ఇచ్చిన హామీలు అమలు చేయాలి పూర్తి రుణ మాఫీ చేయాలి

– ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి
– ఎడమ కాలువ పెండింగ్‌ లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి
– విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100శాతం అమలు చేసినప్పుడే బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఆదరించి మళ్ళీ అవకాశం ఇస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని ఈ ఎన్నికల ముందే అమలు చేసి చిత్తశద్ధి నిరూపించుకోవాలన్నా రు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. ఇంకా రూ.13,700 కోట్ల రుణమాఫీ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేసినప్పుడే రైతులు ఈ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునే సదుపాయం ఉంటుందన్నారు. యాసంగి సీజన్‌లో ధాన్యం అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, దాంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే ధాన్యం డబ్బులను చెల్లించాలని కోరారు. ఈ సీజన్‌లో నకిలీ విత్తనాలు, ఎరువులు మార్కెట్‌లో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. 11 లక్షల ఎకరాలకు పోడు భూములకు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ నేటికీ అమలు లేదని చెప్పారు. వెంటనే పోడు పత్రాలు వచ్చి ఆ రైతులకు అన్ని రకాల రాయితీలు కల్పించాలని కోరారు. ధరణిలో ఉన్న లోపాలను సరి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకోకుండా వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని సూచించారు. ఎడమ కాలువ ఆధునీకరణ చేపట్టినప్పుడు ఆయా మేజర్ల పరిధిలో లైనింగ్‌ పనులు మధ్య మధ్యలో వదిలేశారని, దానివల్ల గండ్లు పడే ప్రమాదం ఉందని, వెంటనే పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కాకముందే లైనింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఏర్పడితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు అందులో అంతర్భాగంగా ఎత్తిపోతలను పరిగణలోకి తీసుకొని రిపేర్లు చేయించి పూర్తి నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు నూకల జగదీష్‌చంద్ర, రెమిడాల పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి,రామ్మూర్తి, వినోద్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love