ప్రాణాలు కాపాడే రక్తదానం

‘అమ్మో రక్తదానం చేయాలా? నీరసపడిపోమూ’, ‘ఇంకే సహాయమైనా చేస్తా కానీ రక్తం మాత్రం ఇవ్వలేను’… ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటూ వుంటాం. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు, యాక్సిడెంట్‌ అయినవారికి చికిత్స చేసేటప్పుడు సంబంధిత వ్యక్తులకు రక్తం ఎక్కించాల్సి వస్తుంది. అలాంటప్పుడే రక్త దాతల అవసరం ఏర్పడుతుంది. రక్తదానం మీద చాలా అపోహలున్నాయి. ఒకసారి రక్తమిస్తే ఇక తిరిగి ఆ రక్తం రాదని అనుకుంటారు. అయితే అది నిజం కాదు.
రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం వచ్చి, మరింత ఉత్సాహంగా వుంటారు. అంతేకాదు, మరొకరికి రక్తమివ్వడం వల్ల వారి ప్రాణాలు కూడా కాపాడినవారం అవుతాం. మనమిచ్చిన రక్తం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడగలిగినవారం అయ్యాం’ అన్న మాట తలచుకోడానికి ఎంత ఆనందంగా, తృప్తిగా వుంటుందో కదా!
రక్త దానం చేయడం వల్ల మీరు మరొకరి జీవితాన్ని రక్షించడమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రక్త దానం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటారని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కులం, మతం, పేద, ధనిక లాంటివి లేనిది… ఒకే రంగులో వుండి మనుషులంతా ఒకటేనని చెప్పేది రక్తం ఒక్కటే. అది వేరొకరికి జీవితాన్నిస్తుంది. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. ఎందుకంటే సాటి మనిషి ప్రాణాలు కాపాడుతుంది. రక్తం లోని ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా, రక్తం… ఇలా ఒక వ్యక్తి రక్తదానం చేస్తే అది ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది.
సాధారణంగా పెళ్లిళ్ల సమయంలో కుల గోత్రాలు, వంశాలు, పుట్టుపూర్వోత్తరాలు… ఇలా అనేకం చూస్తారు. కానీ అత్యవసర పరిస్థితిలో రక్తం కావలసి వచ్చినప్పుడు అవేమీ గుర్తుకు రావు. ఆ సమయంలో రక్త దాత దేవుడిలా కనిపిస్తాడు. జాతీయ సమైక్యతకు, మత సామరస్యకు రక్తదానం ఒక్కటే నిదర్శనం.
మనిషికి ఏ కారణవల్లనైనా శరీరంలో రక్తం తగ్గినప్పుడు, దాన్ని తిరిగి భర్తీ చేయకపోతే, ఆ మనిషి అపస్మాకరక స్థితిలోకి వెళ్తాడు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగొచ్చు. మనిషి రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం 40 కంటే తక్కువ వుంటే శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరిగా అందదు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. తలసేమియా వ్యాధి వున్నవారికి రక్తం చాలా అవసరమౌతుంది. ఏవైనా ఆపరేషన్లకి, మహిళలకు గర్భాశయ వ్యాధులున్నా, కాన్పు సమయంలో కూడా కొందరికి రక్తం ఎక్కించాల్సి వస్తుంది.
‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడి వుంది. వైద్యుడు మాత్రమే ప్రాణాలను కాపాడగలడు అని అనుకుంటారు. కానీ రక్తదానం చేయడం వల్ల కూడా మరొకరి ప్రాణాలు కాపాడొచ్చు. రక్తదానం చేయడం ఒక గొప్ప విషయం. కొంతమందికి రక్తదానం చేయాలకున్నా వారికి రక్తంలో సరిపడినంత హిమోగ్లోబిన్‌ శాతం లేక రక్తదానం చేయలేకపోతారు. మనదేశంలో రక్తదాతకి మంచి ఆరోగ్యంతో బాటు ఎత్తుకు తగ్గ బరువు అంటే 55 కిలోల పైన బరువుండాలి. అప్పుడే వారు రక్తం దానం చేయడానికి అర్హులు. రక్త దాతలకు వంశపారంపర్య అనారోగ్యం వున్నా రక్తదానాన్ని చేయలేరు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు వున్న ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. శాస్త్రవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా రక్తదానంపై ఎన్నో అపోహలున్నాయి. ఎక్కువ రక్తం తీసుకుంటారని, బలహీనపడిపోతారని! ఒక రక్త దాత నుండి కేవలం 350 మి.లీ రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. తీసిన రక్తం మూడు నెలల్లో తిరిగి తయారవుతుంది. ఏడాదికి మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పన్నమై ఆరోగ్యంగా వుంటారని వైద్యులు చెప్తున్నారు. భారతదేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. కోవిడ్‌ సమయంలో రక్తం నిల్వ చాలా తగ్గిపోయిందని ఓ నివేదిక. రక్తదాతల్లో ఎక్కువమంది యువత… అది కూడా స్టూడెంట్స్‌ ఎక్కువమంది వుండడం విశేషం. అంతెందుకు…. మొన్నీమధ్యనే ఒడిస్సాలో ట్రైన్‌ యాక్సిడెంట్‌ జరిగినప్పుడు సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో వారి ప్రాణాలు కాపాడడానికి ఎంతోమంది రక్తదానమివ్వడానికి క్యూ కట్టారు.
1901 వ సంవత్సరం డా|| కార్ల్‌ ల్యాండ్‌ స్టెయినర్‌ అనే ఆస్ట్రియా శాస్త్రవేత్త రక్తంలో ఎ, బి, ఒ అనే గ్రూపులు వున్నాయని కనుగొన్నాడు. అప్పటి వరకు అందరి రక్తం ఒక్కటే అని అనుకునేవారు. ఈ ఆవిష్కరణ వల్లే కార్ల్‌ ల్యాండ్‌స్టీనర్‌కు 1930లో నోబెల్‌ బహుమతి వచ్చింది. ఆయనే 1939లో రక్తంలో ఆర్‌ హెచ్‌ ఫాక్టర్‌ కనుగొన్నాడు. రక్తంలో గ్రూపులు కనుగొన్న తర్వాత, ఏ గ్రూపు వారికి అదే గ్రూపు రక్తం ఎక్కించడం ద్వారా రక్తం ఎక్కించడంలో వున్న ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. రక్తంలోని గ్రూపులను కనుగొని ఇలాంటి ప్రమాదాలు నివారించడంలో సహాయపడినందుకు కార్ల్‌ ల్యాండ్‌ స్టెయినర్‌ పుట్టిన రోజైన జూన్‌ 14 ను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004 లో ప్రకటించింది. తర్వాతి సంవత్సరం అంటే 2005 లో జరిగిన 58వ గ్లోబ్‌ హెల్త్‌ అసెంబ్లీలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, దాని 192 సభ్య దేశాలు కలిసి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రక్తదాతల ఆవశ్యకతను గుర్తించింది. దాని ఫలితమే రక్తదాలకు కృతజ్ఞతలు తెలిపే లక్ష్యంతో రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఈ రక్తదాతల దినోత్సవం ముఖ్య ఉద్దేశం…. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల అవశ్యకత గురించి అవగాహన కల్పించడం. ఈ సంవత్సరపు స్లోగన్‌…. ‘రక్తాన్ని, ప్లాస్మాని దానం చేయండి. ప్రాణాల్ని కాపాడండి. అప్పుడప్పుడు రక్తదానం చేయండి’.
రక్తదానం చేసేవారు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రక్తం ఇవ్వాలనుకున్న వారు గడచిన మూడు నెలల్లో స్టెరాయిడ్లను ఉపయోగించకూడదు. పుట్టుకతో వచ్చే గడ్డకట్టే లోపం ఉన్న వ్యక్తులు, హెచ్‌.ఐ.వి, పోస్‌ట వైరల్‌ హెపటైటిస్‌ ఉన్న వ్యక్తులు రక్త దానం చేయకూడదు. రక్తదానం చేసే ముందు తగినంత నీరు గానీ, ఆల్కహాల్‌ లేని ఇతర పానీయాలు గానీ తాగాలి. ఆరోగ్యకరమైన భోజనం తినాలి. డీ హైడ్రేట్‌ అవకుండా జాగ్రత్త తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ తినకూడదు. రక్తదానం చేసేటప్పుడు విశ్రాంతిగా ఉండాలి.
– బి.మల్లేశ్వరి

Spread the love