Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘పీఎం ఏక్తా మాల్‌’ టెండర్లలో భారీ కుంభకోణం

‘పీఎం ఏక్తా మాల్‌’ టెండర్లలో భారీ కుంభకోణం

- Advertisement -

టెండర్లు రద్దు చేసి స్వతంత్ర విచారణ జరపాలి
 ప్రజా భూమి, కేంద్ర నిధులను ప్రయివేటు డెవలపర్‌కు దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా (యూనిటీ) మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్లలో కావాలనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమమైన, అనుమానాస్పద నిబంధనలు పెట్టి ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రయివేటు డెవలపర్‌కు విపరీతమైన లబ్ది చేకూరుస్తున్నదని తెలిపారు. ఆ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై ఎటువంటి తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రయివేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధుల విడుదలను తక్షణమే నిలిపేయాలని కోరారు. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

భారీ అక్రమాలు
భూమి విలువ కాకుండా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ. 2,059.81 కోట్లని, దీనిలో భారీ అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్నదని కేటీఆర్ లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 202 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని గుర్తుచేశారు. రాయదుర్గ్‌లోని అత్యంత విలువైన 6.30 ఎకరాల స్థలంలో, సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును తలపెట్టారని తెలిపారు.
ఈ టెండర్‌లో వాణిజ్య స్థలం కేటాయింపు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆక్షేపించారు. ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే కనీస వాటా కేవలం తొమ్మిది లక్షల చదరపు అడుగులు కాగా, ప్రయివేటు డెవలపర్‌కు మాత్రం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారని వివరించారు. విలువైన ప్రజా భూమిని, భారీ ప్రజాధనాన్ని ప్రయివేటు డెవలపర్‌కు ప్రభుత్వం కంటే రెట్టింపు స్థలాన్ని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీదైన ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ప్రాజెక్టులో ప్రయివేటు డెవలపర్‌కు ఇంత భారీ మొత్తంలో వాణిజ్య హక్కులు ఎందుకు కల్పిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటాయిస్తున్న ప్రజా వనరులకు తగిన విలువ రాష్ట్ర ప్రజలకు దక్కుతోందా? లేదా? అని ప్రశ్నించారు.

ప్రాజెక్టు ఆర్థిక నమూనాపై అభ్యంతరం
ఈ ప్రాజెక్టు ఆర్థిక నమూనాపై కూడా కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌‌సీఐ) పథకం కింద పీఎం యూనిటీ మాల్ కోసం మంజూరైన రూ.200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీటీపీసీ) ద్వారా ఆ డెవలపర్‌కు నిధులు మళ్లించేలా టెండర్ నిబంధనలు రూపొందించారని తెలిపారు. ప్రాజెక్ట్ సిద్ధం చేయడం, కన్సల్టెన్సీ, సర్వేలు, అనుమతులు, సైట్ ప్రిపరేషన్ వంటి ప్రాథమిక పనులకు ఇప్పటికే చేసిన ఖర్చును ఈ నిధుల నుంచి సర్దుబాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని కేటాయించే ముందు ఈ ఆర్థిక నమూనాపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమానాస్పద టెండర్లను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సహాయాన్ని లేదా ‘పీఎం ఏక్తా మాల్’ అనే బ్రాండ్ పేరును కవచంగా వాడుకుంటున్నదని విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన పేరు ఉన్నంత మాత్రాన అవినీతి ఒప్పందం పారదర్శకంగా మారిపోదని తెలిపారు. ప్రజా భూమి, ప్రజాధనం, విలువైన వాణిజ్య హక్కులు ఉన్నచోట పరిపూర్ణమైన పారదర్శకత, స్వతంత్ర విచారణ ఉండాలని స్పష్టం చేశారు.

​ప్రధాని సహా కేంద్రమంత్రులు కాంగ్రెస్‌ అవినీతిపై మాట్లాడ్డమే తప్పచర్యల్లేవు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అవినీతిపై స్వయంగా ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అమృత్ టెండర్ల అక్రమాలు, బొగ్గు కుంభకోణం వంటి అనేక అవినీతి వ్యవహారాలపై ఆధారాలతో సహా సదరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్వతంత్ర విచారణలు జరిపించాలని పోరాడుతున్నామని తెలిపారు.
పీఎం ఏక్తా మాల్ టెండర్లలో వెలుగుచూసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. టెండర్ నిబంధనలు లేదా ఆర్థిక నమూనా వల్ల ఏదేని ప్రయివేటు సంస్థకు అనుచిత లేదా నిబంధనలకు విరుద్ధమైన లబ్ది చేకూరిందో లేదో కూడా ఈ విచారణ తేల్చాలని కోరారు. పూర్తి స్థాయి డీపీఆర్, ఫైనాన్షియల్ మోడల్, ల్యాండ్ వాల్యుయేషన్, టెండర్ డాక్యుమెంట్లు, బిడ్ మూల్యాంకన రికార్డులను కూడా పబ్లిక్ స్క్రూట్నీకి ఉంచాలని డిమాండ్ చేశారు.

ఆర్థిక అక్రమాలు, అవకతవకలు లేదా ప్రయివేటు సంస్థలకు అక్రమ లబ్ది చేకూరినట్టు తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం, ప్రజా ఆస్తులు దుర్వినియోగం చేస్తున్న ప్రతి సందర్భంలోనూ అందుబాటులో ఉన్న ఆధారాలను అధికారుల ముందు ఉంచి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -