జీపీ కార్మికులను చర్చలకు పిలవకపోవడం దుష్ట రాజకీయం

– సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, ఐఎఫ్‌టీయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీ (జీపీ) కార్మికులను చర్చలకు పిలవకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దుష్ట రాజకీయానికి నిదర్శనమని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, ఐఎఫ్‌టీయూ విమర్శించాయి. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ కార్మికుల పోరాటం క్షుద్ర రాజకీయం కాదనీ, బతుకు దెరువు కోసం ఉద్యోగ భద్రత కోసం వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వమే వారి పట్ల క్షుద్రత్వం, కుటిలత్వాన్ని ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. 14 రోజులుగా 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందనీ, ముందు మంత్రి ఎర్రబెల్లి, సీఎం కేసీఆర్‌ స్పందించి వెంటనే కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అప్రజాస్వామిక విధానాలను వదిలి, సమ్మెను పరిష్కరించాలని కోరారు. చట్టప్రకారం వారికి రూ.18 వేలు లేదా రూ.19 వేలు కనీస వేతనం అమలు చేయాలని సూచించారు. రూ.500, రూ.వెయ్యి బిక్షం వేసినట్టు పెంచి మనసున్న మారాజులం అంటూ గొప్పలు చెప్పడం సరైంది కాదని తెలిపారు. వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, ప్రమాద బీమా అమలు చేయాలనీ, పనిభారం తగ్గించాలని వివరించారు.

Spread the love