జావలతో ఆరోగ్యంగా…

జూన్‌ వచ్చినా భానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. ఎండల తాపానికి శరీరం త్వరగా నీరసించిపోతోంది. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లో పండ్లతో చేసుకునే జ్యూస్‌లు, బయట దొరికే జ్యూస్‌లతో పాటు కాస్త వెరైటీగా హెల్దీగా జావలు కూడా చేసుకోవచ్చు. వీటి వల్ల శరీర తాపం తగ్గుతుంది. శరీరానికి అందవలసిన పోషకాలు కూడా అందుతాయి. తద్వారా ఆరోగ్యమూ చేకూరుతుంది. అవేంటో తెలుసు కుందామా…!
బియ్యం, గోధుమలతో పోలిస్తే తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్‌ ఉంటుంది. ప్రోటీన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. షుగర్‌ పేషంట్‌లకు మంచి ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడే ఆహారం.

జొన్న అంబలి
కావాల్సిన పదార్థాలు : జొన్నలు – ముప్పావు కప్పు, శెనగ పప్పు- పావు కప్పు, నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి – ఒక స్పూన్‌ (తరిగిన ముక్కలు), ఉల్లిగడ్డ – 1 (సన్నగా తరిగిన ముక్కలు), క్యారెట్‌ ముక్కలు – పావు కప్పు, బఠానీ – పావు కప్పు, మిరియాల పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం : జొన్న రవ్వ, శెనగ పప్పును బాగా కడిగి మూడు కప్పుల నీళ్ళు పోసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఐదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. వేరే కడాయిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె లేదా నెయ్యి వేసి, అందులో తరిగిన వెల్లుల్లి వేసి సన్న మంట మీద కొంచెం వేగనివ్వాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇందులోనే క్యారెట్‌ ముక్కలు, ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించిన బఠానీ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే మిరియాల పొడి, కొత్తిమీరను కూడా వేసి ఒక నిమిషం కలపాలి. ఈలోపు కుక్కర్‌లో ఉడికించిన జొన్న రవ్వ, శెనగపప్పు మిశ్రమంలో ఒకటి లేదా రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపాలి. తగినంత ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంతే రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే జొన్న అంబలి లేదా జొన్న జావ రెడీ.
జీవ క్రియను వేగవంతం చేస్తాయి. శరీరానికి చల్లదానాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. బీటా గ్లూకాన్‌ విసర్జన క్రియను సక్రమంగా ఉంచుతుది. ఫలితంగా కడుపులో మందం ఏర్పడదు.శరీరంలో కొవ్వు ఏర్పడదు.
బార్లీ జావ
కావాల్సిన పదార్థాలు : బార్లీ గింజలు : మూడు టేబుల్‌ స్పూన్‌లు (పొడిగా చేసు కోవాలి), పెరుగు – ఒక కప్పు, జీలకర్ర పొడి – ఒక టేబుల్‌ స్పూన్‌, పెరుగు – ఒక కప్పు
తయారు చేసే విధానం : బార్లీ గింజలను మిక్సిజార్‌లోకి తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్‌ చేసు కోవాలి. ఒక లీటరు నీటిని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్‌మీద పెట్టి బాగా మరిగించాలి. బార్లీ గింజల పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉండలు లేకుండా కొంచెం నీటిని పోసి కలుపుకోవాలి. నీరు వేడయ్యాక బార్లీ మిశ్ర మాన్ని అందులో మెల్లగా వేస్తూ కలుపుకోవాలి. అడుగు అంటకుండా 20 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. పెరు గును పల్చటి మజ్జిగలా చేసు కోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపు కోవాలి. ఉడికించుకున్న బార్లీ మిశ్రమం లోకి ఈ మజ్జిగ ను తీసు కుని బాగా కలిపి సర్వింగ్‌ గ్లాస్‌లో పోసుకుని సర్వ్‌ చేసుకోవాలి.
ఇందులో కార్బోహైడ్రేట్‌లు రోజంతా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. మలబద్దకం, అజీర్తి , కడుపుబ్బరం సమస్యలకు మంచి పరిష్కారం. కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ కె వంటివి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. హై బీపీని తగ్గిస్తుంది. బరువు పెరగాలనుకునే వారికి సగ్గుబియ్యం మంచి ఆహారం.
సగ్గు బియ్యం జావ
కావాల్సిన పదార్థాలు : సగ్గుబియ్యం – ఒక కప్పు, పటిక బెల్లం : అర టేబుల్‌స్పూన్‌, ఉప్పు – చిటికెడు
తయారు చేసే విధానం : సగ్గుబియ్యాన్ని కనీసం నాలుగు గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో నానిన సగ్గుబియ్యాన్ని కొంచెం నీటిని వేసి పదిహేను నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో పటిక బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసి దించి గ్లాసుల్లో పోసి సర్వ్‌ చేసుకుంటే సరి.
బలవర్థకమైన ఆహారం. ఇందులోని కాల్షియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎముక పుష్టికి అద్భుతమైన ఆహారం. ఇందులో అయోడిన్‌ పుష్కలంగా ఉంటుంది. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
రాగి జావ
కావాల్సిన పదార్థాలు : రాగులు – ఒక కప్పు, పాలు – ఒక కప్పు, పంచదార – తగినంత, ఉప్పు – చిటికెడు
తయారుచేసే విధానం :
రాగులను ఒక రోజంతా నానబెట్టాలి. ఉదయం వాటిని ఒక బట్టలో వేసి మూటగట్టి పెట్టాలి. నీళ్లు వడిసిపోయాక నాలుగు గంటల పాటు ఎండబెట్టాలి. రాగులను కడాయిలో పోసి దోరగా వేయించాలి. వీటిని పిండి పట్టాలి. తర్వాత పిండిని కొద్దిగా నీళ్లుపోసి ఉండలు కట్టకుండా కలుపు కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. నీళ్లు వేడెక్కాక నీళ్లతో తడిపిన రాగుల మిశ్రమాన్ని ఇందులో పోస్తూ కలుపుతూ ఉడికిం చాలి. కొద్దిగా ఉడికాక పాలు, పంచదార. ఉప్పు వేసి బాగా కలపాలి. వేడి.. వేడి.. రాగి జావ రెడీ.

Spread the love