టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయాలు, ఉపాధ్యాయుల విజ్ఞాన కేంద్రాలు, నిరుద్యోగులు, ఉద్యోగులకు పోరాట వేదికలుగా నిలుస్తున్నాయని ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి , టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు చావ రవి తెలిపారు. ఈ ఒరవడిని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయం వరకు కొనసాగించడం అభినందనీయమని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో అదనపు భవన నిర్మాణంతోపాటు, ప్రస్తుత భవన ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిచారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ కార్యాలయాలను ఉపాధ్యాయ హక్కుల కోసం, విద్యకోసం నిరంతరం పోరాడే సంఘంగా, నిరుద్యోగులకు శిక్షణ కేంద్రాలుగా పోరాట వేదికలుగా కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేటి తరం ఉపాధ్యాయుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందిస్తూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను దూరం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తుచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో మార్పుల పేరుతో ఒకవైపు ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్ని రోజురోజుకు బలహీన పరుస్తున్నాయని రవి విమర్శించారు. ఎన్ఈపీ-2020 పేరుతో సిలబస్ లో మార్పులు తెచ్చి మరింత అశాస్త్రీయ భావాలను పెంపొందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిని అర్థం చేసుకుని పోరాడగలిగే శక్తిని ఉపాధ్యాయుల్లో పెంపొందించడం కోసం యూటీఎఫ్ భవనాలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అలాగే అభ్యుదయ ఆలోచనలతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే సంస్థలకు యుటిఎఫ్ కార్యాలయాలు పోరాట వేదికలుగా నిలబడాలని సూచించారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం పోరాడే సంఘంగా వారి ఆదరాభిమానాలు యూటీఎఫ్ కు ఉన్నాయని తెలిపారు. భవన నిర్మాణానికి అయ్యే రూ.కోటి ఉపాధ్యాయుల నుంచి సమకూర్చినట్టు చెప్పారు. వచ్చిన డబ్బులకు జవాబుదారిగా ఉంటూ ప్రతి పైసాను సద్వినియోగపర్చి ఉద్యమ కేంద్రంగా మారుస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా టీఎస్ యూటీఎఫ్ స్వతంత్ర పోరాటాలతోపాటు యుయస్‌పీసీ ఇచ్చిన 4 దశల పోరాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాలందరిపై ఉందని తెలిపారు. పోరాటాలు లేకుండా ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను ఎప్పుడూ పరిష్కరించలేదని వెంకట్ గుర్తుచేశారు.
ప్రభుత్వాలు మారినంత మాత్రాన సమస్యలు వాటంతట అవే పరిష్కారం కావన్నారు. పాలకుల ఆలోచన ధోరణుల్లో మార్పు రావాలంటే లాబీయింగ్ కంటే పోరాటాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు యం. రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డి.సత్యానంద్, యస్. మల్లారెడ్డి, కె. రంజిత్‌కుమార్, కె.రవికుమార్, ఎ.సింహాచలం, వై. జ్ఞానమంజరి, యం.వెంకటప్ప, పి.వెంకటేశం, యన్.సోంబాబు, సిహెచ్. విశాలి, సీనియర్ నాయకులు టాప్రా ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, ఎస్టీఎఫ్ఐ పూర్వ ఉపాధ్యక్షులు యం.సంయుక్త, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యూటీఎఫ్ భవనాలు విజ్ఞాన పోరాట కేంద్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



