కవిత మనిషిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. కదలని అడుగుల్లోకి దూరి ఒక ఆశయ సాధన వైపుగా ప్రయాణం చేయిస్తుంది. కవిత్వం చేయలేని, చేయించలేని పనిలేదు. కవిత్వమొక దారిదీపం.
పై వాక్యాలన్ని కాంచనపల్లి గోవర్ధన్ రాజు రాసిన ‘జీవించు’ అనే కవిత వల్ల నాలో కలిగిన భావనలు. ఈ కవితను వారం కిందట సాహితీ గవాక్షంలో చదివాను. నన్ను కాసేపు ఆలోచనల్లోకి నెట్టేసింది.
ఈ కవిత గురించి మాట్లాడే ముందు కవిత్వానికి చైతన్యానికి ఏమన్నా సంబంధముందా అని అనుకుంటే ఖచ్చితంగా ఉందనే సమాధానమే వస్తుంది. ఎవ్వరూ చేయలేని పని ఒక పాట చేస్తున్నప్పుడు ఒక వాక్యం కూడా చేయగల సత్తా కలిగినదే కదా. ఒక్కో కవి ఒక్కో పంథాలో నడుస్తుంటాడు. ఈ కవితలో కవి మార్గం చైతన్యం వైపుగా సాగింది. ప్రత్యక్ష కార్యచరణ లేకున్న వాక్యం చేసేపని అంతసులువయినదేమీ కాదు. విడదీయరాని అనుబంధం రెండింటిది.
‘జీవించు’ అనే శీర్షిక పాజిటివ్ దక్పథాన్ని చూపెడుతుంది. ఈ మధ్య చాలా మంది చిన్నా చితక విషయాల కోసం ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. మార్కులు ఎక్కువగా రాలేదనో, ఉద్యోగం రాలేదనో ఇంకా ఎన్నో కారణాలు వారిని బలితీసుకుంటున్నాయి. కవి పెట్టిన శీర్షిక ఆత్మస్థైర్యం కోల్పోయిన వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపేది. శీర్షిక ఉద్దేశం ఈ కవిత పరంగా వేరయి ఉండొచ్చు. శీర్షిక చదవగానే ఎన్ని కష్టాలొచ్చినా బతుకురా అని చెప్పినట్టుగానే ఉంది.
జీవితం కావచ్చు. హక్కుల సాధన కోసం చేసే ఉద్యమం కావచ్చు. వ్యవస్థ పైన ఆగ్రహ ప్రకటన కావచ్చు. ఏదైనా కవి ‘జీవించి సాధించమని’ మేలు పలుకుతున్నాడు. ఎత్తుగడలోనే చీకటి ఖండం అనే పదబంధాన్ని అంధకారంలో మగ్గిపోతున్న నేటి సమాజానికి ప్రతీకగా చెప్పి, జీవన వాస్తవికతను తెలియజేశాడు. నేటి పౌరుల కలలు విరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్ని కష్టాలొచ్చినా ‘చందమామ’లాగా నిండుగా వెలగాలని ప్రేరణ కలిగించాడు.
మొదటి యూనిట్‌లో చైతన్యపూరిత వాక్యాలను నిర్మిస్తూ ‘ప్రేమలోపల కూరుకుపోయి విషాదాన్ని మోస్తున్న వ్యక్తి స్థితిని, జిగేల్ మంటూ వెలుగుతున్న చుక్కలు రాలిపోతూ కూడా మెరుస్తున్నా’యన్న అవకాశాల ఆశావాహదక్పథాన్ని తెలియపరిచాడు.
కవి చివరి యూనిట్‌లో మాట్లాడిన ‘బహుజన ఎజెండా’ తత్వాన్ని మొదటి యూనిట్‌లో చెప్పేటప్పుడు ఇంకా నెరవేరని సామ్యవాద సౌభ్రాతత్వ కలల కోసం నిరసనను తెలిపే సమూహాన్ని గుర్తు చేయడానికి ‘తాజ్ మహల్’ విషయాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ వేచియుండడం అనే అర్థంలో ప్రేమ సంబంధిత ఉదాహరణను తీసుకొని తీవ్రతను వ్యక్తపరిచాడు. ఈ వాక్యాల కూర్పు కొంత ఆశ్చర్యానికి తావిస్తుంది.
తదుపరి రెండు లైన్లలో ‘రాలిపోతున్న చుక్క కనులలో’ బతుకును వెతుక్కోవటం అంటూ ఆశను కోల్పోకుండా సహనంతో అడుగేయాల్సిన అవసరాన్ని కాస్త సున్నితంగా చెప్పాడు.
నాల్గవ యూనిట్ లో కవి రాసిన వాక్యాలు ఈ కవిత బలం.
‘యుద్ధోన్మాది వ్యూహం చక్రాల కింద నలిగే సామాన్యుల కంఠంలో రెక్కవిప్పిన పావురమై జీవించు’ అంటూ ఇందులో స్వేచ్ఛను కోరుకుంటున్న ఉద్యమకారున్ని పరిచయం చేస్తాడు. శ్రామికులనంతా ఒకే తాటిపైకి తీసుకొస్తూ ‘సామ్యవాద విత్తనంలో ఆకుపచ్చగా జీవించు’ అనటం భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్న ఆకాంక్షను తెలియపరుస్తాడు. చివరి యూనిట్‌లో ధిక్కార గొంతుకతో పాటు మనం మనలా జీవించాలంటే స్వేచ్ఛా పావురాలమయి ఎగురుతూ కొత్త నిర్వచనాన్ని లిఖించాలన్న బహుజన దక్పథ దష్టిని స్పష్టంగా కనబరుస్తాడు.
ఈ కవితలో కవి వాడిన టూల్స్ కొంత పాతవే అయినా ఈ సందర్భానికి అవి సరిగ్గా సరిపోయేవే. శిల్పం విషయంలో కవి కవితను నడిపించినట్టుగా కాకుండా కవితే కవిని నడిపించిందా అన్నంత తేలికగా సాగింది. కవిత గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే శ్రద్ధగా ఒక్కో వాక్యాన్ని కూర్చి అల్లిన అనుభవాల మాల అని కితాబివ్వొచ్చు.
జీవించు
విస్తరించిన చీకటి ఖండం మీద విరిగిపోయిన రేపటి కలల మీద
నువ్వొక చందమామగా జీవించు నువ్వొక తెల్లారి తాకే
చిరుగాలిలా జీవించు
భగ ప్రేమ విలాపాన్ని నీలో ఒంపుకొని ఒక తాజ్ మహలై
అర్ధరాత్రి రాలిపోతున్న చుక్క కనులలో
ఇంకా మెరిసే బతుకు ఆకాశానివై అధికార నిరంకుశత్వం
విసిరే కత్తి అంచుల మీద కరుణవై జీవించు
యుద్ధోన్మాది వ్యూహం చక్రాల కింద నలిగే సామాన్యుల కంఠంలో
రెక్క విప్పిన పావురమై జీవించు
స్వేద జల ధారాలలో మెరుస్తున్న సామ్యవాద విత్తనంలో
ఆకుపచ్చగా జీవించు
అధికత అధికార ఘట్టనల దిక్కరించి జీవన సారస్యాన్ని కొత్తగా నిర్వచిస్తూ రెపరెపలాడే బహుజన జెండాగా జీవించు
– తండా హరీష్, 8978439551