పరిమితికి మించితే…

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలని కాబోయే అమ్మలు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. నెలతప్పిన నాటి నుంచి ప్రసవమై పాపాయి చేతుల్లోకి వచ్చేవరకు ప్రతి క్షణం కడుపులోని బిడ్డ కోసమే పరితపిస్తారు. బిడ్డ ఆరోగ్యానికి కావాల్సిన ఆహారం తీసుకుంటూ.. డాక్టర్లు చెప్పిన మందులన్నీ క్రమం తప్పకుండా వేసుకుంటారు. అయితే కొందరు పరిమితికి మించి తీసుకునే మందుల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్‌ ఎ
గర్భిణులు విటమిన్‌ ఎ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే పుట్టే పిల్లలకు ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి శిశువుల్లో క్యాన్సర్‌ కారకాలు చేరే ప్రమాదం కూడా ఉంది. విటమిన్‌ ఎ సప్లిమెంట్స్‌ ఎక్కువగా తీసుకునే గర్భిణిలకు పుట్టే శిశువులకు పుట్టుకతోనే శారీరకలోపాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్‌ ను పరిమితికి మించి తీసుకుంటే చిన్నారుల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
విటమిన్‌ ఇ
కొంతమంది మహిళలు చర్మ సౌందర్యం కోసం ‘విటమిన్‌ ఇ’ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా విటమిన ఇ తీసుకునే వాళ్లకి ‘ఆల్కాజ్‌ మొటాలిటీ’… అంటే ఏ ఆరోగ్య సమస్యతోనైనా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు కారణం విటమిన్‌ ఇ సప్లిమెంట్లను వాడటం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. రోజుకి 30 మైక్రో యూనిట్ల విటమిన్‌ ఇ మాత్రమే అవసరం. ఇంతకు మించితే శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. అయితే గర్భిణులు వీటిని వేసుకోకపోవడమే అన్ని విధాల మంచిది. అయితే తప్పనిసరై విటమిన్‌ ఇ తీసుకోవల్సి వస్తే టాబ్లెట్‌గా కాకుండా నేరుగా చర్మంపై అప్లై చేసే వాటిని వాడటం మంచిది. దీని వల్ల శరీరంలో టాక్సిసిటీకి అవకాశం ఉండదు పైగా మంచి ఫలితం కూడా ఉంటుంది.
కాల్షియం, విటమిన్‌ డి
మనకు రోజు మొత్తానికి సరిపడా ‘విటమిన్‌ డి’తో కలిసిన క్యాల్షియం పరిమాణం 600 నుంచి 800 మైక్రో యూనిట్లు. గర్భిణులు కూడా క్యాల్షియంను ఇదే పరిమాణంలో తీసుకోవాలి. శరీరానికి కావల్సిన క్యాల్షియం ఆహారం ద్వారా తీసుకోగలిగితే అదనంగా సప్లిమెంట్ల అవసరం ఉండదు. కాల్షియం, విటమిన్‌ డి ఎక్కువగా తీసుకుంటే ‘హైపోకాల్సీమియా’ సమస్య ఉత్పన్నం అవుతుంది. అంటే శరీరంలో కాల్షియం నిల్వలు పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు.
బి కాంప్లెక్స్‌
బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటినీ మల్టీ విటమిన్‌గా చాలా వరకు తీసుకుంటారు. శరీరానికి అవసరమైన దాంట్లో కేవలం యాభై శాతం మాత్రమే సప్లిమెంట్స్‌గా మిగతా యాభై శాతం ఆహారం ద్వారా తీసుకుంటే మంచిది. అయితే గర్భిణులు బీ కాంప్లెక్స్‌ సప్లిమెంట్స్‌ ఎంత మేరకు వాడాలి అన్నది డాక్టర్‌ సూచన ప్రకారమే వేసుకోవాలి. విటమిన్లు ఆరోగ్యానికి మంచివే అయితే పరిమితి మించితే పాపాయి ఆరోగ్యానికి ముప్పు తేస్తాయి. కాబట్టి డాక్టర్‌ సలహా లేనిదే ఏ మాత్రలు వాడవద్దు.
వ్యాయామం తప్పనిసరి
నెల తప్పగానే చాలామంది బెడ్‌ రెస్ట్‌ అంటూ పూర్తిగా రెస్ట్‌ తీసుకుంటారు. ఇది సరి కాదు. కాబోయే అమ్మల శారీరక వ్యాయామం, మానసిక ఆనందం కడుపులోని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికపాటి పనులు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాజిటివ్‌ గా ఆలోచించడం వల్ల పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుంది.

Spread the love