Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయంద్రవ్యోల్బణమే పెద్ద ముప్పు

ద్రవ్యోల్బణమే పెద్ద ముప్పు

- Advertisement -

గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం బ్రోకరేజ్‌ సంస్థ నువామా నివేదిక
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి మందగమనం కంటే ద్రవ్యోల్బణమే పెద్ద ముప్పుగా పరిణమించనుందని బ్రోకరేజీ సంస్థ నువామా ఇన్స్‌‌ట్యూషనల్‌ ఈక్విటీస్‌ ‌తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో అధిక ముడిచమురు ధరలు, ఇంధన భారం, ఎరువుల ఖర్చులు పెరగడం, వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సరఫరా అంతరాయాల వల్ల దేశంలో రిటైల్‌ ‌ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) దాదాపు 5.7 శాతానికి చేరొచ్చని హెచ్చరించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) అంచనా వేసిన 4.6 శాతం కంటే చాలా ఎక్కువ కావడం ఆందోళనకరం. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం దేశంలో విస్తృతమైన ఆర్థిక మందగమనం కంటే.. కేవలం ద్రవ్యోల్బణంతో కూడిన గ్రామీణ మందగమనంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని నువామా బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది.

పంటలపై ఎల్ నినో ప్రభావం..
పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావం ఇంధన ధరలకు ఆజ్యం పోస్తున్నాయని.. తద్వారా రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు కొత్త సవాళ్లను విసురుతోంది. నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉండి.. నిల్వలు పరిమితంగా ఉన్న పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, మసాలా దినుసులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే.. ప్రభుత్వ కొనుగోళ్లు, సాగు నీటి వసతుల వల్ల వరి, గోధుమ పంటలు కొంతవరకు సురక్షితంగా ఉండవచ్చు. కేరళలో రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, తెలంగాణతో సహా ఇతర ప్రాంతాల్లోకి వీటి ప్రవేశం సానుకూలంగానే ఉంది. అయినప్పటికీ, ఈసారి సాధారణ వర్షపాతంలో 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధంగా రుతుపవనాల ప్రధాన కాలంలో ఎల్‌‌నినో ముప్పు పొంచి ఉండటం ఖరీఫ్, రబీ పంటల దిగుబడిపై, జలాశయాల నీటి మట్టాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం
ఈ ద్రవ్యోల్బణ ప్రభావం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ భారతదేశాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీయనుందని నువామ పేర్కొంది. పట్టణాల్లోని వినియోగదారుల ధరల సూచీలో ఆహార వస్తువుల వాటా 30.3 శాతంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 42 శాతంగా ఉంది. దీంతో ఆహార ధరలు పెరిగిన ప్రతిసారీ గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ధరల పెరుగుదల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించి.. వారి వాస్తవ వేతన వృద్ధిని కుదిపేస్తుంది. దీని ఫలితంగా గ్రామీణ మార్కెట్‌పై ఆధారపడే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వ్యాపారాలు మందగించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రయివేటు బ్యాంకులు, ప్రీమియం వినియోగం వంటి పట్టణ ఆధారిత రంగాలు మాత్రం స్థిరంగా కొనసాగవచ్చు.

వడ్డీ రేట్లు పెరగొచ్చు..
అధిక ధరల నేపథ్యంలో ఆర్‌‌బిఐ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయి. వచ్చే సమీక్షల్లో కఠినమైన ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపడంతో పాటుగా ఫారిన్ ఎక్స్ఛేంజ్ జోక్యం, మార్కెట్ లిక్విడిటీని నిర్వహించడానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇలాగే కొనసాగి, రూపాయి విలువపై ఒత్తిడి తగ్గకపోతే మాత్రం ఆర్‌బిఐ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం నుండి రిజర్వ్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నువామా విశ్లేషించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -