18న విగ్రహప్రతిష్టకు ఏర్పాట్లు :
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ-కల్చరల్
రాష్ట్ర సచివాలయం ఎదురుగా సామాజిక ఉద్యమకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 18న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రధాన వేదికపై సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 376వ జయంతి జాతీయ వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన సాహస యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని తెలిపారు. అయితే కేంద్రం దీనిపై అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో తప్పకుండా ఆమోదం పొంది చట్టం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జై గౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల నాయకులు సత్యం గౌడ్, అజయ్, బాలరాజ్, వెంకన్న, సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయం ఎదుట సర్వాయి పాపన్న విగ్రహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



