మా వూరి రచ్చబండ నయం

మీ కన్నా
మా ఊరి రచ్చబండ నయం
ఏ చిన్న తగాదా వచ్చినా
పెద్దదిక్కులా తీర్పునిస్తది
పరువు
బజారు దాకా ఎక్కనీయదు
వూరు బొడ్రాయి సాక్షిగా
పొరుగూరికి పొక్కనీయకనే
మర్యాదని నిలబెడతది

న్యాయంచెప్పటానికి
మీలాగా మీనమీషాలు లెక్కపెట్టదు
ఆలుమగల కొట్లాటైనా
అన్నాదమ్ముల ఆస్తి గొడవలైనా
కన్నోళ్లకింత గంజినీళ్ళు పోయని
కొడుకుల నిర్వాకాలైనా
ఆ వూరి గడపలోనే ఎండగడతది

రంగువల్లులున్న గుమ్మాలవైపు
కన్నెత్తి చూసే పోకిరీ వెదవల ఒంటినిండా సున్నపుబొట్లతో
అరగుండుగీసి వూరేగిస్తది

మన బిడ్డల మాన ప్రాణాలను
కిలోల కొద్దీ లెక్కగట్టిన
మానవ మౄగాన్ని
పార్లమెంట్‌ హాలు దాకా రానీయదు
పొలిమేర దాటకుండానే పాతరేస్తది

దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన
అత్మాభిమాన ప్రతీకలని అవమానిస్తూ
ఢిల్లీ నడి వీధుల్లో ‘మహా పంచాయతీ’
పెట్టేదాకా రానీయదు

చిర్రా చిటికెన పుల్లా సిద్ధం చేసి
”చాకిరేవుకు” చాటింపు వేయమంటది
మీ ముదనష్టపు పాలన కన్నా
మావూరి రచ్చబండ తీర్పే నయం

నిజాన్ని మాట్లాడటానికి
నీళ్లు నమలదు
నీతిమాటల సాటున గోతులూ తీయదు.!

– ఆది ఆంధ్ర తిప్పేస్వామి,
7780263877

Spread the love