రెంటికీ చెడ్డ రేవడిలా కేసీఆర్‌ పరిస్థితి

– రాజాసింగ్‌పై వేటును తొలగించాలని అధిష్టానాన్ని కోరుతా
– బీజేపీ శ్రేణులను భయపెట్టేలా బీఆర్‌ఎస్‌ దాడులు :ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికలకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తానని దేశంలోని నేతల చుట్టూ తిరిగినా ఆయన్ను ఎవ్వరూ నమ్మడంలేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్పొరేటర్‌ శశికళతో ఈటల రాజేందర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీనిపై త్వరలోనే అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకుంటున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనీ, కార్పొరేటర్‌ శశికళపై అనేక సెక్షన్ల కింద అన్యాయంగా కేసులు నమోదు చేశారని విమర్శించారు. తమ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గజ్వేల్‌ లో అకారణంగా దాడి చేసి కొట్టించారనీ, బాధితులనే 14 రోజులు జైల్లో పెట్టించారని ఆరోపించారు. మీర్‌పేట లో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారని వాపోయారు. హుజూరాబాద్‌ లో ఓ సర్పంచ్‌ ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారని తెలిపారు. వీటన్నింటినీ కేంద్రం గమనిస్తుందని వ్యాఖ్యానించారు.

 

Spread the love