విద్యార్థులపై పోలీసుల దాడి పట్ల ప్రకటన చేయాలి
పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళన
రాజ్యసభలో సభ్యుల వాకౌట్
ఉభయసభల్లో చెరో బిల్లు ఆమోదం
లోక్‌సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు రావాలని, విద్యార్థులపై పోలీసుల దాడి పట్ల ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాల దాడి, అయోధ్య రామమందిరం విరాళాల చోరీకి వ్యతిరేకంగా సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాజ్యసభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్‌సభను ప్యానెల్ స్పీకర్ ప్రేమచంద్రన్ ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు హోరెత్తించారు. జులై 20న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ గురించి వివరణ ఇవ్వాలని, కేంద్ర మంత్రి అమిత్ షా సభకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభ సమావేశమైన కొన్ని సెకన్లలోనే మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు.
న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకించారు. ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కేరళం పేరు మార్పు బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును మంత్రి మురళీధర్ మోహల్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. దీంతో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే ఎటువంటి చర్చ లేకుండానే ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దీనికి ప్రతిపక్ష ఎంపీ కె.సి వేణుగోపాల్ స్పందిస్తూ చర్చకంటే ముందు విద్యార్థులపై క్రూరమైన దాడి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభను నేటి(మంగళవారం)కి వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి లోక్‌సభ కార్యక్రమాలు ప్రతి రోజూ వాయిదాపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టగా ఆరు బిల్లులు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ “దాదాపు 20 రోజులు గడిచినా సమాధానం చెప్పేందుకు అమిత్ షా పార్లమెంటుకు రాలేదు. చర్చ కోసం ప్రతిపక్షం ప్రవేశపెట్టిన ప్రతి తీర్మానాన్ని తిరస్కరించారు. ఆయన మౌనం పొరపాటు కాదు.. అది హింసకు ఆమోదం తెలపడమే. ఆయన దోషి అయినా అయి ఉండాలి లేదా అసమర్థుడైనా అయి ఉండాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనను జవాబుదారీగా నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదు” అని అన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
మరోవైపు రాజ్యసభలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సభను ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి.
దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రామ మందిర విరాళాల చోరీపై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. రామ మందిర విరాళాల చోరీ, నిరసనకారులపై పెల్లెట్ గన్‌ల వాడకం వంటి అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించగా చైర్మెన్ అనుమతించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ది బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’ను సభలో చర్చకు ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు హోరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళనతో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ వెంటనే సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.15 గంటలకు సభ తిరిగి సమావేశం కాగా వలసవాద కాలం నాటి చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చే బిల్లును నిర్మలా సీతారామన్ చర్చకు పెట్టారు. అయితే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొన్ని అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించగా, ఎంపీలు కేవలం బిల్లుపై మాత్రమే మాట్లాడాలని సభాపతి స్పష్టం చేశారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించి, సభను నేటి (మంగళవారం)కి వాయిదా వేశారు.
రామ మందిర విరాళాల చోరీపై ఆందోళన
అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ, విద్యార్థులపై పోలీసుల దురాగతాలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సోమవారం పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ(ఎం)ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్ తో సహా ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. పేపర్ లీక్ అంశంపై గత నెల 20న జరిగిన విద్యార్థుల ఆందోళనలో పోలీసులు దురాగతాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై హోం మంత్రి అమిత్ షా తప్పనిసరిగా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని, ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం ముందు ‘చందా చోర్.. గద్దె చోడ్ ’, ‘అమిత్ షా జవాబ్ దో’, ‘బీజేపీకే దఫ్తర్ మే, చందా చోర్ కహా మిలేంగే’ వంటి నినాదాలు హోరెత్తించారు. రామ మందిరంలో విరాళాల అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలకు ప్రతీకగా ఎంపీలు ఆ ప్రదేశంలో ఒక విరాళాల పెట్టెను ఉంచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాని చుట్టూ బారులు తీరారు. ప్రతిపక్ష ఎంపీలు, ‘అమిత్ షా జవాబ్ దో’ అని రాసి ఉన్న ఒక పెద్ద బ్యానర్ వెనుక బారులు తీరి, హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమిత్ షా సభకు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



