మూఢ నమ్మకాలను ప్రొత్సహించడమే సర్వత్రా విమర్శలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో సీఎం వరుణ యాగంపై మరోసారి చర్చోపచర్చలు సాగుతున్నాయి. శాస్ర్తీయ విధానాలపై ప్రభుత్వాలకు నమ్మకం పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ సర్కారు హయాం నుంచి వానలు పడకపోతే యాగాలు చేయడం అలవాటుగా మారింది. రాజకీయాలు, ఓట్ల కోసం ఆయా పార్టీలు, ప్రభుత్వాలు ఈ తరహా ప్రయత్నాలు చేస్తాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గులాబీ బాటలో నడవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వానలు రాకపోతే సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేయాలి, దానికి సంబంధించి అనుబంధ పనులను వేగిరం చేయాలి, కాల్వలు తవ్వాలి, రిజర్వాయర్లు కట్టాలి. ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకుండా ప్రజలను ఏమార్చడానికి, మభ్యపెట్టడానికి యాగాల పేర సమయం, డబ్బు వృధా చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతమూ అదే జరుగుతున్నది. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో పలుమార్లు ఈ తరహా యాగాలతో ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేశారని అభ్యుదయ వాదులు, ప్రజాసంఘాలు గతంలోనే ఖండించాయి. సాగునీరు, తాగునీరు ఏదైనా కావాలంటే యాగాలు కాదు.. ప్రాజెక్టులు కావాలి..కాలువలు, రిజర్వాయర్లు నిర్మించాలి. అంతే తప్ప మూఢ నమ్మకాలను ప్రభుత్వాలే ప్రచారంలోకి తేవడం సరికాదని అంటున్నారు. 21వ శతాబ్దంలో కూడా యాగాలతో వర్షాలు వస్తాయని చెప్పడం వెనుకబాటుతనం..వాతావరణ మార్పులు, నీటి యాజమాన్యమే వర్షాభావానికి పరిష్కారమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఇటీవల హైకోర్టు ‘యాగాలు చేస్తున్నారు గానీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇవ్వడం లేదంటూ’ కీలక వ్యాఖ్యలు చేసింది. సహజంగానే కరువు సమయాల్లో ప్రజల్లో ఆందోళన ఉంటుంది.
ఆసమయంలో పాలకులు యాగం చేస్తే ప్రభుత్వం ఏదో చేస్తున్నదనే అనే నమ్మకంతో ఉంటారు. నిజానికి ఇది సరికాదనే అభిప్రాయాలు హేతువాదులు, అభ్యుదయ వాదుల నుంచి వస్తున్నాయి. వర్షాలు రాకపోవడానికి ఎల్‌నినో కారణమని ఇప్పటికే వాతావరణ నిపుణులు , శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం తన శాఖ ద్వారా రైతులు, వృత్తిదారులకు సలహాలు,సూచనలు, హెచ్చరికలు జారీచేస్తూనే ఉంది. సమీక్షలు చేసి ఎల్‌నినోను ఎదుర్కోవడానికి ప్రభుత్వపరంగా శాస్ర్తీయ పరమైన చర్యలు కొన్ని తీసుకుంటూనే, మరోవైపు మూఢ నమ్మకాన్ని పెంచే వరుణయాగానికి దిగడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వమే ప్రజలను గందరగోళ పరిచే విధానానికి శ్రీకారం చుట్టడంపై అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం, యాగాలను సంస్కృతి కింద మార్చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. సైన్స్‌ను నమ్మకుండా, ప్రజలకు ఆ అవగాహనను పెంచకుండా ఓట్ల కోసమో, లేదా రాజకీయాల కోసమో యాగాలు చేపడితే వచ్చే ఫలితాలు భిన్నంగా, దారుణంగా ఉంటాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. లక్షల కోట్ల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి, రైతులకు పరిహారం ఇవ్వడం లేదు, కాగా కోట్లు ఖర్చు చేసి యాగాలు చేస్తే వర్షాలు వస్తాయా అని ప్రశ్నిస్తున్నవారూ లేకపోలేదు. గత బీఆర్‌ఎస్ హయాంలో వానల కోసం ఆయుత చండీ యాగం, సుదర్శన యాగం, జల సంకల్ప యాగం, రాజ శ్యామల సహిత సుబ్రమణేశ్వర యాగం చేపట్టారు.
ఆ యాగాల ఫలితాల మాటేమిటి ? అంటే ఫలించనట్టే కదా. అయినా మళ్లీ యాగం చేయడం ఏంటి ? అనే అభిప్రాయాలు విరివిగా వినిపిస్తున్నాయి. ప్రజల నమ్మకాలను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది గతంలోనూ జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, ఇతరులు ఈ యాగాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనిపై ‘వరుణ యాగం వేల ఏండ్ల సంప్రదాయం. ఇది ప్రకృతిని, ప్రార్థించడం, రైతులకు భోరోసాను ఇస్తుందని అంటుంటారు. కాగా యాగానికి, వర్షానికి సంబంధం లేదనేది స్పష్టం. ఎక్కడా ఇది శాస్ర్తీయంగా రుజువు కాలేదు కూడా. కృత్రిమ వర్షాలను కురిపించడానికి ఒకవైపు శాస్ర్తజ్ఞులు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సర్కారు యువతను అశాస్ర్తీయ భావాల వైపు మళ్లించడం ఎంతమాత్రం సరికాదు. అలాగే ఈ తరహా ప్రయోగాలు, ప్రయత్నాలు ప్రజలు, రైతులను నమ్మించాలనుకోవడం వాస్తవానికి విరుద్దమని శాస్ర్తవేత్తలు, అభ్యుదయవాదుల అభిప్రాయం.
వరుణ యాగంపై చర్చోపచర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



