బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ అరెస్ట్‌..

నవతెలంగాణ – ముంబయి: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ (Sahil Khan)ను ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సైబర్‌ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)’ ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. సాహిల్‌కు సిట్‌ 2023 డిసెంబరులోనే సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో (Mahadev Betting App Case) ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం యాప్‌నకు బ్రాండ్‌ ప్రమోటర్‌గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెబుతున్నారు.

Spread the love