అదుపులో 21 మంది మహిళా టెలీకాలర్లు, బ్యాంకు ఖాతాదారుడు
పరారీలో ముగ్గురు నిర్వాహకులు
ఢిల్లీలోని శివ మార్కెట్ నుంచి కాల్‌సెంటర్ నిర్వహణ
ఆఫర్లు, బజాజ్ ఫైనాన్స్
లోన్ల పేరుతో దందా :
వివరాలు వెల్లడించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
ఢిల్లీ నుంచి నడుపుతున్న మోసపూరిత కాల్ సెంటర్ నెట్‌వర్క్‌ను టీజీసీఎస్‌బీ బృందం ఛేదించిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ప్రకటించారు. ఆఫర్లు వచ్చాయంటూ, బజాన్ ఫైనాన్స్ లోన్లు ఇప్పిస్తాంటూ కాల్స్ చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్న 21 మంది మహిళా టెలీ కాలర్లను, ఒక బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. టీజీసీఎస్‌బ డిప్యూటీ ఎస్‌పీ జి.శ్రీనివాస్, సీఐలు భద్రంరాజు రమేశ్, డి.శ్రీను, ఎస్‌ఐలు మహేందర్, కార్తీక్, శిరీష, లిఖిత, ఇతర సిబ్బంది నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిందని అభినందించారు.
శిఖాగోయల్ వివరాల ప్రకారం…ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా లలిత్ సింగ్, కుల్‌దీప్ సింగ్, అనిల్ నేతృత్వంలోని వేర్వేరు బృందాలు ఏడాదిన్నరగా కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. 25 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సు ఉండి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్న యువతులను కాల్‌సెంటర్లలో పెట్టుకుని అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని పలు ఆఫర్లు చూపుతూ, బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
మోసగాళ్లు ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ – రుణ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా ప్రీమియం తదితర కల్పిత ఛార్జీల పేరుతో బాధితులు డబ్బు చెల్లించేలా ప్రేరేపించారు. డబ్బు అందుకున్న తర్వాత నిందితులు బాధితులతో సంభాషణ నిలిపివేయడం, రుణ మంజూరు గురించి తప్పుడు హామీలు ఇస్తూ మరింత డబ్బు డిమాండ్ చేయడం చేసేవారు. బాధితులు లావాదేవీల గురించి ప్రశ్నించినప్పుడు, డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, నిందితులు బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా, మోసంపై ఫిర్యాదు చేయకుండా అడ్డుకునే ఉద్దేశంతో – చట్టపర చర్యలు తీసుకుంటామని, పరువుకు భంగం కలిగిస్తామని, వారి వ్యక్తిగత సమాచారాన్ని మరియు గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని బెదిరించారు. మోసపోయిన పలువురు వ్యక్తుల ఫిర్యాదు మేరకు ఈ నెట్‌వర్క్ ఢిల్లీ కేంద్రం నుంచి నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. టీజీసీఎస్‌బీ అధికారులు ఢిల్లీలోని శివమార్కెట్‌కు వెళ్లి మూడు సైబర్ నేర కాల్ సెంటర్లపై సమన్వయంతో దాడులు నిర్వహించారు. ముగ్గురు ప్రధాన నిర్వాహకులను గుర్తించారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో టీమ్ లీడర్లు, టెలీకాలర్లు, ఒక బ్యాంక్ ఖాతాదారుడు ఉన్నారు. అరెస్టు అయిన టెలీకాలర్లలో జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళలున్నట్టు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 22 సైబర్ నేర కేసులతో వీరికి సంబంధాలున్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆఫర్లకు ప్రజలు మోసపోవద్దు
రుణాలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీ, ఇతర ఏ మొత్తాన్నైనా చెల్లించే ముందు కాల్ చేసిన వ్యక్తి, రుణ సంస్థ నిజమైనదా? కాదా? అనే విషయాన్ని ప్రజలు ధ్రువీకరించుకోవాలని కోరారు. కాల్ చేసినవారు మహిళలు కావడం, తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారనే కారణంతోనే వారిని నమ్మవద్దని సూచించారు. మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు ప్రాంతీయ భాషలు మాట్లాడేవారిని ఎక్కువగా నియమించుకుంటున్న విషయాన్ని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? వారి పని స్వభావం ఏమిటి? అనే విషయాలపై ముఖ్యంగా రాష్ట్రం వెలుపల కాల్ సెంటర్లలో పని చేస్తున్నప్పుడు – కుటుంబాలు అవగాహనతో ఉండాలని సూచించారు. మోసపూరిత సైబర్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలనీ, ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ నేర నెట్‌వర్క్‌ను ఛేదించిన టీజీసీఎస్‌బీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



