నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. సోమవారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెలకు సంబంధించిన 240 కల్యాణ లక్ష్మి, సిఎంఆర్ఏప్ చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మల్హర్ సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



