ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి
కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్
నవతెలంగాణ – మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటాన్ని తీవ్రంగా అవమానించిన ఘటనపై ప్రజా సంఘాలు, అంబేడ్కర్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఆఫీసులో తను కూర్చుండే గదిలో ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని తను కూర్చుండే కుర్చీ పైన గోడపై గౌరవప్రదమైన స్థానంలో ఉంచి, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ చిత్రపటాన్ని మాత్రం కుర్చీ పక్కన రికార్డులు పడేసే పాత టేబుల్‌పై నిలబెట్టడం క్షమించరాని నేరమని, కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్ మండిపడ్డారు. సోమవారం కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని తక్కువ చేసి చూపుతూ కావాలని అవమానించిన సదరు అధికారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగ నిర్మాతనే అవమానించిన ఎంపీడీఓను వెంటనే విధుల నుంచి తొలగించి (సస్పెండ్ చేసి) సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆధిపత్య అగ్రవర్ణ అహంకారంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. దేశ గౌరవానికి, రాజ్యాంగ విలువలకే భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు అధికారిపై జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, కుల సంఘాల జేఏసీ అదేవిధంగా అంబేడ్కర్ వాదులు తీవ్రస్థాయిలో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్,కో కన్వీనర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.



