సర్దుకుందాం రండి!

ఇంటి తలుపు కిర్రుమంది. దడదడమంది. ఊగులాడసాగింది. గోడమీద ఈ మూల నుంచి ఆ మూలకు వ్యాపించిన సాలెగూట్లో పురుగు ఒక్కసారిగా వొణికింది. ఆ కదలికకు ఆ గోడ వెంటే చిన్న చిన్న దారాలు అల్లుతూ వున్న పిల్ల సాలీడు ఉలిక్కిపడ్డది. ఏమైంది మామ్‌! తలుపు చప్పుడు చేస్తున్నది. నాకు భయంగా వుంది. ఎవరైనా తలుపు తెరిచి లోపలికి వస్తారా అంది. అదే నాకూ అర్థం కావడంలేదు. అయిదేళ్ళు కావస్తున్నది, మనమీ ఇంట్లోకి వచ్చి. ఎంత స్వేచ్ఛగా హాయిగా వున్నాం. ఇష్టం వచ్చినట్లు గూళ్ళు కట్టుకున్నాం. ఇక ఎవరూ రారని ఇల్లంతా దారాలు దారాలుగా వ్యాపించాం. ఇప్పుడు ఎవరో రావడమేమిటి అన్నది తల్లి.
కలుగులోకి హడావిడిగా దూరింది పిల్ల పందికొక్కు. ఏమైంది నీకు, వెనకా ముందూ చూడకుండా మీద పడ్డావు అంది తల్లిపందికొక్కు పొడుగాటి సన్నటి తోకతో బిడ్డను చుట్టేస్తూ. లోపల వున్నావు కదా, అందుకే వినపడనట్టుంది. బయటి తలుపు చప్పుడయింది. ఎవరో తలుపు తెరుస్తున్నట్టనిపించి భయంతో కలుగులోకి దూరాను అన్నది చిన్నారి పందికొక్కు. అదేమిటి నాలుగున్నర ఏళ్ళ నుంచీ హాయిగా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాం. కలుగులు మారుస్తున్నాం. ఎవరూ అడిగింది లేదు. ఐదో ఏడు దగ్గర పడుతుంటే ఎవరు వస్తున్నారు? అన్నది మదర్‌ బాండికూట్‌.
ఎలుకల గుంపు ఒకటి హడావిడిగా గోడల రంధ్రాల నుండి బయటకు దూకి ఇల్లంతా పరుగెత్తసాగింది. వాటి చప్పుడు ఇల్లంతా వ్యాపించడంతో బొద్దింకల కాలనీలో వున్న బొద్దింకలు కదలసాగాయి. రెక్కలున్న ఓ జేగురురంగు బొద్దింక గాలిలో ఎగిరి ఓ ఎలుకకు ఎదురై అడిగింది. ‘వాట్‌ మిస్టర్‌ ర్యాట్‌, వాట్‌ హేపెండ్‌’ అని. ఎలుక తోక మీద నిలబడి ‘టైం లేదు, ఎక్కడో ఓ చోట సేఫ్‌గా దాక్కోవాలి. లైఫ్‌ అండ్‌ డెత్‌ ప్రాబ్లమ్‌’ అంది. ఏమైందిప్పుడు అంత పెద్ద సమస్యేమిటసలు? అంది రెక్కల బొద్దింక. వినపళ్లేదా బయట తలుపు తెరుచుకుంటున్న ధ్వని. ఎవరో లోపలికి రాబోతున్నారు. ఎలుకలందరం ప్రాణాలు తోకల్లో పెట్టుకుని సేఫ్టీ ఏరియాలు వెదుక్కుంటూ బయల్దేరాం అంది ఎలుక.
