ఇక్క‌డ బీజేపీ, బీజేడీలు పెండ్లి చేసుకున్నాయి : రాహుల్ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిషాలో బీజేడీ, బీజేపీలు కుమ్మ‌క్క‌య్యాయ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర‌పారాలో ఆదివారం జ‌రిగిన బ‌హిరంగ స‌భలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, బీజేడీ ల‌క్ష్యంగా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక్క‌డ బీజేపీ, బీజేడీలు పెండ్లి చేసుకున్నాయ‌ని ప్ర‌జ‌ల‌ను లూటీ చేయ‌డంలో ఇరు పార్టీలు ఒక్క‌ట‌య్యాయ‌ని ఆరోపించారు. ఢిల్లీ అంకుల్, న‌వీన్ బాబు ఒప్పందం చేసుకున్నార‌ని అదానీకి రాష్ట్రాన్ని క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు. వీరంతా క‌లిసి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పాన్ అందించార‌ని చెప్పారు. పాన్ అంటే పాండియ‌న్‌, అమిత్ షా, న‌రేంద్ర మోదీ, న‌వీన్ ప‌ట్నాయ‌క్ అని రాహుల్ వివ‌రించారు. వీరంతా మీ మొత్తం సంప‌ద‌ను మూకుమ్మ‌డిగా చోరీ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు ఒడిషాలో కాంగ్రెస్ స‌ర్కార్ కొలువుతీరే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. మోదీ దేశంలో అత్యంత సంప‌న్నులైన 22 మంది కోసం ప‌నిచేస్తుంటే అదే త‌ర‌హాలో కొద్ది మంది మేలు కోసం సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక్క‌డ మైనింగ్ స్కామ్ జ‌రిగింద‌ని, రైతుల భూములు లాక్కుంటున్నార‌ని కేంద్రంలో త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే ఈ పార్టీలు లూటీ చేసిన మీ సొమ్మును తిరిగి మీకు అందిస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు.

Spread the love