మళ్ళీరావా..!!

ప్రియమైన నా బంగారానికి,
ఓయ్ ఎట్లున్నవ్‌.. ? నువ్వు మంచిగానే ఉన్నావ్‌ అని అనుకుంటున్నా, మన మీద ఏ కన్ను పడ్డదో గానీ నా కంటిపాపైన నువ్వు నాకు దూరమైనవ్‌.
మన మధ్య అడ్డు గోడలొచ్చి ఐదేండ్లు ఐతుంది. చివరిగా నిన్ను చూసిన ఆ క్షణం.. ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మనం కలిసున్న రోజులు ఇంకా నా కండ్ల ముందే కదులుతున్నై. నీ తీపి మాటలు ఇంకా వినబడుతూనే ఉన్నరు.
నీ నుంచి ఎంత దూరం పరిగెత్తినా, నా మనసుల్నే ఉన్న నీ జ్ఞాపకాలు నిన్ను ఏడ మరువనిస్తై. మొదటి సారి నిన్ను చూసినప్పుడే అనిపించింది.. నువ్వు నా కోసమే పుట్టావని. ఆ రోజే అనుకున్నాను నువ్వు నాకే సొంతం అని. నీతో ఒక కుటుంబాన్ని ఊహించుకున్నాను.. కానీ నా కలలు అన్ని ఇలా కళ్ళ జారుతాయి అనుకోలేదు.
బోనాల పండుగకి చీరలో నా కండ్ల ముందు నుంచి వెళ్తున్న పుడు చిరునవ్వుని నీపై విసిరుతుంటే ఏడ అందరికి మన గురించి ఎరుకైతదోనని ఎంత బయపడ్డవ్‌. కండ్లతోనే వద్దంటూ సైగ చేస్తూ.. నీ కండ్లు అలా తిప్పుతుంటే ఒక్కసారే కాలం ఆగినట్టు అనిపించింది. నీ చేతి గాజుల గలగలలో, కాళ్ళ పట్టీల సవ్వడితో నా గుండె చప్పుడు కూడా రాగం కలిపింది. నువ్వు వెళ్తుంటే నీ చీరకొంగు నాకు ముడేసినట్టు.. నీ అడుగుల్లో అడుగేస్తూ వెంట నడిచాను యాదికుందా..??
నీ మీద రాసిన మొదటి కవిత గుర్తుందా!!
”ఓ నా బంగారు కొండ
నువ్వే నా గుండె నిండా
వేస్త నీ మెడలో పూల దండ”
అది విని రోజు అంతా నవ్వుతూనే ఉన్నావ్‌.
చిన్న చిన్న వాటికే అలిగే దానివి. మళ్ళీ మాటల్లో నెయ్యి కలిపి గోరుముద్దలుగా నోటికి అందిస్తే గానీ అన్నం తినకుండా మారాం చేసేదానివి. ఇప్పుడు ఎవర్ని అలా గారాబం చెయ్యాలి ? పొద్దున్నే మొదటి మెసేజ్‌ – రాత్రికి చివరి మెసేజ్‌ నీకే పంపెటోడ్ని. ఇప్పుడు ఎవర్ని పొద్దున్నే కోడికూతై నిద్ర లేపాలి. ఎవర్ని లాలిపాటై నిద్రపుచ్చాలి..??
చంటి పిల్లలాంటి నీ మనసు అమాయకమైన నీ వ్యక్తిత్వం నన్ను నీకు ఇంకా దగ్గర చేశాయి. మన బంధాన్ని దేవుడు అల్లాడు అనుకున్నాను. కానీ ఇలా మధ్యల్నే విడదీస్తాడు అనుకోలేదు. కోపం ఉంటే చెప్పేదుండె.. తప్పు చేస్తే తిట్టేదుండె.. కానీ నన్ను ఇట్లా బాధ పెటోచ్చునా.. ఐనా ఒక్క మాటైనా చెప్పకుండా నన్ను ఒదిలేసి ఎట్ల పోయినవ్‌..?? నా చేయి చీకట్లనే ఒదిలేసి ఎందుకు పోయినవ్‌..?? నువ్వు వెళ్లి పోయినంక కన్నీళ్ళతో నా మనసంతా తడిసి ముద్దైంది. నీ ఆలోచనలు నాపై మెరుపుదాడి చేసినరు. జ్ఞాపకాలు పిడుగులై గుండెను ముక్కలు చేశాయి తెలుసా.. ఏ అమ్మాయి గొంతుల ”ఓరు” అన్న మాట ఇన్నా నువ్వేనేమోనని ఆశతో వెనక్కి తిరిగి చూస్తున్నా .. కానీ నువ్వు కాదని తెలిసి నిరాశతోనే ముందడుగేస్తున్న.. ఏందో నువ్వు ఎల్లిపోయినప్పటి నుంచి నిరాశపడడం ఈ జీవితానికి అలవాటైపోయింది.
నన్ను రోజు తలుచుకుంటూనే ఉంటావు అనుకుంటా. అందుకే ఎప్పుడూ నా గుండె పొలమారుతూనే ఉంటుంది. నీ ప్రేమకి నేను ఎప్పుడో దొరికిన కదా మళ్ళీ ఈ దోబుచులాటలు ఎందుకు.. ?? పగలంతా నేను నిన్ను వెతుకుతున్నా.. కనిపించక పోయేసరికి రాత్రయితే చాలు.. నా నీడ నన్నొదిలి నీ జాడ కోసం వెళ్ళిపోతుంది. మొన్న ఓ పావురం గులాబీ రంగు కాళ్ళకు పూసుకొని నా దారికి అడ్డం తిరిగింది బహుశా ప్రేమ పావురం అనుకుంటా.. నువ్వు పంపిన సందేశం మోసుకొచ్చిందేమో అనుకున్న కానీ చూస్తుండగానే ఏం చెప్పకుండానే తిరిగి ఆకాశానికి ఎగిరిపోయింది.
”మళ్ళీరావా…”
నీ చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు నడవాలని ఉంది.. నీ మెడలో నల్ల పూసను అవ్వాలనుంది.. నీ నుదుట సింధూరం దిద్దాలని ఉంది.. నువ్వు తిరిగొచ్చే దాకా నీ కోసం తపించే నా మనసు ఎదురు చూస్తూనే ఉంటది..
ఆకాశ వీధిలో అందాల జాబిల్లి నువ్వు
జాబిల్లి కోసం ఎదురుచూసే ఆకాశం నేను.
కన్నీటి అలలతో
నీ..
ఆకాష్‌ మునిగాల

Spread the love