‘బాలకవి’

బాల సాహిత్యకారుడు, పరిశోధకుడు డా||వాసరవేణి పరశురాములు
తెలుగు బాల సాహిత్య సృజనకారునిగా, బాల సాహిత్యంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన పిహెచ్‌.డి విద్యార్థిగా తెలుగు బాల సాహిత్యకారులకు, బాలలకు పరిచయమైన ‘సింగారం బాల గీతం’ వాసరవేణి పరశురాం పేరుతో రచనలు చేస్తున్న ‘పర్శరాం’. పంరుశరాంకు కుండను ఎంత ఒడుపుగా చెయాలో… బట్టను ఎంత వైపుతో నేయాలో… నారువోసి ఎలా బంగారాన్ని పండించాలో తెలుసు. వృత్తిరీత్యా కళాశాలలో బోధిస్తున్న ఉపన్యాసకుడైనా పైన చెప్పిన వృత్తులన్నీ అయనకు బాగా తెలుసు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డి పేట మండలం సింగారంలో జూన్‌ 10, 1978న పుట్టాడు. శ్రీమతి లక్ష్మి, శ్రీ నర్సయ్యలు అమ్మానాన్నలు.
తెలుగు పండిత శిక్షణతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ‘ఈ దశాబ్ధి బాల సాహిత్యం-ఒక పరిశీలన’ పేరుతో 2001 నుండి 2010 వరకు వచ్చిన తెలుగు బాల సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి పట్టా అందుకున్నాడు. రచయితగా అచ్చయిన పరశురాం తొలి రచన బాలగేయ సంపుటి. ఇది 2001లో వచ్చింది. వచనం, గేయం, వ్యాసం, విమర్శ, జీవిత కథ మొదలగు రూపాల్లో రచనలు చేసిన వాసరవేణి పరశురాం ‘తెలంగాణ వ్యవహారిక భాషా పదాలు’ పేరుతో ఒక చిన్న కోశాన్ని తయారుచేశాడు. కవిగా ‘ఓ స్వార్థ రాజకీయ నాయకులారా!’ పేరుతో దీర్ఘ కవిత రాశాడు. ‘మట్టిలో మాణిక్యం’ పేరుతో నేదునూరి కనకయ్య సంక్షిప్త జీవిత కథ రాశాడు. ‘చైతన్యమూర్తి’ పేరుతో ఉప్పలపాటి పరశురామరాజు జీవిత చరిత్ర రచించాడు. తాను వివిధ సభలు, బాల సాహిత్య సమ్మేళనాల్లో చేసిన ప్రసంగవ్యాసాలకు అక్షర రూపం కలిపిస్తూ అచ్చువేసిన వ్యాస సంపుటి ‘నారుమడి’. ఇవేకాక ‘కల్కి ఒయ్యారాలు’ పేరుతో జానపద గీతాల ఆడియో క్యాసెట్‌ను కూడా వెలువరించాడు పరశురాం. పద్యాలు, నాటికలు, వ్యాసాలు కూడా రాశాడు పరశురాం. పరిశోధక విద్యార్థిగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బాల సాహిత్యం మొదలు పలు అంశాలపై పత్ర సమర్పణ చేసిన పరశురాం 2015లో ఎల్లారెడ్డి పేట మండలం నుండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్తమ సాహితీవేత్తగా పురస్కారం అందుకున్నాడు. వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్‌ యువ సాహితీ పురస్కారంతో పాటు వివిధ సంస్థల సత్కారాలు, పురస్కారాలతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ‘అంగలకుదుటి సుందరాచారి కీర్తి పురస్కారం’ అందుకున్నాడు. తాను పురస్కారాలు స్వీకరించడమే కాదు స్వయంగా తన పేరుతో తెలుగు బాల సాహిత్యంలో పరిశోధన చేస్తున్న వారికి ‘వాసరవేణి బాల సాహిత్య పరిశోధన పురస్కారం’ ప్రతియేట అందిస్తున్నాడు. డా.