ఈ వార్త క్షణాల్లో బొద్దింకల కాలనీవాళ్లకు అందింది. గుంపులు గుంపులుగా బొద్దింకలు గుమిగూడి చర్చించుకోసాగాయి. ఇన్నేళ్ళ నుంచీ లేని ఈ ‘ఎమర్జెన్సీ’ సిట్యువేషన్‌ ఐదవ ఏటే ఎందుకు ఏర్పడిందని. తలుపు తెరిచి ఎవరైనా లోపలికి వస్తే బొద్దింకల జాతి ఉనికికే ప్రమాదమని భయంతో బిగుసుకుపోయేయి.
ఇల్లంతా వ్యాపించిన సాలెగూళ్లల్లో అతి పెద్దదయిన జెయింటు సాలీడు నోరు విప్పింది. సీనియర్‌ స్పైడర్‌ని కనుక అనుభవంతో చెప్తున్నా. మన స్వేచ్ఛకు భంగం వాటిల్లే సమయం వచ్చేసింది. ఐదేళ్లు ఐదేళ్లని అందరూ వాపోవడానికి కారణం అయిదేళ్ళకు ఒక్కసారి మనుషుల లోకంలో వచ్చే ఎన్నికలే. ఎలక్షన్‌ అంటే మనందరికీ ఎవర్జెన్సీ అన్నమాట. మనం వుంటున్న భవనం పేరు ‘ప్రజా సంక్షేమం’ అని మా ముత్తాత చెప్పడం నాకు గుర్తు. ఒకసారి ఎన్నికలవగానే దీనికి తాళం వేస్తారు నాయకులైన మనుషులు. మళ్ళీ అయిదేళ్ల వరకు తలుపు తెరవరు. లోపల మనమూ, పంది కొక్కులూ, ఎలుకలూ, బొద్దింకలు వాటితో పాటు గదుల్నిండా దుమ్మూ ధూళీ, చెత్తా చెదారం చేరి కంపు కొడుతుంటాయి. ఆ కంపు మనకు ఇంపు కనుక, అడిగే వాడెవరూ రాడు కనుక మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఫ్రీగా బతుకుతున్నాం. అయితే ‘ప్రళయం’ అనేది ఒకటుంది. అది వచ్చినప్పుడు ప్రాణులన్నీ ‘హరీ’మంటాయి. ఈ ఇంట్లోకి మనందరం వచ్చి ఐదేళ్ళు కావస్తున్నయి. కనుక ఎన్నికలు వస్తున్నయి కాబట్టి ‘ప్రళయం’ వస్తున్నది. అందుకే అన్ని పార్టీల మనుషులు, ఎన్నికల్లో నిలబడి గెలవాలని అనుకుంటున్న వాళ్లు ఈ ప్రజాసంక్షేమ భవనం తలుపు తెరిచి, తాము ఇప్పటి దాకా చేసిన తప్పులకు చెంపలు వేసుకుని, సాలెగూళ్లూ, పందికొక్కులు, ఎలుకలు, బొద్దింకలు చేరిన ఈ భవనాన్ని శుభ్రం చేసి, వస్తువులన్నింటినీ చక్కగా సర్దడానికి వస్తున్నారు. అన్ని పార్టీల నాయకులూ తమ వారితో ‘సర్దుకునే కార్యక్రమం’ మొదలు పెట్టినట్టున్నారు. ఇక ఈ ఇంట్లో మన జాతులన్నీ నశించిపోతాయి. ప్రాణాలతో మిగిలున్నవాళ్లు ఎన్నికల తర్వాత, ఈ భవనానికి తాళం పడ్డాక తిరిగి ఐదేళ్ల దాకా బతికి వుండవచ్చు అని అంటుండగానే భవనం తలుపు తెరుచుకుంది. గునపాలు, పారలు, చీపుర్లు, బుట్టలు తీసుకుని రకరకాల జెండాలు పట్టుకుని జనం లోపలికి వచ్చారు, ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ ‘సర్దుకుందాం రండి’ అని కేకలు పెడుతూ!!
– చింతపట్ల సుదర్శన్‌, 9299809212 

Spread the love