘జనరేషన్‌ జడ్‌’ అంటున్నారు. వచ్చే ఐదారేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో మూడో వంతు వీళ్లే ఉంటారు అందులో సందేహం లేదు. దాంతో సంస్థలన్నీ అందుకు తగినట్లుగా మారడం మొదలెట్టాయి.
డిమాండ్‌ ఎక్కువ
నిజానికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని కొవిడ్‌ సమయంలో మొదలుపెట్టారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కూడా ఇది కొనసాగుతుందంటే దానికి కారణం జనరేషన్‌ జెడ్‌. మూడ్‌ని బట్టి ఆఫీసుకు వస్తారు, లేదంటే ఇంట్లోంచే పని చేస్తామంటారు. అందుకే వీరి కోసం హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ని కొనసాగిస్తున్నాయి కంపెనీలు. డిజిటల్‌ తరంలో పుట్టి పెరిగిన వీరి నైపుణ్యాలకు ఇప్పుడు విపరీతమైన డిమాండు ఉంది. అందుకే ఇలా రకరకాల ప్యాకేజీలూ వెసులుబాట్లతో వారిని ఆకర్షిస్తున్నాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌- గ్యాలప్‌ సంస్థలు సంయుక్త నివేదిక ప్రకారం భారతదేశంలో 97 శాతం కంపెనీలు డిజిటల్‌ నైపుణ్యాలు తెలిసిన సిబ్బంది తమకు తక్షణావసరం, కానీ నిపుణుల్ని ఎంచుకోలేక పోతున్నాయి. సరిగ్గా కంపెనీలకు అవసరమవుతున్న సరికొత్త ప్రతిభానైపుణ్యాలు కొరవడిన సమయంలో ఈ కొత్త తరం ఉద్యోగ రంగంలోకి ప్రవేశించడం కార్పొరేట్‌ కంపెనీలకు గొప్ప ఊరట.
ముందు యుగం దూతలు
ఒకప్పుడు పాతిక ముప్పై ఏండ్లును ఒక తరంగా చెప్పేవారు. కానీ, ఇప్పుడు పదేండ్లకే తరాల మధ్య అంతరం కనిపిస్తోంది.
బేబీ బూమర్స్‌ : 1946-64 మధ్య పుట్టిన వారిని ‘బేబీ బూమర్స్‌’ అంటారు.ప్రపంచవ్యాప్తంగా పలురంగాల్లో చెప్పుకోదగ్గ మార్పులకు లోనై, కష్టపడి పైకి వచ్చిన తరం ఇది.
జనరేషన్‌ ఎక్స్‌ : 1965- 84 మధ్య పుట్టినవారంతా జనరేషన్‌ ఎక్స్‌ తరానికి చెందినవారు. ఈ కాలంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యం గల ఎన్నో ఘటనల్ని చూశారు. విశాల దృక్పథం, వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వడం ఈ తరం ప్రత్యేకత.
జనరేషన్‌ వై : 1985-95 మధ్య పుట్టినవారిని ‘జనరేషన్‌ వై’ అనీ ‘మిలెనియల్స్‌’ అనీ అంటారు. సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరంలో పుట్టడంతో సహజంగానే వీరిది ‘టెక్‌ శావీ’ తరం అయింది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం ఉద్యోగుల వ్యక్తిత్వాల్నీ విలువల్నీ నిశితంగా అధ్యయనం చేయడం మొదలెట్టింది కూడా ఈ తరమే.
జనరేషన్‌ జడ్‌ : 1996- 2010 మధ్య పుట్టిన పోస్ట్‌ మిలెనియల్స్‌నే ‘జనరేషన్‌ జడ్‌’ అంటున్నారు. ఉద్యోగ చరిత్రలో అత్యధిక విద్యావంతులున్న తరం ఇదే. మరో నాలుగైదేండ్లల్లో ప్రతి కార్యాలయంలోనూ మూడోవంతు వీళ్లతోనే నిండిపోతుందని అంచనా. ఇంటర్నెట్‌ గ్యాడ్జెట్లూ లేకుండా క్షణం గడవని వీరిని డిజిటల్‌ జనరేషన్‌ అంటున్నారు. ఒకేసారి ఐదు స్క్రీన్ల మీద పని చేయగల సమర్థులు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండువందల యాభై కోట్ల మంది ఈ తరానికి చెందినవారే ఉంటే, అందులో 35 కోట్లు మన దేశంలోనే ఉన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పెను మార్పులకు కారణమయ్యే సత్తా జనరేషన్‌ జడ్‌కి ఉందనీ రేపటి ప్రపంచ నిర్మాతలు వీరేననీ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక చెబుతోంది. అంటే శ్రీశ్రీ చెప్పిన ముందు యుగం దూతలు లాంటి వారు వీరు.
వీకెండ్‌ మ్యారేజెస్‌ అంటే..?
పెండ్లి అంటే రెండు జీవితాల కలయిక. నూరేండ్ల సావాసం. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది. ఇది ఇన్నేండ్లుగా మనకు పెండ్లికి తెలిసిన అర్థాలు. కానీ…ఈ జనరేషన్‌ జెడ్‌ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్‌ మ్యారేజెస్‌ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి… ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు.
– ఎంకె

Spread the love