వి.ఆర్‌.శర్మ, డా.కందేపి రాణీప్రసాద్‌, డా.గౌరవరాజు సతీష్‌ కుమార్‌లు యిప్పటి వరకు ఈ పురస్కారాలు అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా ఉంటూనే తెలంగాణ వివేక రచయితల సంఘం స్థాపించి సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
విద్యార్థి దశనుండే కవిత్వం రాస్తున్న వాసరవేణి తొలి రచన బాలసాహిత్యం, ఇది ‘చుక్‌.. చుక్‌… రైలు’ పేరుతో వెలువడిన బాల గేయ సంపుటి. రెండవ రచన ‘చల్‌ చల్‌ గుఱ్ఱం’ బాల గేయ సంపుటి. యిటీవల వచ్చిన మూడవ బాలల గేయ సంపుటి ‘చిర్రగోనె’. ఇంకా… ‘చిట్టెలుక’, ‘గొర్రెపిల్ల’, ‘కర్రెద్దు’ వంటి బాలల రచనలు అచ్చులో రావాల్సివుంది. పుస్తకాలకు పేర్లు పెట్టడంలోనే కాక రచనల్లోనూ తెలంగాణ భాషకు ప్రతిష్ట చేస్తాడు పరశురాం. అందుకు ‘చిర్రగోనె ఆడుదాం/ చీటి గొట్టి పాడుదాం/ అవ్వతోని ఆడుదాం’ వంటి గేయ పాదాలు ఉదాహరణ. ఈయన గేయాల నిండా గ్రామీణ పిల్లలు – వాళ్ల ఆటలు, పాటలు, మాటలు, అనుబంధాలు, ఆత్మీయ స్పర్శలు అక్షరమై కనిపిస్తాయి. ‘చేనుకాడికోరా చిన్నోడా/ చిలుకలు జూడురా చిన్నోడా/ చేనుకాడి కోరా చిన్నోడా/ గోజలు జూడురా చిన్నోడా’ వంటి తెలంగాణ భాషా పదాల గేయాలు గేయానికి చక్కని బలిమినేకాక గ్రామీణ నేపథ్యాన్ని చిత్రాలుగా చూపిస్తాయి. నిజానికి ఇందులోని చిన్నోడే కవి పరశురాం. ఇంకా బాల్యంలో పిల్లలు, అందులో గ్రామీణ పిల్లలు చేసే పనులను గేయాలుగా చక్కగా రాశాడు పరశురాం. అటువంటివే ‘తోట్లకు పోయినమ్‌/ తోట్లంత తిరిగినమ్‌/ కందగడ్డ దెంపినం/ కర్రకర్ర నమిలినమ్‌/ టమాట తెంపినమ్‌/ టప్ప టప్ప దిన్నం/ పల్లికాయలు దెంపినమ్‌/ పర్రపర్ర బుక్కినమ్‌’, ‘చెట్టీరుక ఆడుదాం/ చెంగ చెంగ దుంకుదాం/ చెట్టు కొమ్మ యిరుద్దాం/ చుట్ట గుండం గీద్దాం’, ‘మక్క శేండ్ల కోదాం/ మంచె మీద ఎగురుదాం/ పిట్టలను ఎలగొడుదామ్‌/ కట్టెలను ఏరుదాం’ మొదలగు గ్రామీణ నేపథ్యమున్న గేయాలు. కేవలం గేయాలే కాకుండా యిటీవల పిల్లల కోసం నవల రాశాడు పరశురాం, అది అచ్చుకావాల్సివుంది. బాల సాహిత్యం, బాలల సాహితీవేత్తల గురించి చక్కని వ్యాసాలు రాసి వాటిని పుస్తకంగా ‘నారుమడి’గా తెచ్చాడు. బాల సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిస్తున్న వాసరవేణి పుట్టినరోజు నిన్న… పుట్టినరోజు శుభాకాంక్షలు… జయహో! బాల సాహిత్యం… సింగారం బాల రాం!

Spread the love