మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

– బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలి : రాజకీయ శిక్షణా తరగతుల్లో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని జేఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో బుధవారం సీపీఐ(ఎం) నియోజవర్గస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంకుశ పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే విధానం, ఒకే పార్టీ.. ఒకే ప్రభుత్వం ఉండాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే దేశంలో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు రేపి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్పొరేట్‌ సంస్థలను, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజ్యాన్ని ఏలుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా.. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మకానికి పెడతారని చెప్పారు. మోడీని గద్దె దింపేందుకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపి మోడీ వ్యతిరేక విధానాలను ప్రజలకు గురించి చైతన్యపరచాలని కోరారు. మోడీ అవలంబిస్తున్న విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ- ప్రజాసంఘాల నిర్మాణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలు-పర్యవసానాలుపై సోమయ్య, మిరియం వెంకటేశ్వర్లు బోధించారు. ప్రిన్సిపాల్‌గా వీరేపల్లి వెంకటేశ్వర్లు వ్యవహరించగా.. రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, సీనియర్‌ నాయకులు జగదీష్‌ చంద్ర, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్‌, డా. మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, వినోద్‌ నాయక్‌, తిరుపతి రామ్మూర్తి, పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love